ఆదివాసీ మహిళ, ఆ ఎంపికే కొంత ఘనత!

ABN , First Publish Date - 2022-06-23T07:00:59+05:30 IST

ఎన్ని విషయాలు తెలిస్తే అన్ని సందేహాలు. ఎంత ఆలోచన ఉంటే అంత శంక. ఫలితం.. మనశ్శాంతి ఉండదు. ఎంతో కొంత మంచి ఉన్నా సంతోషించే మనసు ఉండదు....

ఆదివాసీ మహిళ, ఆ ఎంపికే కొంత ఘనత!

ఎన్ని విషయాలు తెలిస్తే అన్ని సందేహాలు. ఎంత ఆలోచన ఉంటే అంత శంక. ఫలితం.. మనశ్శాంతి ఉండదు. ఎంతో కొంత మంచి ఉన్నా సంతోషించే మనసు ఉండదు. దేవుడా, ఈ వివేచనా భారాన్ని మోయలేము, ఇంత అమాయకత్వమో అజ్ఞానమో ప్రసాదించు తండ్రీ అని మొరపెట్టుకోవాలనిపిస్తుంది. లేకపోతే ఏమిటి, ఒక ఆదివాసీ, పైగా మహిళా ఆదివాసీ భారతదేశ రాష్ట్రపతి కాబోతుండగా, ఆ పరిణామంలోని ప్రగతిశీలతకు ముగ్ధులము కాకుండా, ఎందుకు ప్రశ్నార్థకాలు?


నిజమే కదా, పూర్తి భిన్నత్వంలో, కీకారణ్యాలలో, వేరు సంస్కృతితో, ప్రాకృతిక జీవనాధారాలతో బతుకుతూ– చదువుకున్నవారమని, అధికులమని అనుకునే నాగరికుల చేతిలో దోపిడిని, వ్యవస్థల ఉక్కుపాదపు హింసను అనుభవించే ఆదివాసీ సమాజాల నుంచి ఒక వ్యక్తి, రైసినాహిల్స్‌కి ఆరోహణ చేస్తున్నప్పుడు, అందులో ఒక కవితాన్యాయం ఉంది కదా? నిజమైన సాధికారత లేకపోవచ్చు, ఉత్సవ విగ్రహమే కావచ్చు, కానీ, ప్రతీకలకు కూడా ఏదో ప్రయోజనం ఉంటుంది కదా?


కాబట్టి, ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని, ఆ తరువాత సంక్రమించే రాష్ట్రపతిత్వాన్ని మొదట ఆహ్వానిద్దాం. ఈ హడావుడి అంతా ముగిశాక, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లాగే ఆమె కూడా నిశ్శబ్దంగా, నిరాడంబరంగా, అనామకంగా తన విధులు నిర్వహిస్తూ, అయిదేళ్ల తరువాత నిష్క్రమిస్తారు.


జనతాపార్టీ అనే 1970ల నాటి ప్రయోగంలో తమ పూర్వీకులు జనసంఘీయులు ఉన్నారు కాబట్టి, రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి ఎంపికలో బిజెపి భాగస్వామ్యం కూడా ఉన్నదనవచ్చు. కానీ, తామే నిర్ణాయకంగా ఉన్న కూటమిలో, తమ మాటే చెల్లుబాటయ్యి బిజెపి చేసిన రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికల్లో ద్రౌపది ముర్ముది మూడోది. మొదటిది అబ్దుల్ కలామ్‌ది. శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్న వ్యక్తిని రాష్ట్రపతిని చేయడం మొదటిసారి కానీ, ముస్లిమ్‌ను రాష్ట్రపతి చేయడం కాంగ్రెస్ అంతకు మునుపే రెండుమార్లు చేసింది. పూర్తి కాలం పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వం హయాంలో, అందులోనూ ‘హిందూత్వ’ రాజకీయపక్షం హయాంలో ముస్లిమ్ రాష్ట్రపతి కావడం మాత్రం విశేషమే. 2017లో దళితుడిని రాష్ట్రపతి చేయడం కూడా విశేషమే అయినప్పటికీ, అదే ప్రథమం కాదు. 1990 దశకం ద్వితీయార్థంలో కాంగ్రెస్, మధ్యేవాద పార్టీల కూటమి అధికారంలో ఉన్న కాలంలో కెఆర్ నారాయణన్ రాష్ట్రపతి అయ్యారు. మన్మోహన్‌ సింగ్ ప్రధానిగా ఉన్న యుపిఎ కాలంలో ప్రతిభాపాటిల్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మొదటి మహిళా రాష్ట్రపతి ఆమే. ప్రస్తుతం బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ మహిళా అభ్యర్థిని ఎంపిక చేసినప్పటికీ, ద్రౌపది ముర్ము విశిష్టత ఆమె ఆదివాసీ నేపథ్యమే. ఈ ఘనతను భారతీయ జనతాపార్టీకి, దాని మిత్రపక్షాలకు ఇవ్వవలసిందే. మహిళా ఓట్లు ఆదివాసీ ఓట్ల మీద గురిపెట్టి బిజెపి ఈ ఎంపిక చేసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కానీ, అందులో తప్పుపట్టవలసింది ఏముంది? వివిధ సామాజిక శ్రేణులలో తమ ప్రాబల్యం పెంచుకోవడానికే కదా, వారికి రాజకీయాల్లో, అధికారంలో ప్రాతినిధ్యాన్ని, భాగస్వామ్యాన్ని కల్పిస్తారు? అయితే, భారతీయ జనతాపార్టీ కేవలం ఓట్ల కోసమే ఆదివాసీ మహిళకు ఈ గౌరవం ఇస్తున్నదనుకోలేము. హైందవ సమాజ ఛత్రం కిందికి ఆదివాసులను సమీకృతం చేయడానికి వారు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నంలో ఇది కూడా ఒక భాగం. ‘హిందూత్వ’ రాజసూయంలో ఇదొక ముందడుగు.


