సర్కారు శాఖలపై ఏసీబీ నజర్‌

ABN , First Publish Date - 2021-07-31T07:00:56+05:30 IST

జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వశాఖల్లో పెరిగిపోతున్న అవినీతి అక్రమాలపై ఏసీబీ సీరియస్‌గా దృష్టి సారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతానికి భిన్నంగా ఏసీబీ ఇక మరింత క్రీయాశీలకంగా వ్యవరించబోతున్నట్లు తెలుస్తోంది.

సర్కారు శాఖలపై ఏసీబీ నజర్‌
ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు

సోషల్‌ మీడియా ద్వారా అందుబాటులోకి అధికారుల ఫోన్‌ వాట్సాప్‌ నంబర్‌లు 

ప్రజా ఫిర్యాదులపై యాక్షన్‌ప్లాన్‌ 

ఆరోపణలు ఉన్న చోట్ల ఇన్‌ఫార్మర్‌ల సహకారం 

అక్రమ ఆస్తులపైనా ఆరా

లంచావతారులపై సమాచారమిస్తే నజరానా

నిర్మల్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వశాఖల్లో పెరిగిపోతున్న అవినీతి అక్రమాలపై ఏసీబీ సీరియస్‌గా దృష్టి సారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతానికి భిన్నంగా ఏసీబీ ఇక మరింత క్రీయాశీలకంగా వ్యవరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎక్కువ అవినీతి జరుగుతున్న శాఖలను ఏసీ బీ టార్గెట్‌ చేసుకోబోతోందంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, వ్యవసా య, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీతో పాటు తదితర శాఖ ల్లో లంచాల వ్యవహారం ఎక్కువగా కొనసాగుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఇప్పటికే చాలా మంది ఆయా శాఖల్లో కొనసాగుతున్న లంచాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పాటు సీఎం కేసీఆర్‌కు, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌లకు ప్రతీరోజూ పలు శాఖల ద్వారా లంచాల కోసం ఒత్తిడికి గురవుతున్న సాధారణ జనం ట్విట్టర్‌లలో ఫిర్యాదులు చేస్తున్నారు. రోజురోజూకు ఆరోపణలు ఓ వైపు, ఫిర్యాదులు మరోవైపు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)ని మరింత క్రీయాశీలకం చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఏసీబీ ఆయా శాఖల వారీగా బాధితుల ద్వారా అందుతున్న ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోబోతోంది. ముఖ్యంగా రెవెన్యూ, వ్యవసాయశాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో పాటు ఈ శాఖల్లోని కొంతమంది అధికారులు, సిబ్బందిపై కూడా లంచాలకు సంబందించి ఫిర్యాదులు ఉండడమే కాకుండా సంబంధిత ఉన్నతాధికారుల ద్వారా కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు తమ వద్ద ఉన్న సమాచారం మేరకు లంచావతారుల జాబితాను శాఖల వారీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇన్‌ఫార్మింగ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకునే దిశలో ఏసీబీ ఉన్నతాధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో శాఖల వారీగా అనధికారిక ఇన్‌ఫార్మింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. దీంతో పాటు సాధారణ జనానికి ఏసీబీ శాఖ ఇక నుంచి మరింత క్రీయాశీలకంగా వ్యవహరించబోతున్నారన్న సంకేతాలను అందించే ప్రయత్నాలు మొదలుపెడుతోంది. దీని కోసం గానూ ఏసీబీ అధికారులకు సంబంధించి సెల్‌ఫోన్‌ నంబర్‌లు, వాట్సాఫ్‌ నంబర్‌లు, ఇతర కార్యాచరణతో కూడిన వివరాలన్నింటిపై విసృతంగా ప్రచారం చేపట్టింది. ఫేస్‌బుక్‌, వాట్సాఫ్‌, టెలిగ్రామ్‌ లాంటి సోషల్‌మీడియాను ఇక నుంచి లంచావతారుల భరతం పట్టేందుకు అస్త్రంగా మలుచుకోవాలని ఏసీబీ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే గత కొద్దిరోజుల నుంచి ఏసీబీ అధి కారులు జిల్లాలోని ఆరోపణలున్న పలు మండల కేంద్రాల్లో రహస్యంగా పర్యటించి ఫిర్యాదులు ఉన్న అధికారులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే లంఛాలు బలవంతంగా వసూ లు చేస్తున్న అధికారులకు సంబంధించిన సొంతఆస్తులు, అలాగే వారి బినామీల ఆస్థులపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. మొత్తానికి ఏసీబీ గతానికి భిన్నంగా రాబోయేరోజుల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరించబోతుండడంతో మరింత మంది లంచావతారుల గుట్టు రట్టు కాబోతోంది. ఇటీవలే నిర్మల్‌ మండలంలో ఓ ఎంపీఓ, గ్రామ కార్యదర్శి, సర్పంచ్‌ భర్తపైనా ఏసీబీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ తాజాగా ఖానాపూర్‌ తహసీల్దార్‌పై వచ్చిన ఆరోపణలను  పరిగణలోకి తీసుకున్న ఏసీబీ శుక్రవారం అక్కడి తహసీల్దార్‌ కార్యాలయంపై దాడి జరిపి ఫిర్యాదులన్నింటినీ తనిఖీ చేయడమే కాకుండా అందిన ఫిర్యాదులపై విచారణ కొనసాగించింది. ఈ వ్యవహారం జిల్లా రెవెన్యూశాఖలో కలకలం రేపుతోంది. మరికొన్ని తహసీల్దార్‌ కార్యాలయాలపై కూడా పెద్ద ఎత్తున వస్తున్న అవినీతి ఆరోపణలపై ఏసీబీ సీ రియస్‌గా ఫోకస్‌ పెటినట్టు ప్రచారం మొదలైంది. 

