రెండోరోజూ Acb విచారణకు హాజరైన విజయభాస్కర్‌

ABN , First Publish Date - 2021-10-27T14:56:38+05:30 IST

అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎం.ఆర్‌. విజయభాస్కర్‌ రెండో రోజూ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా వుంటూ ఆయన ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు సంపాదించారనే

రెండోరోజూ Acb విచారణకు హాజరైన విజయభాస్కర్‌

చెన్నై(Tamilnadu): అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎం.ఆర్‌. విజయభాస్కర్‌ రెండో రోజూ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా వుంటూ ఆయన ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. గత జూలై 22న విజయభాస్కర్‌ నివాసగృహాలు, కుటుంబీకుల నివాసగృహాలు సహా 26 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపి నగదు, నగలు, కీలకమైన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. గత సెప్టెంబర్‌ 30న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు ఆయనకు సమన్లు జారీ చేశారు. కానీ ఆ రోజున ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో  సోమవారం ఉదయం ఆలందూరులోని ఏసీబీ కార్యాలయంలో నిర్వహించిన విచారణకు ఆయన హాజరయ్యారు. సుమారు ఎనిమిది గంటలపాటు ఏసీబీ అధికారులు విజయభాస్కర్‌ వద్ద తీవ్ర విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కూడా ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదు, నగలు, ఆస్తిపత్రాలు, దస్తావేజులకు సంబంధించి ఏసీబీ అధికారులు ఆయనపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఆ ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానాలిచ్చారు. ఈ విషయమై ఏసీబీ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ ఎంఆర్‌ విజయభాస్కర్‌ నివాసగృహాలలో తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న దస్తావేజులకు సంబంధించి విచారణ జరిపినట్టు తెలిపారు. అక్రమార్జనలకు సంబంధించి సమగ్రమైన సమాచారంతో త్వరలో కోర్టులో నివేదికగా సమర్పిస్తామని చెప్పారు.


ఈపీఎస్‌ సహాయకుడి అరెస్టు

రవాణాశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సహాయకుడు మణిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎడప్పాడి వద్ద మణి పదేళ్లకుగా పైగా సహాయకుడిగా పనిచేశారు. ఆ సమయంలో కడలూరు జిల్లాకు చెందిన తమిళసెల్వన్‌ అనే యువకుడి వద్ద రవాణాశాఖలో ఇంజనీర్‌ ఉద్యోగం తీసిస్తానంటూ మణి రూ.17లక్షలను వసూలు చేశాడు. మాట ప్రకారం ఉద్యోగం తీసివ్వకపోవడంతో తమిళసెల్వన్‌ సేలం జిల్లా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మణిని అరెస్టు చేశారు. ఈ మోసం కేసులో బ్రోకర్‌గా వ్యవహరించిన సెల్వకుమార్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2021-10-27T14:56:38+05:30 IST