ఏసీ.. బరువేసి..

ABN , First Publish Date - 2022-05-19T06:14:33+05:30 IST

ఏసీ.. బరువేసి..

ఏసీ.. బరువేసి..

కొత్తగా ఏసీ కొంటే అదనపు భారం

అదనపు లోడ్‌ పేరిట విద్యుత్‌ శాఖ బాదుడు

కిలోవాట్‌కు రూ.2 వేల వడ్డన 

రెండు జిల్లాల వినియోగదారులపై రూ.24.8 కోట్ల భారం


కొమరాడ శ్రీనివాసరావు.. గుడివాడలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన మెకానిక్‌. ఏప్రిల్‌ 22న రూ.50 వేలు వెచ్చించి ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఏసీ కొన్నాడు. మే నెలలో విద్యుత్‌ బిల్లు సాధారణం కంటే రూ.4,500 ఎక్కువగా వచ్చింది. ఇదేంటని విద్యుత్‌ శాఖ ఈఆర్‌సీ కార్యాలయంలో సంప్రదించగా, లోడ్‌ ఎక్కువైంది. అందుకే బిల్లు ఎక్కువగా వచ్చిందని చెప్పడంతో ఆయన కంగుతిన్నారు.


బండి అశోక్‌కుమార్‌.. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వేసవి భరించలేకుండా ఉండటంతో ఏప్రిల్‌ 6న ఏసీ కొన్నారు. అప్పటి వరకు నెలకు రూ.600 వచ్చే విద్యుత్‌ బిల్లు కాస్తా మేలో రూ.2 వేలు వచ్చింది. దీనికి తోడు అదనపు లోడ్‌ చార్జీల కింద కిలోవాట్‌కు రూ.2 వేల వంతున రూ.4 వేలు కట్టాలని నోటీసు ఇచ్చారు. విద్యుత్‌ శాఖ అధికారులను సంప్రదించగా, తమ తనిఖీల్లో నిర్దేశిత లోడ్‌ కంటే ఎక్కువగా వాడుతున్నట్లు తేలిందని సమాధానమిచ్చారు. చేసేదేమీ లేక బిల్లు కట్టారు. 


..ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదంతాలు. ఓవైపు ఉక్కపోత.. ఫ్యాన్‌ వేస్తే వేడిగాలి.. తట్టుకోలేని జనం ఏసీలవైపు వెళ్తుంటే, దొరికిందే చాన్స్‌ అంటూ విద్యుత్‌ అధికారులు అదనపు బాదుడుకు సిద్ధమైపోతున్నారు. ఏసీ కొన్న వారికి అదనపు లోడ్‌ పేరిట ఒక్కో కనెక్షన్‌కు రూ.4 వేలు అదనంగా కట్టాలని నోటీసులు జారీ చేస్తున్నారు. దీనిని జగనన్న వేసవి కానుకగా అభివర్ణిస్తూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ నడుస్తుండటంతో ఈ వేసవిలో కరెంట్‌ బిల్లు హాట్‌ టాపిక్‌గా మారింది. 

గుడివాడ, మే 18 : అదనపు లోడ్‌ పేరుతో విద్యుత్‌ శాఖ జనాన్ని బాదేస్తోంది. జిల్లావ్యాప్తంగా వేలాది కుటుంబాలు రుణాల మీదనో, వాయిదా పద్ధతిలోనో ఏసీలు కొని సేదతీరుతున్నారు. ఏప్రిల్‌ విద్యుత్‌ వాడకానికి సంబంధించి మే నెలలో వచ్చే బిల్లుల్లో అదనపు బాదుడు గురించి తెలుసుకుని లబోదిబోమంటున్నారు. ఏసీ వాడకం ఉంటే విద్యుత్‌ బిల్లు నెలకు తప్పనిసరిగా అదనంగా రూ.వెయ్యి వస్తుంది. దానికితోడు లోడ్‌ చార్జీల పేరిట రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. 

