అమ్మకు కడుపుకోత!

ABN , First Publish Date - 2021-10-07T05:29:04+05:30 IST

తల్లీబిడ్డలకు హాని లేకుండా సుఖ ప్రసవాలు చేసే రోజులు కనుమరుగైపోతున్నాయి. పురిటి నొప్పులతో గర్భిణులు ఆస్పత్రికి వెళ్తే చాలు.. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసేస్తున్నారు. ఐదు నెలల వ్యవధిలో జిల్లాలో 15,732 ప్రసవాలు జరగ్గా.. 10,924 మందికి ఆపరేషన్లు చేయడమే ఇందుకు నిదర్శనం. ఆధునిక సదుపాయాలు ఉండే బోధనాసుపత్రుల నుంచి.. జిల్లా, మండల కేంద్రాల ఆస్పత్రుల వరకూ అన్నింటా ఇదే ధోరణి. ప్రైవేటు ఆస్పత్రుల్లో మరింత అదనంగా కోతలు సాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో 5 నుంచి 15 శాతం మధ్యే సిజేరియన్లు ఉండాలి. సిజేరియన్లు ఎప్పుడు చేయాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. కానీఈ సంఖ్య పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

అమ్మకు కడుపుకోత!

- అవసరం లేకున్నా ఆపరేషన్లు

- ప్రభుత్వాసుపత్రుల్లో 45.83 శాతం

- ప్రైవేటులో 84.64 శాతం సిజేరియన్లు

- ఇదీ జిల్లాలో ప్రసవాల తీరు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

తల్లీబిడ్డలకు హాని లేకుండా సుఖ ప్రసవాలు చేసే రోజులు కనుమరుగైపోతున్నాయి. పురిటి నొప్పులతో గర్భిణులు ఆస్పత్రికి వెళ్తే చాలు.. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసేస్తున్నారు. ఐదు నెలల వ్యవధిలో జిల్లాలో 15,732 ప్రసవాలు జరగ్గా.. 10,924 మందికి ఆపరేషన్లు చేయడమే ఇందుకు నిదర్శనం. ఆధునిక సదుపాయాలు ఉండే బోధనాసుపత్రుల నుంచి.. జిల్లా, మండల కేంద్రాల ఆస్పత్రుల వరకూ అన్నింటా ఇదే ధోరణి. ప్రైవేటు ఆస్పత్రుల్లో మరింత అదనంగా కోతలు సాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో 5 నుంచి 15 శాతం మధ్యే సిజేరియన్లు ఉండాలి. సిజేరియన్లు ఎప్పుడు చేయాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. కానీఈ సంఖ్య పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 


 జిల్లాలో ఇదీ పరిస్థితి...

జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 15,732 ప్రసవాలు జరిగాయి. ఇందులో 10,924 మందికి ఆపరేషన్లు చేశారు. సాధారణ ప్రసవాలు 4,808 మాత్రమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొంతమేర సాధారణ ప్రసవాల పై దృష్టి పెడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఆపరేషన్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,160 (39.16 శాతం) ప్రసవాలు జరగ్గా.. ఇందులో 2,823(45.83 శాతం) మందికి ఆపరేషన్లు చేశారు. 3,337(54.17 శాతం) మందివి సాధారణ ప్రసవాలు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో 9,571 (60.84 శాతం) ప్రసవాలు జరగ్గా.. 8,101(84.64 శాతం) మంది ఆపరేషన్లు చేశారు. సాధారణ ప్రసవాలు 1,470 (15.36శాతం) మాత్రమే. ఒకే ఒక్క డెలివరీ మాత్రం ఇంటి వద్ద జరిగింది. 

- గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 39,792 ప్రసవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17,017 మంది, ప్రైవేటు ఆసుపత్రుల్లో 22,775 మంది ప్రసవించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో  9,495 సాధారణ ప్రసవాలు జరగ్గా, 7,522 మందికి ఆపరేషన్లు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 3,973 సాధారణ ప్రసవాలు జరగ్గా.. 18,802 మందికి ఆపరేషన్లు చేశారు. 


