Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కాలాన్ని వెనక్కి తిప్పిన అమెరికా!

twitter-iconwatsapp-iconfb-icon
కాలాన్ని వెనక్కి తిప్పిన అమెరికా!

అబార్షన్ (గర్భస్రావం) చేయించుకునే హక్కు మహిళలకు చట్టబద్ధంగా ఉండితీరాలని అమెరికా వయో జనులలో 61 శాతం మంది అభిప్రాయపడగా 37 శాతం మంది వ్యతిరేకించారని ఈ ఏడాది మార్చి 7–13 తేదీల మధ్య ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. ఈ విభజనలో రాజకీయ కోణమూ ఉంది. డెమొక్రాట్‌లు, డెమొక్రాటిక్ పార్టీ వైపు మొగ్గు చూపే స్వతంత్ర పౌరులు (80 శాతం) గర్భస్రావాలను సమర్థించగా రిపబ్లికన్లు, రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపే స్వతంత్ర పౌరులు (38 శాతం) వ్యతిరేకించారు. ఈ రెండు వర్గాల మధ్య వ్యత్యాసం 2016లో 33 పాయింట్ల నుంచి 2022లో 42 పాయింట్లకు పెరిగింది. 


ఈ వాస్తవాలు ఏమంత ప్రాధాన్యమున్నవి కావు. ‘రాజ్యాంగం ఏమి చెప్పిందని అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు భావిస్తున్నారు?’ అన్నదే ప్రధానమైనది. ‘చట్టం అంటే ఏమిటో చెప్పడమనేది న్యాయశాఖ అంటే సుప్రీం కోర్టు పరిధిలోని అంశం మాత్రమే కాదు, అదేమిటో చెప్పడమనేది సుప్రీం కోర్టు విధి’ అని సుదీర్ఘకాలం అమెరికా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ జాన్ మార్షల్ నొక్కి చెప్పారు. ఇదొక సాధికార ప్రకటన. ఇది పవిత్రమైనది, అనుల్లంఘనీయమైనది. అమెరికా గౌరవించే సంప్రదాయమది.


అమెరికా రాజ్యాంగం తన తన పౌరుల ‘స్వేచ్ఛ’కు కల్పించిన రక్షణలలో గర్భస్రావ హక్కు భాగమని 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 14వ రాజ్యాంగ సవరణలోని ‘అర్హమైన ప్రక్రియ’ నిబంధన కూడా గర్భస్రావ హక్కుకు వర్తిస్తుందని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఇరవై సంవత్సరాల అనంతరం పా వర్సెస్ కేసే కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు రో వర్సెస్ వేడ్ కేసు తీర్పును సమర్థించింది. అమెరికాలో మూడు తరాల మహిళలు గర్భస్రావ హక్కుతో సంతోషంగా జీవించారు.


2022 జూన్ 24న డాబ్స్ వర్సెస్ జాక్సన్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చి తీర్పుతో ఆ దేశ మహిళలు గర్భస్రావం చేయించుకునే హక్కును కోల్పోయారు. ఐదుగురు న్యాయమూర్తులు (వీరిలో ముగ్గురు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నియమించిన న్యాయ మూర్తులు కావడం గమనార్హం) గర్భస్రావ హక్కును వ్యతిరేకించగా, ముగ్గురు న్యాయమూర్తులు ఆ హక్కును సమర్థించారు. ‘మహిళలకు అమెరికా రాజ్యాంగం గర్భస్రావ హక్కును కల్పించలేదని’ సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రో వర్సెస్ వేడ్ కేసులో ‘వాదసరణి’ పూర్తిగా తప్పుడు రీతిలో ఉన్నదని ఆ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘గర్భస్రావం చేసే హక్కును రాజ్యాంగం ఇవ్వలేదని మేం భావిస్తున్నాం. కాబట్టి గర్భస్రావాలను నియంత్రించే అధికారం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తిరిగి అప్పగించాలి’ అని ఆ తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 


