నా గూర్చి నేను!

ABN , First Publish Date - 2020-06-08T08:25:10+05:30 IST

ఎవరి గూర్చి వారు చెప్పుకోవటం పెద్దలు పాటించే సంప్రదాయం కాదు. మర్యాద కాదు. ఎందుకంటే అనివార్యంగా అతిశయోక్తులు, ఆత్మస్తుతులు అందులో కనపడే అవకాశం కాదనలేము. మరి ఇప్పుడు నీవు ఈ బాకా ఊదుడు ప్రయత్నం చేయటం సబబా!...

నా గూర్చి నేను!

‘‘నాకు ఇటీవల 84 ఏళ్ళ వయసు నా కళ్ళముందే పూర్తి అయింది. అందువల్ల నా గూర్చి ఎవరైనా ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన విశిష్టత ఏముంది? అని ఆలోచించి నా గూర్చి నేనే చెప్పుకుంటే సరిపోదా అని ఈ కోరిక. ‘ముదిమికి ముచ్చట్లు’ అని ఒక సామెత. ముదిమి రెండవ బాల్యమనగ అన్నాడు చిలకమర్తివారు. పోనీ ఇది బాల్య లౌల్యమే అనుకొండి.’’


ఎవరి గూర్చి వారు చెప్పుకోవటం పెద్దలు పాటించే సంప్రదాయం కాదు. మర్యాద కాదు. ఎందుకంటే అనివార్యంగా అతిశయోక్తులు, ఆత్మస్తుతులు అందులో కనపడే అవకాశం కాదనలేము. మరి ఇప్పుడు నీవు ఈ బాకా ఊదుడు ప్రయత్నం చేయటం సబబా! అంటే నాకు ఇటీవల 84 ఏళ్ళ వయసు నా కళ్ళముందే పూర్తి అయింది. అందువల్ల నా గూర్చి ఎవరైనా ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన విశిష్టత ఏముంది? అని ఆలోచించి నా గూర్చి నేనే చెప్పుకుంటే సరి పోదా అని ఈ కోరిక. ఏమంటే 84 ఏళ్ళు చిన్న వయసేమీ కాదు. ముందుముందేమి జరగబోతుందో మనకు తెలి యదు. ‘ముదిమికి ముచ్చట్లు’ అని ఒక సామెత. ముదిమి రెండవ బాల్యమనగ అన్నాడు చిలకమర్తివారు. పోనీ ఇది బాల్యలౌల్యమే అనుకొండి. నేను ‘మంచి’ రచయిత అనిపిం చుకున్నాను నా తరంలో. నా తరం అంటే ఒకటి రెండేళ్ళు అటుఇటుగా 1930 నుంచి 1956 అనుకుందాం. చరిత్రవేత్తలు ఒకతరం అంటే పాతికేళ్ళుగా నిర్ణయిస్తారు రమారమిగా. 


నా పదిహేడేళ్ళ వయసున నా మొదటి రచన ‘తెలుగు స్వతంత్ర’లో వచ్చింది. దీని సంపాదకులు శ్రీ ఖాసా సుబ్బా రావు అయినా, ఆయన ‘ఇంగ్లీషు స్వతంత్ర’ నిర్వహించటం, గోరాశాస్త్రి అని గొప్ప ప్రతిభాశాలి తెలుగు స్వతంత్ర ప్రచురణ నిర్వహించటం జరిగేదని నాకు తెలిసింది. అప్పట్లో ‘స్వతంత్ర’లో రచన ప్రచురితం కావటం అది గొప్ప గుర్తింపు. ఆ తరువాత మూడేళ్ళకు 1960లో తెలుగు స్వతంత్రలో ‘జారుడు మెట్లు’ అనే నా చిన్న నవల వచ్చింది. ఆ పేరు గోరాశాస్త్రి పెట్టాడని నా జ్ఞాపకం. అప్పటినుంచి గోరాశాస్త్రి గారితో, హైదరా బాదు ఈ పత్రిక తరలివచ్చి నప్పుడు సహాయసంపాదకు రాలైన శ్రీమతి పి. శ్రీదేవి (పెమ్మరాజు)తో నాకు చాలా చనువు ఏర్పడింది. 


స్వతంత్రలో నా రచనలు వస్తున్నప్పటి కొంచెం ముందు లేదా సమాంతరంగా ధనికొండ హనుమంతరావు (ఇటీవలే ఈయన శత జయంతి సాహిత్య ప్రియులు జరిపారు) నిర్వహించే అభిసారిక, జ్యోతి అనే పత్రికలలో బహుశా నాలుగైదు రచనలు నావి వచ్చాయి. తరుణ యవ్వనం కదా! అవి మంచి రచనలు కావు. అయితే ఎందుకీ ప్రస్తావన అంటే నా సాహిత్య జీవితంలో రచయితకు పత్రికల వారిచ్చే పారితోషికం మొదటిసారిగా నాకు ధనికొండ హనుమంతరావే ఇచ్చారు. అది పది రూపాయలు. అప్పట్లో పెద్ద మొత్తమే. ఇక అప్పటి నుంచీ రేసు (పందెపు) గుర్రంలా పరుగులు తీస్తూనే ఉన్నాను. 