మూడు నెలల్లో 62 వేల ఏసీలు

జిల్లా పరిధిలోని ఎలకా్ట్రనిక్స్‌ దుకాణాల నుంచి మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో సుమారు 62 వేల వరకు ఏసీలు అమ్ముడయ్యాయని అంచనా. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ప్రధానంగా 15 వరకు ఏసీ డిస్ట్రిబ్యూటరీ ఏజెన్సీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ మార్కెట్‌లో నేరుగా కొనే ఏసీలు వేలల్లోనే ఉంటాయని తెలుస్తోంది. ఒక్కో ఏసీ సగటున రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వెచ్చించి కొంటున్నారు. అదే భారం అనుకుంటే విద్యుత్‌ అదనపు బాదుడేంటని వినియోగదారులు వాపోతున్నారు. 

ఎందుకిలా?

సాధారణంగా విద్యుత్‌ శాఖ నుంచి కనెక్షన్‌ తీసుకునే సమయంలో లోడ్‌ టారిఫ్‌ పేరిట ఇంటి సామర్థ్యానికి అనుగుణంగా రూ.3 వేల నుంచి రూ.7,500 వరకు డిపాజిట్‌ చెల్లిస్తారు. కానీ, అదనపు పరికరాలు కొంటే చాలు లోడ్‌ ఒక్కసారిగా పెరిగిపోతోంది. దీంతో విద్యుత్‌ అధికారులు లోడ్‌ కంటే ఎక్కువగా వినియోగిస్తున్నారని ప్రజల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు దిగుతున్నారు. విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్న సమయంలో పేర్కొన్న కెపాసిటీకి మించి విద్యుత్‌ వాడకం ఉంటే కిలోవాట్‌కు అదనంగా డెవలప్‌మెంట్‌ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు, అప్లికేషన్‌ ఫీజు, సూపర్‌విజన్‌ చార్జీలు, ఎస్‌జీఎస్‌టీ, సీజీఎస్‌టీ తదితరాల పేరిట మొత్తం రూ.2 వేలు చెల్లించమంటున్నారు. ఏసీలు ఉంటే అదనంగా రెండు కిలోవాట్ల విద్యుత్‌ వాడకం తప్పనిసరవుతుంది.  దీంతో కొత్తగా ఏసీలు కొన్నవారిని అదనపు రుసుం చెల్లించాలని విద్యుత్‌ శాఖ ఆదేశాలు జారీ చేస్తోంది. గడువు తేదీలోగా చెల్లించకపోతే కనెక్షన్‌ తొలగిస్తామని నోటీసులిస్తోంది. ఏసీలు కొన్న వారందరికీ సగటున రూ.4 వేలు చెల్లించాలని నోటీసులు జారీ అవుతున్నాయి. ఒక్కో వినియోగదారుడిపై సగటున రూ.4 వేలు అదనపు భారం పడితే జిల్లాలో కొత్తగా కొన్న 62 వేల వినియోగదారులపై రూ.24.8 కోట్ల వరకూ భారం పడనుంది.

పెరిగిన విద్యుత్‌ వినియోగం

ఉమ్మడి జిల్లాల్లో గడిచిన రెండు నెలల వ్యవధిలోనే రోజువారీ విద్యుత్‌ వినియోగం ఎనిమిది మిలియన్‌ యూనిట్ల మేర పెరిగింది. కేవలం ఏసీల వినియోగం వల్లే ఇది పెరిగిందని విద్యుత్‌ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఏసీల వాడకం తగ్గించాలని ఏపీసీపీడీసీఎల్‌ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు.  


సర్వీస్‌ కెపాసిటీ పెరిగితే చెల్లించాల్సిందే.. 

సర్వీస్‌ కెపాసిటీ పెరిగితే అదనపు చార్జీలు చెల్లించాల్సిందే. విద్యుత్‌ సర్వీస్‌ తీసుకునే సమయంలో అందులో పేర్కొన్న కెపాసిటీ మేరకే వాడుకోవాలి. ఎక్కువ వాడితే కిలోవాట్‌కు రూ.2 వేల అదనపు చార్జీలు చెల్లించాలి. అదనపు చార్జీల రూపంలో వసూలు చేసే మొత్తాలను నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచడానికి వినియోగిస్తాం.  - రామకృష్ణ, డీఈఈ, గుడివాడ, ఏపీసీపీడీసీఎల్‌

Updated Date - 2022-05-19T06:14:33+05:30 IST