‘గర్భస్రావాలను నియంత్రించే అధికారం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు తిరిగి అప్పగించాలనడం’ సరైన నిర్ణయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ‘ప్రజలు’ అంటే ఎవరు? ఒక రెఫరెండమ్‌లో పాల్గొనే ప్రజలు అందరూ కాదు. సమస్త వయోజనులు లేదా సమస్త ఓటర్లూ కాదు. అసలు గర్భస్రావాలపై రెఫెరెండమ్ అంటూ నిర్వహిస్తే అత్యధికులు గర్భస్రావాలకు అనుకూలంగా అంటే రో వర్సెస్ వేడ్, పా వర్సెస్ కేసే కేసుల్లో తీర్పులకు అనుకూలంగా ఓటు వేస్తారనడంలో సందేహం లేదు. ఇక్కడ ప్రజలు అంటే రాష్ట్రాల అధికార పరిధులతో విడివడ్డవారు అని అర్థం చేసుకోవాలి. అలాగే ‘ఎన్నికైన ప్రజా ప్రతినిధులు’ అంటే వివిధ వర్గాల ఓటర్లు, పాక్షిక రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గాల ఓటర్లు ఎన్నుకున్నవారు’ అని అర్థం చేసుకోవాలి. 


గర్భస్రావాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా అమెరికా చీలిపోయింది. 19వ శతాబ్దిలో జరిగిన అంతర్యుద్ధం అనంతరం అమెరికా ఇలా రెండుగా చీలిపోవడం ఇదే మొదటిసారి. అమెరికాలోని 50 రాష్ట్రాలలో సగం రాష్ట్రాలు గర్భస్రావాలను నిషేధించిన చట్టాల అమలును కొనసాగించనున్నాయి. మిగతా రాష్ట్రాలు ఒకసారి గర్భస్రావాన్ని మాత్రమే అనుమతించే అవకాశముంది. ఏమైనా అమెరికా మహిళలు గర్భస్రావం చేయించుకునే హక్కును కోల్పోయారు. అవాంఛిత శిశువుకు జన్మనిచ్చేందుకు సైతం నిరాకరించడం చట్ట విరుద్ధమవుతుంది. అత్యాచారానికి గురై గర్భం ధరించిన మహిళ తనపై ఆ దురాగతం జరిపిన పురుషుడి బిడ్డకు ఎందుకు జన్మనివ్వాలి? ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తాజా తీర్పు స్పష్టం చేసింది. పుట్టిన బిడ్డ ఆలనా పాలనా సరిగా జరిగేందుకు అవసరమైన ఆర్థిక స్తోమత లేనందున గర్భస్రావం చేయించుకోగోరిన మహిళలకు ఇక ఆ స్వేచ్ఛ ఉండదు. 


గర్భస్రావాలపై అమెరికా సుప్రీం కోర్టు తాజా తీర్పు ఘోరంగా లోపభూయిష్టమైనది. ఎందుకని? ‘గర్భస్రావం గురించి అమెరికా రాజ్యాంగం ప్రస్తావించలేదు’ అన్న వాదన ఆధారంగా ఆ తీర్పును వెలువరించారు. కనుకనే ఈ తీర్పు న్యాయశాస్త్ర కోవిదులను దిగ్భ్రాంతిపరిచింది. ‘జాతి చరిత్ర, సంప్రదాయాలు గర్భస్రావ హక్కును పెద్దగా సమర్థించడం లేదు’ అని కూడా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇవే రాజ్యాంగ బద్ధతకు గీటురాళ్లు అయిన పక్షంలో ఈ 21వ శతాబ్ది అమెరికన్లు తమకు సహజసిద్ధంగా లభించిన హక్కులుగా భావిస్తున్న అనేక హక్కులు పూర్తిగా రద్దవుతాయి. గోప్యతా హక్కు ఇందుకొక ఉదాహరణ. అమెరికా రాజ్యంగంలో ఎక్కడా గోప్యత గురించిన ప్రస్తావన లేదు. జాతి వివక్ష అనేది అమెరికా చరిత్రలో ప్రగాఢంగా వేళ్లూనికుని ఉంది. సంతాన నిరోధ హక్కును అనుమతించారు. స్వలింగ సంపర్కమనేది నేరమవుతుంది. ఇలా అనేకానేక ఉదాహరణలు పేర్కొనవచ్చు. 


