నత్తే నయం...!

ABN , First Publish Date - 2020-06-25T11:23:29+05:30 IST

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

నత్తే నయం...!

పురోగతిలేని నాడు-నేడు పనులు

జిల్లాలో 117 పాఠశాలలకు రూ.225 కోట్లు మంజూరు

ఇప్పటిదాకా చేసిన ఖర్చు రూ.25 కోట్లు

నిర్లక్ష్యంగా ఉన్న ఎంఈవో, హెచ్‌ఎంలకు మెమోలు జారీ


(కడప-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తరగతి గదుల మరమ్మతులు, మరుగుదొడ్లు, ఫర్నీచర్‌, గ్రీన్‌బోర్డు, ప్రహరీ... వంటి పనులకు శ్రీకారం చుట్టారు. కరోనా లాక్‌డౌన్‌ వలన పనుల పురోగతి మందగించడంతో జూలై ఆఖరి వరకు గడువు ఇచ్చారు. అయినా పనుల తీరు నత్తకు నడక నేర్పుతోంది. 1017 పాఠశాలలకు రూ.225.15 కోట్లు నిధులు మంజూరు కాగా... ఇప్పటి దాకా చేసిన పనులు కేవలం రూ.25 కోట్లే. జిల్లాలో మనబడి నాడు-నేడు పనుల తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలన కథనం.


జిల్లాలో 3,254 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. ఫేజ్‌-1 కింద 1,017 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంగా ప్రభుత్వం రూ.225.15 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మరుగుదొడ్లు, విద్యుత్తు, తాగునీరు, తరగతి గదుల మరమ్మతు చేయించి గ్రీన్‌బోర్డు, ఫర్నీచర్‌ తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అందులో ఫ్యాన్లు, గ్రీన్‌బోర్డు, డెస్క్‌లు, కుర్చీలు, వాటర్‌స్టోరేజ్‌ స్టీల్‌ ట్యాంకులు, పెయింటింగ్‌, ఫర్నీచర్‌ వంటి పనులు ప్రభుత్వమే చేపడుతోంది. మరుగుదొడ్లు, విద్యుత్తు, తాగునీరు, ప్రహరీగోడ, తరగతి గదుల మరమ్మతులు పేరెంట్స్‌ కమిటీ, ప్రధానోపాధ్యాయులు,  మండల ఇంజనీరింగ్‌ కమిటీ చేపట్టాలి. జూలై ఆఖరినాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో అయిదు ఏజెన్సీలకు ప్రభుత్వం ఆ పనులు అప్పగించింది. 1,017 పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీలు బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. 6,394 పనులను గుర్తించారు.


ఆ పనులకు పరిపాలన, సాంకేతిక అనుమతులతోపాటు ఎంవోయూ కూడా చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పనుల్లో పురోగతి లేక ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా ఉంది. ఇప్పటివరకు 818 పాఠశాలల్లో మెటీరియల్‌ కొనుగోలు కోసం రూ.16.49 కోట్లు, కూలీల కోసం 825 పాఠశాలలో రూ.6.39 కోట్లు, 657 పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీలు రూ.27.39 లక్షలు కలిపి ఇప్పటిదాకా 830 పాఠశాలల్లో రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఉపాధి హామీ పథకం కింద 249 పాఠశాలల్లో ప్రహరీగోడల నిర్మాణానికి రూ.6.23 కోట్లు ఖర్చు చేశారు. 


లాక్‌డౌన్‌... ఇసుక కొరత

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో పనులు పునఃప్రారంభమైనా ఇసుక కొరత వేధిస్తోందని పేరెంట్స్‌ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక పుష్కలంగా సరఫరా చేస్తే సకాలంలో పనులు పూర్తి చేస్తామంటున్నారు. 


ఎంఈవో, హెచ్‌ఎంలకు మెమోలు జారీ

జిల్లాలో నాడు-నేడు పనుల్లో పురోగతి మందగించింది. ఆయా పనులను జేసీ(అభివృద్ధి) సాయికాంత్‌వర్మ పరిశీలించారు. పనుల్లో పురోగతి లేకపోవడం, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 15 మండలాల ఎంఈవోలకు, 345 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మెమోరీలు జారీ చేశారు. ఈ మెమోలతో ఉపాఽధ్యాయలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడమే అన్యాయమని, అలాంటిది మెమోలు ఎలా జారీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.


పేరెంట్స్‌ కమిటీ చేయాల్సిన పనులు..

మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్తు, తాగునీటి ఆర్వో ప్లాంట్లు, హ్యాండ్‌వాష్‌ కుళాయిలు, ప్రహరీగోడ, తరగతి గదుల మరమ్మతులు చేపట్టాలి. ఈ పనులకు ఇసుక, సిమెంటు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.


