ఉసురు తీసిన వలస

ABN , First Publish Date - 2022-08-19T06:11:41+05:30 IST

బతుకు పోరాటం వారిని వందల మైళ్ల దూరం తీసుకువచ్చింది. అయినవారికి దూరంగా గడిపే క్రమంలో.. మనోవేదన, శారీరక శ్రమ.. వారిని మత్తుకు బానిసలను చేసింది.

ఉసురు తీసిన వలస
మృతులు పనిచేసిన తోట

కుటుంబాలకు దూరంగా కూలి బతుకులు

మనోవేదన.. శారీరక శ్రమతో మత్తుకు బానిస

మహారాష్ట్ర కూలీల మరణానికి కారణం ఇదేనా..?

కుటుంబ సభ్యులకు  సమాచారం.. నేడు పోస్టుమార్టం

అనంతపురం క్రైం, ఆగస్టు 18: బతుకు పోరాటం వారిని వందల మైళ్ల దూరం తీసుకువచ్చింది. అయినవారికి దూరంగా గడిపే క్రమంలో.. మనోవేదన, శారీరక శ్రమ.. వారిని మత్తుకు బానిసలను చేసింది. వ్యసనం హద్దులుదాటి.. ఉసురు తీసేసింది. అనంత శివారులోని ఓ ద్రాక్షతోటలో ముగ్గురు మహారాష్ట్ర కూలీలు మృతి చెందడం వెనుక పేదరికం, వలస జీవనం, వ్యసనాలు.. ఇలా ఎన్నెన్నో కారణాలు కనిపిస్తున్నాయి. అనంతపురం రూరల్‌ మండ లం ఆలమూరు రోడ్డులో అదే గ్రామానికి చెందిన పలమాసి రాజు ద్రాక్షతోట సాగు చేశా డు. అక్కడ పనిచేస్తున్న భరత నామ్‌దేవ్‌ చౌహన(43), దీపక్‌  జైసింగ్‌ శిరితోడే(45), సదా(40) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ మరణాలకు మత్తుపదార్థాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మహారాష్ట్రలోని సౌలాజి ప్రాంతానికి చెందిన వీరు.. ద్రాక్ష తోటల పెంపకంలో నిష్ణాతులు. మొక్క నుంచి పంట కోత వరకు మొత్తం ప్రక్రియను చూస్తారు. ఇందుకోసం తోటలోనే రేయింబవళ్లూ ఉంటున్నారు. ద్రాక్షతోటల్లో పనులను స్థానిక కూలీలు చేయలేరు. అందుకే మహారాష్ట్ర నుంచి కాంట్రాక్టర్ల ద్వారా కూలీలను తెచ్చుకుంటారు. రోజుకు ఒక్కొక్కరికి రూ.500 ఇస్తుంటారు. వీరు ఆరు నెలలకు ఒకసారి మాత్రమే స్వస్థలాలకు వెళతారు. కొన్నాళ్లు ఉండి.. తిరిగి వస్తుంటారు. టమోటా మండీలు, భవన నిర్మాణాలు, పాల డెయిరీలు తదితర పనుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ, మహారాష్ట్ర, రాజస్థాన వారే కూలీలుగా ఉంటారు. 90 శాతం మంది కుటుంబాలను వదిలి ఒక్కరే వస్తారు. జిల్లాలో ఇలాంటి వారి సంఖ్యలో వేలల్లో ఉంటుంది. 


వ్యసనాలకు బానిసలు

కుటుంబ సభ్యులకు దూరంగా నెలల తరబడి గడిపే వలస కూలీలు.. మానసిక ఆందోళనకు గురవుతుంటారు. ఫోనలో తమవారితో మా ట్లాడి.. సంతృప్తి పడుతుంటారు. కుటుంబాలను పోషించడానికి వందల కిలోమీటర్ల దూరం వచ్చేస్తుంటారు. ఇది వారి దుర్భర జీవనానికి అద్దంపట్టే విషయం. అక్కడ కుటుంబ సభ్యులకు ఏదైనా ఇబ్బంది కలిగినా, హఠాత్పరిణామాలు చోటుచేసుకున్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా వీరు తీవ్ర మనోవేదన చెందుతారు. అంతదూరం వెళ్లలేక తల్లడిల్లిపోతారు. దీనికి తోడు చేసే పనులన్నీ భారంతో కూడుకున్నవే. ఈ నేపథ్యంలో కొందరు దురలవాట్లకు లోనవుతున్నారు. బీడీలు, సిగరెట్లు, గుట్కా, మద్యం తదితర వ్యసనాలకు బానిసలవుతుంటారు. ద్రాక్షతోటలో మృతి చెందిన ముగ్గురూ మద్యం అతిగా సేవించేవారని తెలుస్తోంది. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


కుటుంబ సభ్యులకు సమాచారం

అనంతపురం ఇనచార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ తమ సిబ్బందితో ద్రాక్షతోటలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల్లో భరత నామ్‌దేవ్‌ చౌహన, దీపక్‌  జైసింగ్‌ శిరితోడేకు భార్యాపిల్లలు ఉన్నట్లు తెలిసింది. వారి ఫోన నెంబర్ల ద్వారా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. తోట యజమానితో ఒప్పందం చేసుకున్న కాం ట్రాక్టర్‌కు పోలీసులు విషయం తెలియజేశారు. మరో మృతుడు సదాకు కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. మృతుల బంధువులు ఇప్పటికే బయలుదేరారని ఇనచార్జ్‌ డీఎస్పీ తెలిపారు. 


నేడు పోస్టుమార్టం

కొన ఊపిరితో ఉన్న సమయంలో దీపక్‌ జైసింగ్‌ శిరితోడే, సదాను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత ఇద్దరూ మృతి చెందారు. వారి మృతదేహాలను మార్చురీకి తరలించారు. భరత నామ్‌దేవ్‌ చౌహన తోటలోనే మృతి చెందాడు.  దీంతో పోలీసులు సంఘటనా స్థలా న్ని పరిశీలించిన అనంతరం భరత మృతదేహాన్ని ఆలస్యంగా మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబసభ్యులు శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకుంటారని, వారు వచ్చిన తరువాతే పోస్టుమార్టం జరుగుతుందని ఇనచార్జి డీఎస్పీ తెలిపారు. 


మహారాష్ట్ర కమిషనర్‌కు సమాచారం

మహారాష్ట్ర కూలీలు మద్యం సేవించి మృతి చెందిన విషయాన్ని ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌కు జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలియజేశారు. మహారాష్ట్రకు చెందిన దేశీదారు అనే మద్యం సేవించారని, ఆ మద్యం మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతితో తయారు చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కుమురేశ్వరన ఓ ప్రకటనలో తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ మద్యం కాదని అన్నారు. 





Updated Date - 2022-08-19T06:11:41+05:30 IST