మోదీ పాలనలో సంపూర్ణ వికాసం

ABN , First Publish Date - 2020-08-15T06:43:08+05:30 IST

అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నిర్మాణాత్మక, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, ప్రపంచ చిత్రపటంలో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేసేందుకు అనితర సాధ్యమైన నాయకత్వాన్ని మోదీ అందించారు.

మోదీ పాలనలో సంపూర్ణ వికాసం

మోదీ ప్రభుత్వం ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రానికి రూ.7వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని సమకూర్చింది. కరోనాపై పోరుకు గాను 10.09 లక్షల మాస్క్ లను 2 లక్షల పీపీఈ కిట్లను, 1175 వెంటిలేటర్స్ ను, 42.5 లక్షల హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లను తెలంగాణకు కేంద్రం అందించింది. 


అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నిర్మాణాత్మక, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, ప్రపంచ చిత్రపటంలో భారత్‌ స్థానాన్ని బలోపేతం చేసేందుకు అనితర సాధ్యమైన నాయకత్వాన్ని మోదీ అందించారు. ఈ కారణంగానే మోదీ పట్ల భారత ప్రజల అభిమానం దినదిన ప్రవర్థమానమవుతుంది. 


శతాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్య చరిత్రలోనే చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరాముడి జన్మస్థలంలోనే శాశ్వత రామ మందిరానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా భూమి పూజ జరిగింది. రామాలయ భూమి పూజతో ప్రతి హిందువు మది శ్రీరామ నామంతో భక్తి పారవశ్యంతో పులకితమవుతోంది.


జాతి నిర్మాణంలో విద్యదే కీలక పాత్ర అటువంటిది ముప్పై ఏండ్లపాటు ఎడ్యుకేషన్‌ పాలసీలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. ఒక మూస విధానంలో చదువులు కొనసాగాయి. ఇప్పటివరకు దేశంలో వాట్‌ టు థింక్ అనే రీతిలో ఎడ్యుకేషన్‌ పాలసీ కొనసాగింది. ఇక నుండి హౌ టు థింక్ కోణంలో చదువులు కొనసాగేలా ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఒకే దేశం- ఒకే విద్యా విధానం లక్ష్యంగా నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీకి శ్రీకారం చుట్టారు. ఈ విధానం ద్వారా క్రియేటివిటీ, ఇన్నోవేషన్‌ థి¸ంకింగ్‌ పెరుగుతుంది. అలాగే స్టూడెంట్స్‌ తమకు నచ్చిన సబ్జెక్ట్‌ ఎంచుకుని చదివే వెసులుబాటు కల్పించారు.


రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేదిగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం విజయవంతమైంది. ప్రస్తుతం ఆరో విడతగా ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17వేల కోట్లను, తెలంగాణ రాష్ట్రంలోని 34.69 లక్షల మంది రైతులకు రూ.2వేల చొప్పున మొత్తం రూ.693.80 కోట్లు మోదీ ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఆదాయం రెట్టింపు దిశగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరుగాలం శ్రమించి అన్నం పెడుతున్న రైతుల కోసం పంట ఉత్పత్తి తర్వాత రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(అగ్రి ఇన్ఫ్రా ఫండ్‌)ని మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పంటల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, సేకరణ కేంద్రాలు, ఆహారశుద్ధి యూనిట్ల ఏర్పాటు కోసం, ప్యాకింగ్‌ వంటి అనేక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను వినియోగిస్తుంది. మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు 21వ శతాబ్దంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చేస్తాయి. కీలక రక్షణ రంగానికి సంబంధించిన త్రివిధ దళాల అధిపతిగా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌)ను ప్రధాని మోదీ నియమించారు. భారతదేశ రక్షణ దళాలను ప్రపంచంలోనే అత్యుత్తమ దళాల్లో ఒకటిగా నిలిపే మహత్తరమైన ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే అతి పెద్ద, కీలకమైన ఒక గొప్ప సంస్కరణగా అభివర్ణించవచ్చు. దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ త్రివిధ దళాల అధిపతి(సీడిఎస్‌) పదవిని సృష్టించారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. ‘ఒకే జెండా, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం’ నినాదానికి అనుగుణంగా మోదీ సర్కార్‌ తీసుకున్న సాహసోపేతమైన ఈ నిర్ణయం జాతీయ సమగ్రతను బలపరిచి, అఖండ భారత్‌గా నిలిచేలా చేసింది. ప్రపంచ దేశాలు సైతం ఆర్టికల్‌ 370 రద్దును స్వాగతించాయి. 