అంటే 65 ఏళ్ళుగా అవిరామంగా ఏవో రచనలు చేస్తూనే ఉన్నానన్నమాట. అవి ఇంచుమించు అన్ని తెలుగు పత్రికల లోనూ కనపడటం నా అదృష్టం! నా తరం రచయితలలో ఎవరూ 30 జీవిత చరిత్రలు రాయలేదనుకుంటాను. అదిన్నీ తెలుగు సాహిత్య, సాంస్కృతిక, చరిత్రలను ఉజ్జ్వల పరిచిన హావ్యక్తులవి. కందుకూరి, గిడుగు, గురజాడ, కొమర్రాజు, నాయని సుబ్బారావు, నోరి నరసింహశాస్త్రి ఇత్యాదయః. 


కేంద్ర సాహిత్య అకాడమివారు నావి ఎనిమిది పుస్తకాలు ప్రచురించారు. నా తరం రచయితలలో ఇంకో రచయిత పరంగా ఇది చూడలేదు. 2008 నుంచి 12 వరకు ఐదేళ్ళు నేను కేంద్ర సాహిత్య అకాడమి తెలుగు సాహిత్య సమావేశ కర్తగా పని చేశాను. ఒకటి రెండు సందర్భాలలో సాహిత్య అకాడమి భ్రష్ట అవినీతి అహంకార ఆశ్రయప్రియతను సాహసంగా ఎదుర్కొన్నాను. అది ప్రత్యేకించి ఒక చిన్న నవలిక (గాథకు సరిపోదు). నేను కన్వీనరుగా పనిచేసే వరకు సాహిత్య అకాడమిపురస్కారాలు అన్నీ నగర ప్రాంతాల వారికీ, ఆధునిక విద్యారంగీయులకూ మాత్రమే వచ్చేవి. నేను గ్రామీణుడైన ఒక గొప్ప కవికి అది ఇప్పించాను. కులం పరిగణించ లేదు. బహుశా డెబ్భై సంవత్సరాల సాహిత్య అకాడమి ఉనికిలో ఒక ముస్లిం రచయితకు పట్టుబట్టి పుర స్కారం వచ్చేట్లు చేయగలిగాను. సామల సదాశివ వంటి అత్యంత సాహిత్య, సంగీత, సాంస్కృతిక ప్రజ్ఞా విభవుడికి సాహిత్య అకాడమీ పురస్కారం నా వల్లనే వచ్చిందంటే అహంకారం అనుకోకండి. 


కందుకూరి వీరేశలింగం గూర్చి నా పిహెచ్‌.డి కాబట్టి, వీరేశలింగం కృషి గూర్చీ, ఆయన ఆధునిక యుగకర్తృత్వం గూర్చీ నేను చేసిన పరిశోధన ఫలితాలు అందరికీ తెలుసు. వీరేశలింగం డైరీలు, లేఖలు నేను ప్రచురింప చేశాను. వీరేశలింగం రచనల సంపుటాలను సవ్యాఖ్యానంగా ప్రచురింపచేశాను. ఆయన కవుల చరిత్రను నవీకరించాను. మూడు రెట్లు నా ఫుట్‌నోట్స్‌తో పెంచాను. 


2010లో కలకత్తా భారతీయ భాషా పరిషత్తువారు అఖిల భారత స్థాయిన సాహిత్య ప్రముఖులకు (బహుశా తరువాతి కాలంలో మళ్ళీ జరగలేదు) సాహిత్య పురస్కారాలందించారు. సర్వశ్రీ కేదార్‌సింగ్‌, గోపీచంద్‌ నారంగ్‌, ఎమ్‌.టి. వాసు దేవన్‌ నాయర్‌, ఇందిరా గోస్వామి, అరుణ్‌ సాధు, ఉదయ ప్రకాశ్‌, జయగోస్వామి వంటి వివిధ భాషా ప్రతినిధులలో తెలుగు రచయితగా నన్ను చేర్చారు. లక్షరూపాయల నగదు, విశిష్టాతి విశిష్ట జ్ఞాపికలు అందజేశారు భాషా పరిషత్తువారు.


ఒక విశేషం ఏమంటే మా పిల్లల అమెరికా వాసం వల్ల నేనూ, మా ఆవిడ 13సంవత్సరాలు అమెరికాలో గడిపాము (అంటే 26సార్లు అమెరికా వెళ్ళామన్నమాట). అమెరికాలో మన తెలుగు సంస్థలు జీవన సాఫల్య పురస్కారం పేరిట రెండుసార్లు నన్ను సత్కరించాయి. అప్పాజోస్యుల-విష్ణుభొట్ల- (అనంతర కాలంలో కందాళం జోడింపుతో) సాహిత్య సాంస్కృతిక సంస్థకు నేను 10 సంవత్సరాలు సన్నిహిత సంధానకర్తను, హితవరిని.


