ఎండలకు AC తెగ వాడేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..

ABN , First Publish Date - 2022-04-25T17:03:37+05:30 IST

ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఉష్టతాపం తట్టుకోలేక కొందరు...

ఎండలకు AC తెగ వాడేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..

  • ఏసీ.. ఎక్కువైతే ఇబ్బందే

హైదరాబాద్‌ సిటీ : ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఉష్టతాపం తట్టుకోలేక కొందరు ఇంటిపై కూల్‌ పెయింట్స్‌ వేయించుకుంటున్నారు. మరికొందరు కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లో ఫ్యాన్‌ గాలి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని, ఏసీని ఎక్కువ స్పీడ్‌లో పెట్టుకుంటే మాత్రం ఇబ్బందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అస్తమా, ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బయటి నుంచి ఇంటికి రాగానే కొందరు ఏసీలో ఉండాలనుకుంటారని, వెంటనే శరీరం అందుకు సహకరించదని, కొంతమందికి ఏసీ గాలి పడదని, అలాంటి వారికి జబ్బులు వచ్చే ముప్పు ఉందంటున్నారు.


జాగ్రత్తలు పాటిస్తేనే మేలు :-

ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు..

- చల్లటి వాతావరణం నుంచి ఒక్కసారిగా ఎండలోకి వెళ్లొద్దు.

- ఒక్కసారిగా ఎండ తగిలితే వడదెబ్బ ముప్పు ఉంటుంది.

- శరీరంపై ఎర్రటి దద్దుర్లు వచ్చే ప్రమాదముంది. 

- శరీరానికి మెల్లమెల్లగా ఎండ తగిలే విధంగా జాగ్రత్త వహించాలి.


శుభ్రం చేసిన తర్వాతే వినియోగించాలి

ఏసీని ఆటోమోడ్‌లో పెట్టుకోవాలి. శరీరానికి ఎంత సరిపోతుందో తెలుసుకోవాలి. ఏసీని వినియోగించే ముందు సర్వీసింగ్‌ చేయించాలి. ఏసీలో బ్యాక్టీరియా ఉండే అవకాశముంది. శుభ్రం చేయించకుండా వినియోగించడం వల్ల రెస్పిరేటరీ ట్రాక్స్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ముప్పు ఉంటుంది. వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ చల్లదనం ఉంటే హైపోథేరియా సమస్యను ఎదుర్కొంటారు. మెదడుపై ప్రభావం పడుతుంది. వారు పడుకునే గది చల్లగా ఉంటే ఇతర సమస్యలు వస్తాయి. - డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, పల్మనాలజిస్ట్‌, కామినేని ఆస్పత్రి.


వినియోగంలో.. :-

- ఎండలో నుంచి ఇంటికి రాగానే ఏసీ వేసుకోవద్దు.

- ఇంటి వాతావరణానికి శరీరం అలవాటు పడ్డ తర్వాత ఏసీ ఆన్‌ చేసుకోవాలి.

- వేడిగా ఉన్న శరీరాన్ని ఒకేసారి చల్లబరిస్తే  ఇబ్బందులు తప్పవు. 

- 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఏసీని పెట్టుకోవచ్చు. 

- వేసవిలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కాటన్‌ దుస్తులు ధరించాలి.


అస్తమా బాధితులు జాగ్రత్తలు తీసుకోవాలి

వేసవిలో కొందరికి ఏసీ పడదు. ఫంగస్‌ అలర్జీ ఉన్న వారు, అస్తమా బాధితులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీలను శుభ్రం చేయించిన తర్వాతే వినియోగించాలి. ఎయిర్‌ కూలర్లు వాడే వారు ఎప్పటికప్పుడు నీటిని తొలగించి శుభ్రం చేయించుకోవాలి. లేకపోతే వాటి నుంచి వచ్చే గాలితో ఇబ్బందులు వస్తాయి. అస్తమా లేని వారికి కూడా హైపర్‌ సెన్సిటివ్‌ న్యూమోనోసైటిస్‌ ఇబ్బందులు రావచ్చు. - డాక్టర్‌ రాకేష్‌, పల్మనాలజిస్ట్‌, స్టార్‌ ఆస్పత్రి


Updated Date - 2022-04-25T17:03:37+05:30 IST