విస్తారంగా వర్షాలు!

ABN , First Publish Date - 2022-07-03T06:36:12+05:30 IST

జిల్లాలో ఓ మోస్తార్‌ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు కొన్ని మండలాల పరిధిలో చెరువులోకి నీళ్లు చేరుతుండగా.. చిన్నచిన్న వాగులు సైతం పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో ఇంకా సరాసరి సగటు వర్షపాతం అన్ని మండలాల్లో నమోదుకాకున్నా.. కొన్ని మండలాల్లో సగటుకు మించి వర్షం పడింది. ఈ వర్షంతో రైతులు కూడా పంటల సాగును ముమ్మరం చేశారు. జిల్లాతో పాటు

విస్తారంగా వర్షాలు!
వర్ని మండలంతో పాటు, మోపాల్‌ మండలంలోని మంచిప్పలో సాగవుతున్న వరి పంట

జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు

వ్యవసాయ పనుల్లో అన్నదాతల బిజీబిజీ

అంతటా ఆరుతడి పంటలను సాగు చేస్తున్న రైతులు

గ్రామాల్లో కొనసాగుతున్న వరి నాట్లు

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి స్వల్పంగా కొనసాగుతున్న వరదనీటి ప్రవాహం

ప్రధాన ప్రాజెక్టుల్లోనూ క్రమక్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షాకాలం సీజన్‌ పనులు

నిజామాబాద్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఓ మోస్తార్‌ నుంచి  భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు కొన్ని మండలాల పరిధిలో చెరువులోకి నీళ్లు చేరుతుండగా.. చిన్నచిన్న వాగులు సైతం పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో ఇంకా సరాసరి సగటు వర్షపాతం అన్ని మండలాల్లో నమోదుకాకున్నా.. కొన్ని మండలాల్లో సగటుకు మించి వర్షం పడింది. ఈ వర్షంతో రైతులు కూడా పంటల సాగును ముమ్మరం చేశారు. జిల్లాతో పాటు మహారాష్ట్రలో ఎస్సారెస్పీకి ఎగువన ఈ వర్షాలు పడుతుండడంతో ప్రాజెక్టులోకి వరదనీటి ప్రవాహం పెరుగుతోంది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు సైతం క్రమక్రమంగా పెరుగుతున్నాయి.

గడిచిన రెండు రోజులుగా వర్షాలు

జిల్లాలో గడిచిన రెండు రోజులు పలు మండలాల పరిధిలో ఓ మోస్తార్‌ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 190.8 మి.మీ.ల వర్షం పడాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 163.9 మి.మీ.ల వర్షం పడింది. జిల్లాలో శనివారం సరాసరి 18.7 మి.మీ.ల వర్షం నమోదైంది. జిల్లాలోని నవీపేట మండలంలో అత్యధికంగా 56.20 మి.మీ.ల వర్షం పడింది. జిల్లాలోని 29మండలాలు ఉండగా 10 మండలల్లో సగటు వర్షపాతం కంటే ఎక్కువగా వర్షం పడింది. జిల్లాలోని మిగతా ఐదు మండలాల్లో సగటు వర్షపాతం పడగా.. 14 మండలాల్లో సగటుకన్న తక్కువ వర్షం పడింది. గత సంవత్సరం జూన్‌ నెలలోనే భారీ వర్షలు పడగా.. ఈ సంవత్సరం మాత్రం జూలై నెల ఆరంభమైనా భారీ వర్షాలు అన్ని మండలాల పరిధిలో పడలేదు.

జోరుగా పంటల సాగు  

జిల్లాలో భారీ వర్షాలు కొన్ని మండలాల పరిధిలో పడడం.. మరికొన్ని మండలాల పరిధిలో జల్లుల నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతుండడంతో రైతులు కూడా పంటల సాగును పెంచారు. ఆరుతడి పంటలకు సమయం దగ్గరపడుతుండడంతో ఎక్కువ మంది రైతులు ఈ పంటలనే వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సోయా 42 వేల ఎకరాల్లో వేశారు. వానాకాలంలో అత్యధికంగా సోయాను ఆరుతడి పంటగా రైతులు సాగు చేస్తున్నారు. ఆర్మూర్‌, బోదన్‌ డివిజన్‌ పరిధిలో ఎక్కువగా వేస్తున్నారు. ఈనెల చివరిలోపు ఆరుతడి పంటలు.. ముఖ్యంగా సోయా పూర్తిచేయాల్సి ఉండడంతో, ఎక్కువ మంది రైతులు వేస్తున్నారు. సోయాతో పాటు మొక్కజొన్న 15 వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పసుపు జిల్లాలో 10వేల ఎకరాలకు పైగా ఇప్పటి వరకు రైతులు వేశారు. పసుపు అంతర పంటగా మొక్కజొన్న కూడా సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈ పంటలేకాకుండా మినుము, పెసర, నువ్వులు, కంది, పత్తి కొద్ది విస్తీర్ణంలో రైతులు వేస్తున్నారు.

55వేల ఎకరాలకు పైగా వరి నాట్లు

జిల్లాలో ఇబ్బడిముబ్డడిగా వర్షాలు పడుతుండడంతో వరి సాగును రైతులు ఎక్కువగా చేస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో అన్ని మండలల పరిధిలో వరినాట్లను రైతులు మొదలుపెట్టారు. జిల్లాలో ఇప్పటి వరకు 55 వేల ఎకరాలకు పైగా వరినాట్లను వేశారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో అత్యధికంగా వరినాట్లు పడ్డాయి. నిజాంసాగర్‌ నీటిని విడుదల చేయడంతో ఈ వరి సాగు ఎక్కువ మంది రైతులు కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఈ బోధన్‌తో పాటు ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో కూడా వరినాట్లను మొదలుపెట్టారు. జిల్లాలో గుత్ప, అలీసాగర్‌, లక్ష్మి కాల్వలకు కూడా సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉండడంతో.. ఎక్కువగా నాట్లను మొదలుపెట్టారు. ఈ నెలాఖరులోపు ఎక్కువ మొత్తంలో వరి సాగు పూర్తి చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. 

ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

జిల్లాలో పడుతున్న వర్షాలతో పాటు మహారాష్ట్రలో ఎస్సారెస్పీకి ఎగువన పడుతున్న వర్షాలతో ప్రాజెక్టులోకి కొద్దిమొత్తంలో వరద కొనసాగుతోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తివేయడంతో ప్రాజెక్టులోకి ప్రస్తుతం 15,046 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులకు గాను 1067.6 అడుగుల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులో 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 25 టీఎంసీలకు నీళ్లు చేరుకున్నాయి. బాబ్లీ గేట్లు ఎత్తడం వల్ల ఇదే రీతిలో చిన్న వర్షాలకు వరద వచ్చే అవకాశం ఉందని అఽధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు మహారాష్ట్రలో పెరిగితే ఇంకా వరద పెరిగే అవకాశం లేకపోలేదు. జిల్లాలో గడిచిన రెండు రోజులుగా పడుతున్న వర్షాల వల్ల పంటల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలు ఇలానే పెరిగితే 15రోజుల్లో భారీగా పంటల విస్తీర్ణం పెరుగుతుందని వారు తెలిపారు. కాగా, ఆరుతడి పంటలను వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-03T06:36:12+05:30 IST