ఆలిండియా రేడియో హైదరాబాద్‌ కేంద్రం నుంచి నావి 10 కథలు, రెండు నవలలు, ద్విశతాధికంగా ప్రసంగాలు, సమీక్షలు ప్రసారమైనవి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి నేనంటే చాలా అభిమానం. ఆయన నా చేత ఆకాశవాణీయంగా చదివించిన ఒక కథ వెంటనే బెంగాలీ అనువాదంగా కోల్‌కత్తా రేడియో కేంద్రం వారి ‘దుర్గపూజ’ విశిష్ట సంచి కలో వచ్చింది. ఈ కథ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో అనువాదితమైంది. అందువల్లనో, దేవులపల్లివారు తమ తరుణ వయస్సులో వీరేశలింగంగారిని చూసినందువల్లనో నాపట్ల ప్రత్యేక ప్రేమాభిమానాలు కనపరచేవారు. నా కథలు రెండు మూడు విశ్వనాథ సత్యనారాయణగారు చదివారు. ‘అది గొప్ప తెనుంగునాడునన్‌!’ బాలాంత్రపురజనీకాంతరావు గారు గౌహతి (అస్సామ్‌) ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు నా కథ ఒకటి ఇంగ్లీషులోకి పరివర్తింపచేసి ప్రసారం చేశారు. ఇప్పటికి అంటే ఈ అరవై ఐదేళ్ళ నా సాహిత్య జీవితంలో వివిధ తెలుగు పత్రికలలో నావి సుమారు ఐదువేల రచనలు వెలువడ్డాయి. రెండు వందల పైన పుస్తకాలు (సృజనాత్మక, అనువాద, పరిశోధన, సంవాద) వచ్చాయి. 


దేశవిదేశాలలో నేను చూసిన ప్రదేశాలు, ఒక శతాబ్దంలో పుట్టిన ప్రముఖ వ్యక్తులతో నా పరిచయాలు, నా తరం రచయితలలో మరొకరి విషయంలో ప్రసక్తం చేయలేము కదా! అమెరికాలో ‘లైబ్రరీ కాంగ్రెస్‌’ను నేను దర్శించాను సకల ప్రపంచ ఖండ ప్రచురిత పుస్తకాలు ఒక కోటి వరకు ఇక్కడ భద్రతకు నోచుకున్నాయి. ఈ అమెరికా లైబ్రరీ కాంగ్రెసు కట్టడ విస్తారం ఒక చిన్న నగరం మేర వైశాల్యంతో ఉంటుంది. ఇందులో ఆసియా ఖండ, ఇండియా విభాగంలో నా పుస్తకాలు పదో, పన్నెండో ఉన్నాయి. మన దేశంలో లభించని గత కాలపు తెలుగు పత్రికలున్నాయి. తెలుగు విభాగ పుస్తక ప్రతిక సంరక్షక సంచాలకులు డా. థారన్‌ టన్‌, శంకర భాగవత్పాదుల ముఖ్య శిష్యులైన పద్మపాదుల వారి రచనలపై డాక్టరేట్‌ చేసిన వారని తెలుసుకోవటం కమనీయం. అమెరికా వర్జీనియా రాష్ట్ర స్ర్పింగ్‌ఫీల్డ్‌ పురంలో అంతర్జాతీయ వేణునాద విశారదుడిగా ఖ్యాతినార్జించిన శ్రీ ఏల్చూరి విజయ రాఘవ గారితో ఆయన ప్రేమాస్పదుడనై నాలుగు రోజులున్నాను. ఆయన మా నరసరావుపేటవాడు. అక్కడ స్కూలులో చదువుకున్నాడు. నేనంటే ఈయనకు బహుదొడ్డ ప్రేమ. 


ఇటీవల గుంటూరులోని శ్రీబొమ్మిడాల ట్రస్టు వారు నాకు జీవన సాఫల్య పురస్కార విశిష్ట గౌరవం, ఆరు వందల పుటల అభినందన గ్రంథం అందజేశారు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌ ఉన్నత పాఠశాల విద్యాశాఖ వారు 9వ తరగతి ఉపవాచకంగా నా రచన ఆంధ్ర కేసరి ప్రకాశం ఎంపిక చేసి 30లక్షల నుంచి 50లక్షల మధ్య ప్రతులు ప్రచురింప జేశారు. ఈ విశిష్ట సంస్కారం శ్రీ ఎన్‌.టి. రామారావుది. నాకు సుమారు 50 అవార్డులు వచ్చాయి. ‘రాబర్ట్‌ నోబుల్‌ జీవన యానం’ అనే నా రచన బందరు నోబుల్‌ కళాశాల విద్యా ర్థులు బీఏ పాఠ్యంగా చదువుకున్నారు. ఇక చాలు నా భుజా విస్ఫాలనం. నమస్కారాలు. 

అక్కిరాజు రమాపతిరావు 

Updated Date - 2020-06-08T08:25:10+05:30 IST