జాతి పునర్నిర్మాణానికి వెన్నెముక ఏబీవీపీ

ABN , First Publish Date - 2021-07-09T06:22:08+05:30 IST

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు భారతదేశంలో క్రియాశీలమైన, ప్రభావశీలమైన ఓ విద్యార్థి ఉద్యమం. జ్ఞానం, శీలం, ఏకత- ముఖ్యాంశాలుగా సంఘటనాత్మకమైన కార్యాచరణకు...

జాతి పునర్నిర్మాణానికి వెన్నెముక ఏబీవీపీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు భారతదేశంలో క్రియాశీలమైన, ప్రభావశీలమైన ఓ విద్యార్థి ఉద్యమం. జ్ఞానం, శీలం, ఏకత- ముఖ్యాంశాలుగా సంఘటనాత్మకమైన కార్యాచరణకు పునాది వేసిన స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్, స్వర్గీయ దత్తాజీ డిండోల్కర్, సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ గార్లను స్మరించుకోవాల్సిన రోజు ఇది. 


వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి పునర్నిర్మాణం అన్నది ధ్యేయంగా నిరంతరం విద్యారంగంలో పనిచేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏబీవీపీ. భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో ‘వందేమాతరం’ మన జాతీయ గేయంగా పొందుపర్చటంలో పరిషత్ చేసిన భావ జాగరణ, నిర్మాణాత్మక ఆందోళన చెప్పదగినవి. రాజ్యాంగంలో ‘India that is Bharath’ అని నిలిపేందుకు పరిషత్ రాజ్యాంగ సభలోని పెద్దలు, మేధావులు, విద్యావేత్తలను చైతన్యవంతుల్ని చేసింది ఏబీవీపీ. మన ప్రాంతీయ భాషల్ని పరిరక్షిస్తూనే దేశవ్యాప్తంగా సాంస్కృతిక ఏకత్వానికి జాతీయ భాష హిందీ ఎంత కీలకమో తెలియజేసి, హిందీని జాతీయభాషగా ఏర్పాటు చేయటంలో విద్యార్థి పరిషత్ కృషి ఎంతో ఉంది. 1975లో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ఏబీవీపీ క్రియాశీలక పాత్ర పోషించింది. నాన్ కాంగ్రెస్ ఉద్యమాన్ని నిర్మించి, దేశవ్యాప్తంగా అనేకమంది విద్యార్థులను, యువకులను ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములను చేసింది. తద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడింది. 


1969 తెలంగాణ ఉద్యమంలోనూ ఏబీవీపీ క్రియాశీలక పాత్ర పోషించింది. 1997 నెల్లూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలుగా విభజించాలని తీర్మానం చేసింది. ఏ రాజకీయ పార్టీ సాహసం చేయనటువంటి సందర్భంలో ఏబీవీపీ ఈ తీర్మానాన్ని చేయడం విశేషం. దానికి అనుగుణంగానే కృష్ణ, గోదావరి జలాలను బీడు భూములకు అందించి లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకురావాలని బాసర నుంచి శ్రీశైలం వరకు సస్యశ్యామల రథయాత్రను ఏబీవీపీ నిర్వహించింది. ఈ యాత్ర తెలంగాణ పల్లెల్లో సైతం తెలంగాణ ఆవశ్యకతను గుర్తించేట్లు చేసింది. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ సాధనను తమ ఎజెండాలో చేర్చుకోక తప్పలేదు. తెలంగాణ సాధనకై డిసెంబర్ 8, 2009న ఏబీవీపీ తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంతో తెలంగాణ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అదేరోజు అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు. రాజకీయ నాయకుల కుట్రలతో వెనక్కు తగ్గినా యుపిఎ ప్రభుత్వంపై అనేక రూపాలలో ఏబీవీపీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ నిర్మాణాత్మక ఉద్యమంలో భాగంగా ఏబీవీపీ ‘నా రక్తం -– నా తెలంగాణ’ పేరిట ఒకేరోజు 20వేల మంది విద్యార్థులు, యువకులచే రక్తదానం చేయించి రికార్డు సృష్టించింది. 2010 జనవరి 23వ తేదీన నిజాం కళాశాల గ్రౌండులో వేలాదిమంది విద్యార్థులచే భారీ రణభేరి నిర్వహించింది. ఈ బహిరంగ సభలో నాటి లోకసభా ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరాదని, బతికుండి రాబోయే తెలంగాణను కనులారా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులతో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్... ఈ నాలుగు స్థలాల నుంచి ఏబీవీపీ ఆధ్వర్యంలో మొదలైన పాదయాత్ర ఉస్మానియా యూనివర్సిటీలో మరో రణభేరి బహిరంగ సభతో ముగిసింది. ఇలా అనేక ఉద్యమాలను పట్టణం నుంచి పల్లెల వరకు, యూనివర్సిటీల నుంచి ప్రతి కళాశాల వరకు నిర్మించి నాటి యుపిఎ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంలో ఏబీవీపీ కీలక పాత్ర పోషించింది.


దేశవ్యాప్తంగా వివిధ నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా ప్రపంచంలోనే నంబర్ ఒన్ విద్యార్థి సంస్థగా గుర్తింపు పొందింది ఏబీవీపీ. కాలానుగుణంగా వచ్చే వివిధ రకాల మార్పులను స్వీకరిస్తూ నవ్య నూతన సంస్థగా విద్యార్థుల చేత వేనోళ్ళ కొనియాడబడుతోంది. విద్యార్థులలో నూతనత్వం, సృజనాత్మకతను పెంపొందించటానికి, వివేకానందుడు కలలుగన్న భారతాన్ని పునర్నిర్మించేందుకు, విద్యార్థుల వివిధ రకాల అభిరుచులకు అనుగుణంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ వివిధ ఫోరమ్స్‌ను నిర్వహిస్తున్నది. వీటి ద్వారా జాతి పునఃనిర్మాణంలో ప్రతి ఒక్క విద్యార్థిని భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నది. థింక్ ఇండియా ఫోరం, వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ & యూత్, MeDeVision మెడికల్ & డెంటల్ విద్యార్థుల ఫోరమ్, స్టూడెంట్ ఫర్ డెవలప్‌ మెంట్ ఫోరమ్, రాష్ట్రీయ కళామంచ్ ఫోరమ్, టెక్నికల్ సెల్ ఫోరమ్, ఇంకా అగ్రికల్చర్ విద్యార్థుల కోసం అగ్రివిజన్, ఆయుర్వేద, యునాని, సిద్ధ విద్యార్థుల కోసం జిజ్ఞాస, ఆవిష్కార్... ఇలా మొత్తం 15 ఫోరమ్స్ ద్వారా ఏబీవీపీ పనిచేస్తుంది.


నేటి విద్యార్థి రేపటి పౌరుడు అనేది గతం, నేటి విద్యార్థి నేటి పౌరుడే అనేది ప్రస్తుతం. నేటి విద్యార్థులు సమకాలీన పరిస్థితులపై, సమాజంలోని అనేక విషయాలపై అవగాహనతో స్పందిస్తూ, పరిష్కారాలను చూపే విధంగా వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే అఖిల భారత విద్యార్థి పరిషత్ ధ్యేయం.

(జూలై 9: ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం)

శ్రీశైలం వీరమల్ల

జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏబీవీపీ.

రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ

Updated Date - 2021-07-09T06:22:08+05:30 IST