అక్రమాలు పైపైకి..!

ABN , First Publish Date - 2020-02-20T10:29:43+05:30 IST

ఒక భవనానికి పై అంతస్తు నిర్మించుకోవాలంటే టౌన్‌ప్లానింగ్‌ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.

అక్రమాలు పైపైకి..!

విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు

నగరంలో ఐదు అక్రమ నిర్మాణాలను గుర్తించిన ఏసీబీ వన్‌టౌన్‌లో అధికం

 టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై చర్యలకు సిఫార్సు?


విజయవాడ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఒక భవనానికి పై అంతస్తు నిర్మించుకోవాలంటే టౌన్‌ప్లానింగ్‌ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. నిబంధనల ప్రకారం నిర్మాణం చేయాలి. దానికి వీఎంసీకి వేలాది రూపాయల ఫీజు చెల్లించాలి. ఇదంతా అవసరమా అనుకుంటున్నారు విజయవాడలోని భవన నిర్మాణదారులు. కార్పొరేషన్‌లో టౌన్‌ప్లానింగ్‌ అధికారులను, డివిజన్‌ స్థాయి అధికారులకు చేతులు తడిపేస్తే చాలు ‘పని’ పూర్తయిపోతోంది.  విజయవాడలో అక్రమ నిర్మాణాలు యథేచ్చగా సాగుతున్నాయని మరోసారి తేలిపోయింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుసగా రెండు రోజులపాటు నిర్వహించిన తనిఖీల్లో అక్రమాల బాగోతం బయటపడింది. విజయవాడ నగర పాలక సంస్థలోని టౌనిప్లానింగ్‌ విభాగంలో ఏసీబీ అధికారుల బృందం మంగళవారం పలు ఫైళ్లను పరిశీలించింది. పలువురు ఉద్యోగస్తుల వద్ద లెక్కకు మించి ఉన్న నగదును గుర్తించింది.


టౌన్‌ప్లానింగ్‌ కార్యాలయంలో వివిధ ఫైళ్లను సేకరించిన ఏసీబీ అధికారులు బుధవారం ఆయా భవనాలను పరిశీలించారు. కేదారేశ్వరిపేటలోని సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ వద్ద, వన్‌టౌన్‌లోని ఇస్లామ్‌పేట, ఆర్‌ఆర్‌ అప్పారావు వీధి, మహానాడు రోడ్డులో అక్రమ భవన నిర్మాణాలను గుర్తించారు. కొన్ని భవనాల యజమానులు అనుమతికి దరఖాస్తులు చేసుకున్నా, అధికారులు ఎలాంటి అనుమతి ఇవ్వకుండానే పనులను మొదలుపెట్టేశారు. కొంతమంది అనుమతి ఒక విధంగా తీసుకుని, నిర్మాణం మాత్రం తమకు నచ్చినట్టుగా చేపట్టారు. కొన్నింటిని అసలు అనుమతులే లేవని అధికారులు తేల్చారు.


ఆయా డివిజన్లలోని చైన్‌మన్లతో భవనాల కొలతలను తీయించారు. డివిజన్‌ స్థాయిలో ఉన్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, చైన్‌మన్లకు ముడుపులను రుచి చూపించి అనుమతులు లేకుండా భవనాలను నిర్మించేసుకుంటున్నారు. అక్రమ భవన నిర్మాణాల విషయంలో అధికారులు తూతూమంత్రంగా వ్యవహరించడం, పైరవీలకు ప్రాధాన్యం ఇవ్వడంతోనే ఇలాంటి నిర్మాణాలు పెరుగుతున్నా యని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క నగర పాలక సంస్థకు పాలకవర్గం లేకపోవడంతో కొంతమంది అధికారులు ఇదే అదునుగా భావించి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు గుర్తించిన అక్రమ నిర్మాణాల్లో ఎక్కువగా వన్‌టౌన్‌ ప్రాంతంలోనే ఉండడం గమనార్హం. 


Updated Date - 2020-02-20T10:29:43+05:30 IST