ముస్లిం మహిళల పోరాటానికి చట్టబద్ధమైన అండ కల్పించేందుకు మోదీ ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ చట్టాన్ని చేసింది. ఈ బిల్లు ఒక చారిత్రాత్మకమైన తప్పిదాన్ని సవరిస్తూ ముస్లిం మహిళల గౌరవాన్ని పెంపొందించింది. స్త్రీల పట్ల వివక్షను చెరిపివేసింది. తక్షణ తలాక్‌ను నిషేధించిన ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానికే దక్కుతుంది. మరోవైపు 2014 నుండి ఇప్పటివరకు బ్రిటీష్‌ కాలంనాటి కాలంచెల్లిన దాదాపు 1500లకు పైగా చట్టాలను నరేంద్రమోదీ ప్రభుత్వం రద్దు చేసింది. 


5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలోనే కరోనా మహావిపత్తు ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దీంతో రెండవసారి ఎన్నికైన మోదీ ప్రభుత్వం మొదటి ఏడాది నుండి పెను సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కోట్లాది భారతీయ ప్రజలు ప్రధాని మోదీపై పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కరోనా సంక్షోభ సమయంలో దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ సమయంలో మన దేశాధినేతగా మోదీ ఉండడం మన అదృష్టమనే చెప్పాలి. గత ఆరు సంవత్సరాలుగా చేపట్టిన సంస్కరణల వల్లే ఇంతటి కరోనా సంక్షోభంలో కూడా మన వ్యవస్థలు ఎంతో సమర్థంగా ఉన్నాయి.


కరోనా సంక్షోభాన్ని దీర్ఘకాలంలో ఓ అవకాశంగా మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక స్వావలంబన సాధనకు ఇదో మార్గమని భావిస్తూ అందుకుతగ్గ కార్యాచరణను ప్రకటించింది. చరిత్రలో కొన్ని రోజులు ప్రత్యేకంగా నమోదవుతాయి. భారతదేశ చరిత్రలో మే 12 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. కరోనా కష్టకాలంలో దేశ స్వావలంబన స్వయం సమృద్ధి లక్ష్యంగా 2020లో రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్‌ అభియాన్‌ పేరుతో భారీ ప్యాకేజీని ప్రకటించి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నరేంద్ర మోదీ అపూర్వ ఉత్తేజాన్ని ఇచ్చారు. ఇది మన జీడీపీలో దాదాపు 10 శాతం, దీంతో సమాజంలోని ప్రతి వర్గానికి లబ్ధి చేకూరుతుంది. భారతదేశం స్వయం సమృద్ధి సాధించడానికి, ఆర్థిక నిర్మాణానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. 


ఇప్పటివరకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ.7000 కోట్లు పైచిలుకు నిధులను విడుదల చేసింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి, కేంద్రం 10.09 లక్షల ఎన్‌-–95 మాస్కులను, రెండు లక్షల 41 వేల పీపీఈ కిట్లను, 1175 వెంటిలేటర్స్‌ను, 42.5 లక్షల హైడ్రాక్సి క్లోరోక్విన్‌ టాబ్లెట్లును ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఆర్‌ఎన్‌ఏ ఎక్ష్రాక్షన్‌ కిట్లను ఒక లక్ష 22 వేల కిట్లను, ఆర్‌టీపీసీఆర్‌ 2,90,427 కిట్లను, 52 వేల వీబిఎం కిట్లను కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సమకూర్చింది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్ర వైద్య శాఖ తరపున రూ.215 కోట్లను వైద్య పరికరాల కొనుగోలు కోసం అందించింది. అయినా తమ వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపై నెట్టి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది. 


ప్రధాని మోదీకి భారత్ మరోసారి‌ జైకొట్టింది. ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో దేశంలో ప్రధానిగా మోదీనే అత్యుత్తమం అని దేశ ప్రజలలో 78శాతం మంది మోదీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఇన్నాళ్ళకు ఒక అసామాన్య, అత్యంత సాహసోపేత నాయకుడు మన దేశాన్ని సంపూర్ణ వికాసం దిశగా పాలిస్తున్నారు. అసలు అసాధ్యం అనుకున్న ఎన్నో న్యాయపరమైన, రాజ్యాంగపరమైన మార్పులు సుసాధ్యం చేసి చూపారు మన ప్రధాని నరేంద్రమోదీ. అందుకే మన దేశ ప్రజలు మోదీ పట్ల అచంచలమైన విశ్వాసంతో రెండు పర్యాయాలు వరుసగా ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది.



బండి సంజయ్‌ కుమార్‌

కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు


Updated Date - 2020-08-15T06:43:08+05:30 IST