222 మంది విద్యార్థుల గైర్హాజరు

ABN , First Publish Date - 2022-05-25T05:23:00+05:30 IST

222 మంది విద్యార్థుల గైర్హాజరు

222 మంది విద్యార్థుల గైర్హాజరు
వికారాబాద్‌ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌/మేడ్చల్‌/తాండూరు రూరల్‌, మే24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వికారాబాద్‌ జిల్లాలో మంగళవారం జరిగిన  పదో తరగతి పరీక్షకు 98.45 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 14,439 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, వారిలో 14,217 మంది హాజరు కాగా, 222 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.  ప్రైవేట్‌గా పరీక్షకు హాజరయ్యేందుకు ఐదుగురు విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో నలుగురు హాజరు కాగా, ఒకరు గైర్హాజరయ్యారు. కాగా, జిల్లా పరిశీకురాలు విజయలక్ష్మీబాయి, డీఈవో రేణుకాదేవి పెద్దేముల్‌లో మూడుకేంద్రాలు, తాండూరులో మూడు కేంద్రాలను తనిఖీ చేశారు. 

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన  కలెక్టర్‌

వికారాబాద్‌ జడ్పీబాలికల ఉన్నత పాఠశాలను మంగళవారం కలెక్టర్‌ నిఖిల ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, పరీక్ష నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు.విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. వేసవి నేపథ్యంలో విద్యార్థులకు తాగునీరు, అత్యవసర సేవలు అందించేందుకు చేసిన ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కాపీయింగ్‌కు ఏమాత్రం అవకాశం లేకుండా పరీక్షలను పకడ్బందీగా కొనసాగేలా చర్యలు తీసుకున్నామని ఆమె చెప్పారు.  కాగా మేడ్చల్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షలు రెండో రోజు ప్రశాంతంగా కొనసాగాయి. మంగళవారం 43,249 మందికి, 42,988 మంది హాజరుకాగా, 261 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

తాండూరులో పరీక్షా కేంద్రాల తనిఖీ 

 తాండూరు మండల పరిధిలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను వికారాబాద్‌ జిల్లా డీఈవో రేణుకాదేవి, అబ్జర్వర్‌ విజయలక్ష్మీలు తనిఖీ చేశారు.  గంగోత్రి, ప్రభుత్వ నెంబర్‌-1, సెయింట్‌మార్క్స్‌ పాఠశాలల్లో జరుగుతున్న పరీక్షల తీరును పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో సెయింట్‌ మార్క్స్‌ హై స్కూల్‌లో 300 మంది విద్యార్థులకు గాను 295 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు డిపార్ట్‌మెంట్‌ అధికారి డీఈవో, అబ్జర్వర్‌కు వివరించారు. అక్కడి నుంచి ప్రభుత్వ నెంబర్‌-1 పాఠశాల కేంద్రాన్ని పరిశీలించగా, 260 మంది విద్యార్థులకు గాను 250 మంది, గంగోత్రిలో 239 మందికి గాను 234 మంది హాజరయ్యారు. అనంతరం పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతోపాటు సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా నిర్భయంగా పరీక్షలు రాయలని సూచించారు.


Updated Date - 2022-05-25T05:23:00+05:30 IST