సగటును మించి వర్షపాతం.. ఈ ఏడూ జూన్‌లో అధిక వర్షాలు

ABN , First Publish Date - 2021-06-17T05:44:14+05:30 IST

ఖమ్మం జిల్లాలో వానాకాలం పంటల సాగుకు వరుణదేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. గతఏడాది లాగే ఈ ఏడాది కూడా తొలకరి ప్రారంభమైన జూన్‌లోనే సగటు వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోద వుతోంది. ఈనెలలో జిల్లా సగటు వర్షపాతం 105.2మి.మీ. కాగా బుధవారం నాటికి 106.3మి.మీ. వర్షపాతం నమోదై సగటు వర్షపాతాన్ని మించింది.

సగటును మించి వర్షపాతం.. ఈ ఏడూ జూన్‌లో అధిక వర్షాలు

ఊపందుకున్న వానాకాలం సాగు పనులు

ఖమ్మం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఖమ్మం జిల్లాలో వానాకాలం పంటల సాగుకు వరుణదేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. గతఏడాది లాగే ఈ ఏడాది కూడా తొలకరి ప్రారంభమైన జూన్‌లోనే సగటు వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోద వుతోంది. ఈనెలలో  జిల్లా సగటు వర్షపాతం 105.2మి.మీ. కాగా బుధవారం నాటికి 106.3మి.మీ. వర్షపాతం నమోదై సగటు వర్షపాతాన్ని మించింది. గతేడాది జూన్‌లో 105.2మి.మీకుగాను 187.0మి.మీ వర్షపాతం నమోదైంది. జూన్‌లో గతేడాది వలే ఈ ఏడాది కూడా సగటు వర్షపాతానికి మంచి జిల్లాలో వర్షపాతం కురుస్తోంది. ప్రస్తుతం జిల్లా అంతటా రైతాంగం దుక్కులుదున్ని పత్తి, కూరగాయలు, మొక్కజొన్న, కంది విత్తనాలు వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే పత్తి విత్తనాలు నాటుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న అదును, పదును వర్షాలు దుక్కులకు అనుకూలంగా మారడంతో ఖరీఫ్‌సాగుకు రైతులు సిద్ధమవు తున్నారు. జిల్లాలో 6లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు సాగుచేసేందుకు రైతులు సన్నద్ధమవు తున్నారు. ఇందులో వరి 2,80,200 ఎకరాలు, పత్తి 2,69,000, పెసర 25వేలు, మొక్కజొన్న 704, కంది 5,500, వేరుశనగ 200, జొన్న 100, మినుము 350 ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారు.

జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాతం 

ఖమ్మం జిల్లాలో మంగళవారం రాత్రి పలు మండలాల్లో వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 7.1మి.మీ నమోదైంది. తల్లాడలో అత్యధికంగా 29.8మి.మీ. వైరాలో 19.2మి.మీ.వర్షం కురిసింది. రఘునాధపాలెం 3.2 మి.మీ, ఖమ్మంరూరల్‌ 11.8మి.మీ, ఖమ్మంఅర్బన్‌లో 12.2మి.మీ, తిరుమలాయపాలెంలో 5.2మి.మీ, కూసుమంచి 2.2మి.మీ, ముదిగొండ 9.4మి.మీ, కొణిజర్ల 19.8మి.మీ, కల్లూరు 17.8మి.మీ, పెనుబల్లి 8.4మి.మీ, సత్తుపల్లి 2.6మి.మీ, వేంసూరు 5.6మి.మీ, తల్లాడ 29.8మి.మీ వర్షపాతం నమోదైంది.  


Updated Date - 2021-06-17T05:44:14+05:30 IST