రెండోరోజూ సంపూర్ణ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-12T18:06:27+05:30 IST

రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ రెండో రోజూ కొనసాగింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు....

రెండోరోజూ సంపూర్ణ లాక్‌డౌన్‌

నిబంధనలు ఉల్లఘించిన వారిపై కేసులు

సహకరించండి: ప్రభుత్వ విజ్ఞప్తి


చెన్నై/ప్యారీస్‌: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ రెండో రోజూ కొనసాగింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కరోనా వైరస్‌ కట్టడికి సహకరించాలని ప్రజలకు ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా, పలు జిల్లాల్లో నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్యావసర సరుకులు విక్రయించేందుకు కూరగాయలు, కిరాణా దుకాణాలను ప్రభుత్వం అనుమతించింది. తొలిరోజైన సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి వాహనాల రాకపోకలు, ప్రజల సంచారం లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించా యి. అయినప్పటికీ 104, 108 అంబులెన్స్‌లు, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, సిబ్బంది వాహనాలు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల కోసం చెన్నై మెట్రోపాలిటన్‌ రవాణా సంస్థ నడిపిన బస్సులు మాత్రమే తిరిగాయి. భద్రతా విధుల్లో పాల్గొన్న పోలీసులు అనవసరంగా రోడ్లపైకి వచ్చిన ప్రజలను హెచ్చరించి, ఇళ్లకు పంపిస్తున్నారు. అదేవిధంగా వాహనాల్లో బలాదూర్‌గా తిరుగుతున్న వాహనచోదకులను అడ్డుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. చెన్నై నగరంలో సోమవారం 30 మందిపై కేసులు నమోదు చేసినట్టు గ్రేటర్‌ చెన్నై పోలీసు  శాఖ తెలిపింది. రాష్ట్ర డీజీపీ త్రిపాఠి సూచనల ప్రకారం, లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపై తిరిగిన వాహనాలను స్వాధీనం చేసుకోకుండా పోలీసులు తమ సెల్‌ఫోన్లలో ఫొటో తీసుకొని వాహనచోదకులను హెచ్చరించి పంపారు. కరోనా వ్యాప్తి నియంత్రించేలా విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు మద్దతు తెలపాలని, అప్పుడే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని వైద్యనిపుణులు కోరారు. అలాగే, ఎండ తీవ్రత అధికంగా ఉండడాన్ని కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచిస్తున్నారు.

Updated Date - 2021-05-12T18:06:27+05:30 IST