పక్కాగా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-06T04:43:43+05:30 IST

కర్ఫ్యూను జిల్లా అంతటా పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. మండల, మున్సిపల్‌ అధికారులతో బుధవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 144 సెక్షన్‌ను పక్కగా అమలు చేయాలని, ఒకేచోట నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడ కుండా చూడాలన్నారు.

పక్కాగా కర్ఫ్యూ
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

మధ్యాహ్నం 12 వరకూ 144 సెక్షన్‌ 

పాజిటివ్‌ వచ్చిన వారికి హోం ఐసోలేషన్‌ కిట్లు 

రేషన్‌ పంపిణికీ ఆటకం లేకుండా ఏర్పాట్లు 

టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, మే 5: కర్ఫ్యూను జిల్లా అంతటా పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. మండల, మున్సిపల్‌ అధికారులతో బుధవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 144 సెక్షన్‌ను పక్కగా అమలు చేయాలని, ఒకేచోట నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడ కుండా చూడాలన్నారు. పత్రిక, ప్రసార మాధ్యమాలు, ఉత్పత్తి యూనిట్లు, బ్యాంకులు, వ్యవసాయ కార్యకలా పాలు, కొవిడ్‌ వైద్య సేవలు, వ్యాక్సినేషన్‌ తదితర కార్యకలాపాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పారు. కర్య్పూ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాల్టీల్లో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. విజయనగరం పట్టణంలో సరఫరా కోసం ఆండ్ర రిజర్వాయరు నుంచి  నీటిని విడుదల చేసే ఆంశంపై మాట్లాడామని తెలిపారు. మున్సిపల్‌ అధికారులు, ప్రజారోగ్య, ఇంజినీరింగ్‌ శాఖ అధికారులు వారితో సమన్వయం చేసుకుని తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. 

పారిశుద్ధ్యంపై దృష్టి

మున్సిపాల్టీల్లో పారిశుధ్య లోపం లేకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. కర్ఫ్యూ సమయంలో రేషన్‌ పంపిణీకి ఆటంకాలు లేకుండా చూసేందుకు సంచార వాహనాల సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఉపాధి పనులను కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొవిడ్‌ వ్యాప్తిని నిరోధించేందుకు గ్రామాల్లోని సచివాలయ సిబ్బంది, వలంటీర్‌ వ్యవస్థను వినియోగించుకోవాలని కలెక్టర్‌ చెప్పారు. ప్రతి ఇంటికి  వెళ్లి మాస్క్‌ ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచడం, భౌతిక దూరం పాటించడం వంటి ఆంశాలపై అవగాహన కలుగజేయాలన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రతి ఒక్కరికీ హోం ఐసోలేషన్‌ కిట్‌ అందేలా చూడాలరని చెప్పారు. ఇప్పటి వరకూ 35 వేల హోం ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ పూర్తి చేశామని, మరో 28 వేల కిట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పాజిటివ్‌ అని తేలిన మూడు గంటల్లోనే ఆ వ్యక్తికి హోం ఐసోలేషన్‌ కిట్‌ అందాలన్నారు. జిల్లాలో 3,600 పడకల సామర్థ్యంతో 7 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కరోనా చికిత్స కోసం జిల్లాలో 30 ఆసుపత్రులను గుర్తించగా ప్రసుత్తం 20 ఆసుపత్రుల్లో కోవిడ్‌ బాధితులు ఉన్నారని, అవసరాన్ని బట్టి మిగిలిన ఆసుపత్రుల్లోనూ బాధితులను చేరుస్తామని ఆయన తెలిపారు.

నేటి నుంచి టీకాలు

జిల్లాకు కోవిషీల్డ్‌ టీకాలు చేరాయని, గురువారం నుంచి వేస్తామని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి గోపాలకృష్ణ వివరించారు. ఈనెల 14 వరకూ రెండో డోసు వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. 45 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే ప్రసుత్తం వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల నిర్వహణపై జాయింట్‌ కలెక్టర్‌(ఆసరా) జె.వెంకటరావు వివరించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీలు కిషోర్‌ కుమార్‌, మహేష్‌ కుమార్‌,సబ్‌ కలెక్టర్‌ విదేఖరే, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, ఆర్‌డీవో భవానీశంకర్‌, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, డీఆర్‌వో గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-06T04:43:43+05:30 IST