ప్రభుత్వం చేపట్టే పనులు

ఫ్యాన్లు, గ్రీన్‌బోర్డులు, డెస్కులు, వాటర్‌స్టోరేజ్‌ స్టీల్‌ట్యాంకులు, ఫర్నీచర్‌, పెయింటింగ్‌, ఇంగ్లీషు ల్యాబ్‌ వంటిపనులు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ పనులను రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు అప్పగించాయి.


వాస్తవాలు కొన్ని

కడప నగరం చెమ్మూమియాపేట బాలికోన్నత పాఠశాలలో మౌలిక వసతులకు రూ.48 లక్షలు మంజూరయ్యాయి. స్టేజీ నిర్మాణం, మరుగుదొడ్లు, హ్యాండ్‌వాష్‌ ట్యాబ్‌లు, ఆర్వో లాంటి పనులు 30-40 శాతం కూడా పూర్తికాలేదు. పుచ్చిపోయిన చెక్కలతో కొత్తగా కిటికీ తలుపులు తయారు చేస్తున్నారు. ఇవి ఎన్నాళ్లు ఉంటాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.


పోరుమామిళ్ల మండలం సుంకేసులపల్లి యూపీ పాఠశాలకు రూ.17 లక్షలు మంజూరయ్యాయి. తరగతి గదుల్లో నల్లబండలు వేస్తున్నారు. ఆ బండల కింద నాణ్యతలేని ఎర్ర ఇసుకను వినియోగిస్తున్నారు. ప్రహరీ, మరుగుదొడ్లు వంటి పనులు నత్తనడకన జరుగుతున్నాయి. ఇసుక కొరత కారణంగా పనుల్లో పురోగతి మందగించిందని అధికారులు పేర్కొనడం కొసమెరుపు. 


గాలివీడు మండలం నూలివీడు ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉన్నారు. మౌలిక వసతులకు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. పది రోజుల క్రితమే పనులకు శ్రీకారం చుట్టారు. ఫ్లోరింగ్‌, కిటికీలు, తలుపుల మరమ్మతుల పనులు నత్తనడకన సాగుతున్నాయి.


జమ్మలమడుగు పట్టణం పీఆర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో 740 మంది విద్యార్థులున్నారు. రూ.78 లక్షలు మంజూరైంది. మరుగుదొడ్ల నిర్మాణం కోసం గుంతలు తీసి వదిలేశారు. ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదు. మండలంలోని ముప్పాతిక పాఠశాలల్లో ఇదే పరిస్థితి.


రైల్వేకోడూరు పట్టణం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు రూ.60 లక్షలు మజూరయ్యాయి. రూ.15 లక్షలే నిధులు మంజూరు చేశారు. తరగతి గదుల మరవ ్ముతు, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా వంటి పనులు నత్తనడకన జరుగుతున్నాయి.


జిల్లాలో  నాడు-నేడు ఫేజ్‌-1 పనులు ఇలా...ఎంపికైన పాఠశాలలు 1,017

పనులు ప్రారంభమైన పాఠశాలలు 895

మంజూరైన నిధులు రూ.225 కోట్లు

ఇప్పటి వరకు విడుదలైన నిధులు రూ.28 కోట్లు


ప్రధానోపాధ్యాయులకు మెమోలు ఇవ్వడం అన్యాయం- లెక్కల జమాల్‌రెడ్డి, పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు 

ఉపాధ్యాయులకు నిర్మాణ రంగంలో అనుభవం లేదు. చాలా మందికి కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా ఉండదు. కరోనా వలన ఎక్కువ మంది ఉపాధ్యాయులు కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడమే సరైనది కాదు. అలాంటిది నాడు-నేడు పనుల్లో పురోగతి లేదని, అందుకు ఎంఈవోలు, ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేయడం అన్యాయం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించాలి. జారీ చేసిన మెమోలను ఉపసంహరించుకోవాలి.


జూలై ఆఖరునాటికి పూర్తి చేస్తాం- కాంతయ్య, ఈఈ, సమగ్ర శిక్షా అభియాన్‌, కడప

నాడు నేడు పనులు లాక్‌డౌన్‌, మెటీరియల్‌ సరఫరాలో జాప్యం వల్ల ఆలస్యమైన మాట వాస్తవమే. ఇప్పుడిప్పుడే పనులు పురోగతిలోకి వస్తుతన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువు జూలై ఆఖరులోగా వందశాతం పూర్తి చేస్తాం.

Updated Date - 2020-06-25T11:23:29+05:30 IST