ఏసీబీ కలకలం

ABN , First Publish Date - 2022-08-05T05:33:30+05:30 IST

బొబ్బిలి మునిసిపాలిటీలో గురువారం దాదాపు రోజంతా అవినీతి నిరోధకశాఖాధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం సృష్టించింది.

ఏసీబీ కలకలం
మునిసిపల్‌ కమిషనర్‌తో చర్చిస్తున్న ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు


బొబ్బిలి మునిసిపాలిటీలో ఆకస్మిక తనిఖీలు
బొబ్బిలి, ఆగస్టు 4:
బొబ్బిలి మునిసిపాలిటీలో గురువారం దాదాపు  రోజంతా అవినీతి నిరోధకశాఖాధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం సృష్టించింది. రాత్రి 8 గంటల సమయానికీ తనిఖీలు కొనసాగాయి. పట్టణ ప్రణాళికా విభాగంలోని రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. డీఎస్పీ రామచంద్ర రావు ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు శ్రీనివాస్‌, ఏవీ రమణ, మహేశ్‌, ఎస్‌ఐలు ఇస్మాయిల్‌, వాసుదేవరావుతో పాటు మొత్తం 20 మంది కార్యాలయానికి వచ్చి తనిఖీలు చేపట్టారు.
 మునిసిపల్‌ కమిషనర్‌ సత్తారు శ్రీనివాసరావుతో డీఎస్పీ, ఇతర సిబ్బంది సుదీర్ఘంగా చర్చించారు. అలాగే టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ వరప్రసాద్‌, ఇతర సిబ్బంది నుంచి రికార్డులను తెప్పించి కూడా పరిశీలించారు. అంతకుముందు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి కొన్ని భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ టోల్‌ ఫ్రీ నెంబరు 1400కి వచ్చిన ఫిర్యాదుల మేరకు పట్టణ ప్రణాళికా విభాగంలో రికార్డులను పరిశీలిస్తున్నామన్నారు. శుక్రవారం కూడా తమ తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను భవన యజమానుల నుంచి వసూలు  చేశారా? లేదా? అన్ని పనులూ నిబంధనల మేరకు జరిగాయా? లేదా? అన్నదానిపై లోతుగా పరిశీలిస్తున్నామన్నారు. తమకు తెలిసిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సంబంధిత భవనాలకు వెళ్లి నిర్ధారించుకుంటామన్నారు. కూలం కుషంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. పూర్తి వివరాలను శుక్రవారం సాయంత్రానికల్లా వెల్లడిస్తామని డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మునిసిపల్‌ సిబ్బందిని ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా కట్టడి చేశారు. అలాగే బయట వ్యక్తులు లోపలికి వెళ్లకుండా నిఘా పెట్టారు.


Updated Date - 2022-08-05T05:33:30+05:30 IST