- ఎవరివాదన వారిదే...

జిల్లాలో ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు ఉన్నాయి. పీహెచ్‌సీలలో సీనియర్‌ వైద్యులు, స్టాఫ్‌ నర్సులు.. గర్భిణులు సహజ ప్రసవానికి అవకాశాలు ఎక్కువగా ఉంటేనే ధైర్యం చేస్తున్నారు. లేదంటే సమీపంలోని సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రులకు పంపేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో గర్భిణులను బోఽధనాసుపత్రులకు పంపిస్తుండడంతో ఆపరేషన్లు చేస్తున్నామని కొంతమంది సూపరింటెండెంట్లు చెబుతున్నారు. గర్భిణులు సకాలంలో ఆసుపత్రులకు రావడం లేదని... స్పెషాల్టీ వైద్యులు ఉండక... ప్రాణాపాయం సంభవిస్తుందనే భయంతో వారిని పెద్దాస్పత్రులకు పంపుతున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతినెలా 9న తమ పరిధిలోని గర్భిణులు సమీప ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి వైద్యులను సంప్రదించేలా ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు చూడాలి. హైరిస్కు కేసులను గుర్తించి వారికి వైద్యసేవలు అందించాలి. ఇవన్నీ నామమాత్రంగా జరుగుతున్నాయి. రక్తపోటు, మధుమేహం, అధిక రక్తస్రావం, ఉమ్మనీరు పోయి తల్లీబిడ్డల ప్రాణాలకు ఇబ్బంది, గుండె సమస్యలు, రక్తహీనత, కడుపులో బిడ్డ అడ్డం తిరగడం, బిడ్డ చనిపోవడం వంటి ఇబ్బందులుంటే బోధనాసుపత్రులకు తరలిస్తారు. కానీ, సాధారణ కేసులనూ అక్కడికి పంపుతున్నారు. 


- మధ్యాహ్నంలోపే ముహూర్తం... 

ప్రభుత్వాసుపత్రుల్లో చాలావరకూ సిజేరియన్లు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంటలోగానే జరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో షిప్టుల ప్రకారం 24 గంటలూ వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బంది ఉండాలి. కానీ చాలామంది వైద్యులు సొంత క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. మరికొందరు దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం లోపే ఆపరేషన్లు చేసేస్తున్నారు. సాయంత్రం మాత్రం ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. ఇక జిల్లాలో వివిధ ఆసుపత్రుల నుంచి కేసులు వస్తే.. ఆపరేషన్లు తప్పడం లేదని ‘ప్రైవేటు’ వైద్యులు పేర్కొంటున్నారు. నొప్పులు వచ్చాక అత్యవసరంగా అంబులెన్సుల్లో పంపడంతో సిజేరియన్లు అనివార్యం అవుతున్నాయని చెబుతున్నారు. నెలలు నిండినా నొప్పులు రాకపోవడం, ఉమ్మునీరు తక్కువగా ఉండటం వంటి సమస్యలతో సహజ ప్రసవానికి ఇబ్బందులు వస్తున్నాయని కారణం చెబుతూ... ముహూర్తం ప్రకారమే అత్యధిక ఆపరేషన్లు చేసేస్తున్నారు. 


ఆందోళనకరం 

జిల్లాలో గర్భిణులకు ఎక్కువగా ఆపరేషన్లు చేయడం ఆందోళనకరమే. ఆడిటింగ్‌ చేస్తున్నాం.  కొన్ని కేసుల్లో సిజేరియన్లు అక్కర్లేదని గుర్తించాం. అవసరమైన చోట్ల వైద్యుల సంఖ్య పెంచేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చాం. 

- డీఎంహెచ్‌వో చంద్రానాయక్‌

Updated Date - 2021-10-07T05:29:04+05:30 IST