Dubai: దుబాయ్ వాసులకు హెచ్చరిక.. ఆన్‌లైన్‌లో అది చేస్తే రూ. కోటి వరకు జరిమానా!

ABN , First Publish Date - 2022-08-18T15:41:22+05:30 IST

ఆన్‌లైన్ (online) వేదికగా ఇతరులను అవమానపరిచే విధంగా సందేశాలు పంపించే దుబాయ్ వాసులను అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూషన్ (Dubai Public Prosecution) హెచ్చరించింది.

Dubai: దుబాయ్ వాసులకు హెచ్చరిక.. ఆన్‌లైన్‌లో అది చేస్తే రూ. కోటి వరకు జరిమానా!

దుబాయ్: ఆన్‌లైన్ (online) వేదికగా ఇతరులను అవమానపరిచే విధంగా సందేశాలు పంపించే దుబాయ్ వాసులను అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూషన్ (Dubai Public Prosecution) హెచ్చరించింది. సోషల్ మీడియా‌లో తోటివారిని అవమాన పరిస్తే 5లక్షల దిర్హమ్స్(సుమారు రూ.1కోటి) వరకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ మేరకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ వీడియోను విడుదల చేసింది. డీరా ప్రాసిక్యూషన్, అసిస్టెంట్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఖలీద్ హసన్ అల్ ముతావా మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో తోటివారిని అగౌరవపరిచే సందేశాలు పెట్టడం, అవమానపరుస్తూ మానసికక్షోభకు గురిచేయడం తీవ్ర నేరమని పేర్కొన్నారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడేవారికి ఇకపై కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానాలు ఉంటాయన్నారు. 5లక్షల దిర్హమ్స్(రూ. 1కోటి) వరకు జరిమానా ఉంటుందని తెలిపారు. 


ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ సంఘటనను ఆయన ప్రస్తావించారు. ఓ యువకుడు తనతో పాటు పనిచేసే సిబ్బందిని అవమాన పరిచేలా వాట్సాప్ ( WhatsApp)లో సందేశం (voice message) పంపించాడు. దాంతో అతడికి 10వేల దిర్హమ్స్(రూ.2.16లక్షలు) జరిమానా విధించినట్లు చెప్పారు. అల్ ఐన్ న్యాయస్థానం (Al Ain Court) లో ఇటీవల ఈ కేసు విచారణకు రావడంతో దోషిగా తేలిన యువకుడికి కోర్టు ఈ భారీ జరిమానా విధించింది. అతని వల్ల బాధింపబడిన వ్యక్తికి ఈ జరిమానాను పరిహారంగా ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. దుబాయ్ ఆన్‌లైన్ చట్ట ఉల్లంఘనకు పాల్పడినందుకు గాను సదరు యువకుడికి ఈ భారీ జరిమానా పడిందని ప్రాసిక్యూటర్ ఖలీద్ హసన్ చెప్పుకొచ్చారు.  

Updated Date - 2022-08-18T15:41:22+05:30 IST