కీలకశాఖలపై నజర్‌

ముఖ్యంగా ప్రజల నుంచి ఎక్కువగా లంచాలు తీసుకుంటున్న శాఖలపైనే కాకుండా ఆ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపైనా కూడా ఏసీబీ అధికారులు ఇక నుంచి సీరియస్‌గా ఆరా తీయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే ఎక్కువగా లం చాలు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను పురస్కరించుకొని సంబందిత అధికారులు, సిబ్బంది వివరాలను సేకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. అవినీతి పరుల పక్కా సమాచారాన్ని సేకరించిన తరువాతనే వ్యూహత్మకంగా దాడి జరిపేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేయబోతున్నట్లు పేర్కొంటున్నారు. కాగా ఇటు రెడ్‌హ్యాండెడ్‌ కేసులతో పాటు అవినీతికి పాల్పడుతున్న అధికారులు, సిబ్బందుల ఆస్థులపైనా అలాగే వారి బినామీవ్యక్తుల ఆస్థులపై కూడా ఆరా తీసేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెవెన్యూశాఖతో పాటు ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, వ్యవసాయశాఖతో పాటు మరికొన్ని శాఖల్లో పెరిగిపోతున్న లంచాల వ్యవహారాన్ని మొదట సీరియస్‌గా తీసుకోవాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. గత కొంతకాలం నుంచి ఈ శాఖల్లో పెద్దఎత్తున అవినీతి కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు సాధారణజనం ఈ శాఖలపై చేసిన ఫిర్యాదులకు సరియైున ఆధారాలు చూపకపోతుండడంతో ఏసీబీ అధికారులు సీరియస్‌గా స్పందించలేకపోయారంటున్నారు. ఇక నుంచి అలాంటి విధానాన్ని పక్కన పెట్టి కేవలం ఫి ర్యాదులు గాని సమాచారం అందగానే మొదట లంచాల వ్యవహారానికి సంబంధించి పూర్తిగా కూపీ లాగేందుకు ఏసీబీ సిద్ధమవుతోందంటున్నారు. కూపీ లాగిన తరువాత వివరాలన్నింటినీ సేకరించి ఇక దాడి మొదలుపెట్టాలని ఏసీబీ నిర్ణయించినట్లు సమాచారం. 

సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం

ప్రతీశాఖలో సంబంధిత అధికారులు గాని అలాగే సిబ్బంది గాని ఎవరినైనా లంచాలు అడిగితే అలాగే వేధింపులకు గురిచేస్తే వెంటనే త మకు సమాచారం అందించాలంటూ ఏసీబీ పెద్దఎత్తున ప్రచారం మొ దలుపెట్టింది. దీని కోసం గానూ సోషల్‌మీడియాను అస్త్రంగా మలుచుకునేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఏసీబీ అధికారులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల ఆఫీసుల అడ్రస్‌ లు, వారి సెల్‌ఫోన్‌నంబర్‌లు, వాట్సాఫ్‌ నంబర్‌లన్నింటిపై విసృత ప్రచారం చేస్తున్నారు. వాట్సాఫ్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌, ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఏసీబీ కార్యకాలపాలకు సంబంధించి పెద్దఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. దీంతో పాటు ప్రతీ కార్యాలయం ముందు ఏసీబీ అధికారులకు సంబంధించిన పూర్తి సమాచారం, ఫోన్‌నంబర్‌లతో కూడిన వాల్‌పోస్టర్లను అతికిస్తున్నారు. అలాగే కరపత్రాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వారికి నజరానాలు కూడా అందిస్తామంటూ ఏసీబీ బాధితులకు అలాగే సమాచారం అందించే వారికి భరోసా కల్పిస్తోంది. 

ఇన్‌ఫార్మింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ 

కాగా లంచాలకు పాల్పడే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమాచారాన్ని పకడ్బందీగా సేకరించేందుకు ఏసీబీ కొత్తతరహా కార్యాచరణకు శ్రీకారం చుడుతోందంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లా, మండల స్థాయిల్లో ఇన్‌ఫార్మింగ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలన్న భావనతో ఏసీబీ ఉన్నట్లు చెబుతున్నారు. రహస్యంగా ఇన్‌ఫార్మర్‌ల ద్వారా అవి నీతి పరుల సమాచారం సేకరించి ఆ తరువాత తమ శాఖలోని సిబ్బం ది చేత దీనిపై మొదలు క్రాస్‌చెకింగ్‌ చేసి పక్కా యాక్షన్‌ప్లాన్‌తో దాడులు జరిపేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. 


Updated Date - 2021-07-31T07:00:56+05:30 IST