60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల విషయమై తెరపైకి కొత్త ప్రతిపాదన.. అమలైతే భారీ ఉపశమనం!

ABN , First Publish Date - 2022-01-22T13:53:34+05:30 IST

60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు సంబంధించిన వర్క్ పర్మిట్ల జారీ, రెన్యువల్ విషయమై గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ ఏ నిర్ణయం తీసుకోకుండా నాన్చుడి ధోరణిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.

60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల విషయమై తెరపైకి కొత్త ప్రతిపాదన.. అమలైతే భారీ ఉపశమనం!

కువైత్ సిటీ: 60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు సంబంధించిన వర్క్ పర్మిట్ల జారీ, రెన్యువల్ విషయమై గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ ఏ నిర్ణయం తీసుకోకుండా నాన్చుడి ధోరణిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్ విషయమై తెరపైకి కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. హై స్కూల్ డిప్లొమా లేదా అంతకన్నా తక్కువ విద్యార్హత ఉండి, 60 ఏళ్లు దాటిన ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్ ఫీజును 250 కువైటీ దినార్లుగా(సుమారు రూ.61వేలు) ప్రాతిపాదించింది. వచ్చే పీఏఎం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనుందని అక్కడి మీడియా పేర్కొంది. చర్చ అనంతరం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఓటింగ్ నిర్వహిస్తారు. ఇందులో తాజా ప్రతిపాదనకు అనుకూలంగా ఫలితం వస్తే అమలు కోసం కార్మికశాఖకు పంపుతారు. ఇక ఈ ప్రతిపాదన అమలైతే 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులకు భారీ ఉమశమనం లభించినట్టే.


ఇదిలాఉంటే.. ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్ల జారీ, రెన్యువల్ విషయమై కువైత్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ దేశంలోని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ప్రవాసుల్లో ఆందోళన నెలకొంది. అక్కడి స్థానిక మీడియా సమాచారం ప్రకారం 60 ఏళ్లు దాటిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులను కొన్ని సంస్థలు బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు తెలిసింది. వీరి విషయంలో సందిగ్ధం నెలకొనడంతో భవిష్యత్ దృష్ట్యా ఆయా కంపెనీలు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నాయి. వీరి విషయంలో నిర్ణయం వెలువడేందుకు సమయంలో పట్టే అవకాశం ఉందని తెలియడంతో అక్కడి కంపెనీలు ఇలా బలవంతపు ఉద్వాసనలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక ఉద్యోగాలు కోల్పోతున్న ప్రవాసులకు వేరే కంపెనీల్లో కూడా అవకాశం దొరకడం లేదు. దీంతో చాలా ఏళ్లుగా కువైత్‌లో ఉంటున్న వలసదారులకు ఏటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.   

Updated Date - 2022-01-22T13:53:34+05:30 IST