NOTA: గత ఐదేళ్లలో ‘నోటా’కు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?

ABN , First Publish Date - 2022-08-04T22:17:58+05:30 IST

నోటా (NOTA).. దేశంలోని ఓటర్లందరికీ దీని గురించి పెద్దగా తెలియకపోవచ్చు. తెలిసిన వారిలో కొందరికి మాత్రమే దీనితో

NOTA: గత ఐదేళ్లలో ‘నోటా’కు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?

న్యూఢిల్లీ: నోటా (NOTA).. దేశంలోని ఓటర్లందరికీ దీని గురించి పెద్దగా తెలియకపోవచ్చు. తెలిసిన వారిలో కొందరికి మాత్రమే దీనితో పని ఉండొచ్చు. మరికొందరికి ఆ మీట అక్కడెందుకు ఉందో తెలియకపోవచ్చు. ‘‘రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి.. నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నాయి. ఓటు వేసేందుకు సరైనోడు ఒక్కడూ కనిపించడం లేదు’’ అని విసుక్కుంటూ దేశభక్తి ప్రద్శించే వారికోసం ఈ ‘నోటా’ మీటను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తుల్లో మనం ఓటు వేసేందుకు అర్హత ఉన్నవాడు ఒక్కడూ లేడని  అనుకునేవాళ్లు దానిని నొక్కుతున్నారు. ఎన్నికల సంఘమైతే దానిని ప్రవేశపెట్టింది సరే.. మరి దానిని ఎవరైనా వినియోగిస్తున్నారా? అవుననే అంటున్నాయి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW). 


నోటా అంటే.. ‘పైన నిలబడిన వ్యక్తుల్లో ఎవరూ కాదు’ అని అర్థం. గత ఐదేళ్లలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2018-22 మధ్య కాలంలో ఏకంగా 1.29 కోట్ల మంది ఈ నోటాను ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు 64,53,652 మంది ఓటేసినట్టు ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ  నివేదిక తెలిపింది. మొత్తంగా నోటాకు  65,23,975 (1.06 శాతం) ఓట్లు వచ్చినట్టు పేర్కొది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా బీహార్‌లోని గోపాల్‌గంజ్ (ఎస్సీ) నియోజకవర్గంలో 51,660 ఓట్లు రాగా, అత్యల్పంగా లక్షద్వీప్‌లో 100 ఓట్లు వచ్చాయి. ఇక, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా 7,49,360 (1.46 శాతం) ఓట్లు వచ్చాయి. బీహార్‌లో అత్యధికంగా 7,06,252 ఓట్లు పోలవగా, ఎస్‌సీటీ డిల్లీలో 43,108 ఓట్లు పోలయ్యాయి. 2022లో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువగా 0.70 శాతం మంది అంటే, 8,15,430 మంది నోటాకు జై కొట్టారు. గోవాలో  10,629 ఓట్లు, మణిపూర్‌లో 10,349 ఓట్లు, పంజాబ్‌లో 1,10,308 ఓట్లు, ఉత్తరప్రదేశ్‌లో 6,37,304 ఓట్లు పోలవగా, ఉత్తరాఖండ్‌లో 46,840 ఓట్లు వచ్చాయి.


2019 మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యధికంగా  7,42,134 ఓట్లు రాగా, 2018లో మిజోరాం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అత్యల్పంగా 2,917 ఓట్లు వచ్చాయి. అదే ఏడాది చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 1.98 శాతం ఓట్ల షేర్‌ను నోటా దక్కించుకుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీకి, 2018లో మిజోరం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అత్యల్పంగా 0.46 శాతం ఓట్ షేర్ లభించింది.  

Updated Date - 2022-08-04T22:17:58+05:30 IST