డాబ్స్ కేసులో తీర్పును ఎలా అర్థం చేసుకోవాలి? ‘గర్భ స్రావాలను నియంత్రించే అధికారం ప్రజలకు, వారు ఎన్నుకునే ప్రజాప్రతినిధులకు తిరిగి అప్పగించడం’ అంటే ఒక మహిళ తన గర్భంలో ఉన్న బిడ్డను ప్రసవించేంతవరకు మోసి తీరేలా ఒక రాష్ట్రం చట్టబద్ధంగా నిర్బంధించగలదని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. ఒక రాష్ట్ర చట్టం ఆ రాష్ట్ర భూభాగాలలో నివసించే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక రాష్ట్ర చట్టాలు ఆ రాష్ట్రాల వెలుపలి ప్రాంతాలకు వర్తించవు. కనుక గర్భస్రావాలకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు వెళ్లి గర్భిణి అబార్షన్ చేయించుకోవచ్చు. అలా గర్భస్రావం చేయించుకోదలిచిన మహిళలకు ఫెడరల్ ప్రభుత్వం లేదా దాతృత్వ సంస్థలు ఆర్థిక సహాయమందించవచ్చు. పౌరుల వైయక్తిక హక్కు కంటే రాజ్యవ్యవస్థ హక్కుకు ప్రాధాన్యమివ్వడం డాబ్స్ కేసు తీర్పు లొసుగుల్లో ప్రధానమైనది. సమాజానికి లేదా రాజ్యానికి సంబంధంలేని, వ్యక్తులకు మాత్రమే సంబంధించిన విషయాలలో రాజ్యవ్యవస్థకు ప్రాధాన్యమివ్వడం న్యాయబద్ధమేనా? 


గర్భస్రావ హక్కు విషయంలో మన సుప్రీం కోర్టు వైఖరే సబబుగా ఉందని చెప్పవచ్చు. గర్భస్రావ హక్కును, గోప్యతా హక్కు, జీవించేహక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుల్లో భాగంగా భారత సర్వోన్నత న్యాయస్థానం పరిగణించడం ఎంతైనా ముదావహం. గర్భధారణ జరిగిన 24 వారాల వరకు గర్భస్రావం చేయించుకునేందుకు మనదేశంలో చట్టబద్ధమైన అనుమతి ఉన్నది. ఇందుకు సంబంధించిన నిబంధనలు పటిష్ఠంగా ఉన్నాయి. గర్భస్రావం చేసేందుకు ముందుగా ఇద్దరు డాక్టర్ల అభిప్రాయాన్ని తప్పక తెలుసుకోవాలి. గర్భ విచ్ఛితి కారణంగా సంబంధిత మహిళ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగకూడదు. 


అమెరికాలో గర్భస్రావాన్ని చట్టబద్ధం చేసిన తరువాత నిర్వహించిన వివిధ సర్వేలలో మహిళల విద్యా, ఉద్యోగ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడినట్టు స్పష్టంగా వెల్లడయింది. అమెరికా సుప్రీం కోర్టు తాజా తీర్పు అమెరికా సమాజాన్ని రెండుగా చీల్చివేసింది. ఇతర కారణాల మూలంగా మన భారతీయ సమాజమూ అనేక విధాలుగా చీలిపోయి ఉంది. కులం, మతం, భాష, జెండర్ అసమానతలు మొదలైనవన్నీ మన సమాజంలో చీలికలకు కారణాలుగా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మెజారిటేరియన్, కేంద్రీకృత విధానాలను ఆ చీలికలను మరింతగా విషమింప చేస్తున్నాయి. అమెరికా, భారత్‌లు అతి పురాతన, అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలు. సమాఖ్య పాలనా విధానాన్ని అనుసరిస్తున్న ఈ రెండు దేశాలూ విభక్త జాతులుగా పరిణమించే రోజు ఆసన్నమవుతుందనే విషయాన్ని మీరెప్పుడైనా ఊహించారా?


కాలాన్ని వెనక్కి తిప్పిన అమెరికా!

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, 

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.