విస్తారంగా వర్షాలు!

ABN , First Publish Date - 2022-08-09T08:59:00+05:30 IST

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

విస్తారంగా వర్షాలు!

పలు జిల్లాల్లో పొంగుతున్న వాగులు

నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)


ల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల పంటలు నీటి పాలయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నవాబ్‌పేట మండలం యస్మన్‌గండ్ల పెద్దచెరువుకు గండి పడడంతో 270 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నారాయణపేట జిల్లాలో పత్తి, కంది పంటలు నీటి పాలయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో మత్తడి వాగు ఉప్పొంగడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లోని సింగరేణి ఓపెన్‌ కాస్టు గనుల్లో సోమవారం  20 వేల టన్నులు, భద్రాద్రి జిల్లాలో 60 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబంధం వాగు పొంగడంతో 40 ఎకరాల్లో వరి నీట మునిగింది. వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలోని బ్రాహ్మణపల్లి-దిర్సంపల్లి మధ్య కాక్రవేణి వాగు ఉధృతికి ఇరు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం స్టేషన్‌కాలనీకి మహేశ్‌ (26), కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన వీరశేఖర్‌(30) సోమవారం నల్లవాగులో చేపలు పడుతుండగా వాగు ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం చెక్‌డ్యాంలో చేపలు పడుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తమల్లూరులో భారీ వర్షానికి ఇల్లు కూలి మంగమ్మ (65) చనిపోయింది.  


శ్రీశైలానికి 1.38 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు సోమవారం 1.38 లక్షలు, నాగార్జునసాగర్‌కు 70 వేలు, తుంగభద్రకు 1.26 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 72 వేలు, నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 70 వేలు, జూరాలకు 43 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇక, గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 42,570, ఎల్లంపల్లికి 1.74 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీకి 5.33 లక్షలు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీకి 6.67 లక్షలు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్‌)కు 6.49 లక్షలులు, అన్నారం(సరస్వతి) బ్యారేజీకి 1.38 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది.  


24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం 

రాష్ట్రంలో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ఇచ్చింది. బుధ, గురువారాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నట్లు పేర్కొంది. 

Updated Date - 2022-08-09T08:59:00+05:30 IST