వివిధ సామాజిక అస్తిత్వాలకు చెందిన వారిని అత్యున్నత స్థానంలో ప్రతిష్ఠించడం ద్వారా ఆయా శ్రేణులను ఆకట్టుకోవడానికి గత నాలుగు దశాబ్దాల నుంచి పాలకపక్షాలు ప్రయత్నిస్తూ వచ్చాయి. అన్ని సార్లూ ఆకట్టుకోవడానికే కాదు, కొన్ని మార్లు ప్రతికూల విధానాలను సమతుల్యం చేయడానికి కూడా ఎంపికలు జరిగాయి. 1980 దశకం మొదట్లో సిక్కుల నుంచి మిలిటెంట్ పోరాటాలు ఎదురైనప్పుడు, అణచివేతను కానీ, పరిష్కార ప్రయత్నాలను కానీ సానుకూలంగా ప్రభావితం చేయడం కోసమని దూరదృష్టితో ఇందిరాగాంధీ జ్ఞానీ జైల్‌సింగ్‌ను రాష్ట్రపతి చేశారు. శ్రీలంక తమిళుల పోరాటంలో తాను కల్పించుకోవాలని భావిస్తున్న కాలంలోనే, రాజీవ్ గాంధీ తమిళుడైన ఆర్. వెంకట్రామన్‌ను రాష్ట్రపతి చేశారు. భారతదేశాన్ని అణ్వస్త్రదేశంగా లోకానికి చాటడానికి ఉత్సాహపడుతున్న కాలంలో అబ్దుల్ కలామ్ రాష్ట్రపతి అభ్యర్థి అయ్యారు. ‘మంచి ముస్లిమ్’ విషయంలో తమకు వ్యతిరేకత ఉండదని చెప్పడానికి కూడా వాజపేయి ప్రభుత్వానికి ఆ ఎంపిక ఉపయోగపడింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం ‘మరో మంచి ముస్లిమ్’ కోసం గాలింపు జరుగుతున్నదంటున్నారు కానీ, వాజపేయి కాలంలో ఉన్న కొన్ని సంస్కారాలకు ఇప్పుడు ఏమంత చెల్లుబాటు లేదు. చూడాలి, ఎవరవుతారో ఉపరాష్ట్రపతి అభ్యర్థి!


తరువాత తరువాత రాష్ట్రపతులంటే రబ్బరుస్టాంపులన్న పేరుపడింది కానీ, మొదట్లో, రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ దేశం స్వభావానికి మచ్చుతునకలుగా ఉండాలని అనుకునేవారు. బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి కావడం మొదటిసారీ, రెండోసారీ కూడా నెహ్రూకు ఇష్టం లేదు. చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రథమ రాష్ట్రపతి కావాలని నెహ్రూకు ఉండేది. రాజాజీ రాజకీయంగా మితవాదే అయినా, సామాజికంగా ఉదారవాది. సామరస్య సహజీవనం వంటి విషయాల్లో నెహ్రూకు ఆయనకు అభిప్రాయాల సామ్యం ఉండేది. రాజేంద్రప్రసాద్ సామాజికంగా కూడా సంప్రదాయవాది. మహిళలకు రక్షణలు, హక్కులు కల్పించే హిందూ కోడ్ బిల్లు విషయంలో నెహ్రూ, రాజేంద్రప్రసాద్ అభిప్రాయాలు పూర్తి భిన్నమైనవి. సర్దార్ పటేల్ రాజేంద్రప్రసాద్ వైపు ఉన్నారు. ఆ రాజకీయ ఘర్షణలో నెహ్రూ గెలవలేకపోయాడు. అంతే కాదు, ఆ తరువాత జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో కూడా నెహ్రూ సమర్థించిన ఆచార్య కృపలానీ ఓడిపోయి, పటేల్ పక్షీయుడైన పురుషాత్తమ్ దాస్ టాండన్ గెలిచారు. రాజేంద్ర ప్రసాద్ మలి ఎంపిక కూడా నెహ్రూకు ఇష్టం లేదు. ఉపరాష్ట్రపతిగా ఉన్న రాధాకృష్ణన్ రాష్ట్రపతి కావాలని నెహ్రూ ఆశించారు. ఆ సమయానికి పటేల్ భౌతికంగా లేకపోయినా, పార్టీ అభిమతం రాజేంద్రప్రసాద్‌కు అనుకూలంగా ఉండడంతో, నెహ్రూ ఒప్పుకోక తప్పలేదు. ప్రధానమంత్రి అభీష్టానికి భిన్నంగా వ్యవహరించగలిగే శక్తి, చొరవ నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవి. రాజేంద్రప్రసాద్ రెండు విడతల రాష్ట్రపతిత్వం 1962లో ముగిశాక, నెహ్రూ ఇష్టుడిగా రాష్ట్రపతి భవన్ ప్రవేశించిన రాధాకృష్ణన్ చైనా యుద్ధం తరువాత ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించి, కృష్ణమీనన్ రాజీనామా చేసేట్టు చేశారు. వి.వి. గిరి రాష్ట్రపతి కావడం దేశరాజకీయాలలో ఆసక్తికరమైన ఘట్టం. కాంగ్రెస్‌లో అంతర్గత పోరాటానికి రాష్ట్రపతి ఎన్నికను ఆలంబన చేసుకున్నారు ఇందిరాగాంధీ. అంతరాత్మ ప్రబోధం పేరుతో, అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు చేయమని పిలుపివ్వడం, వి.వి.గిరి గెలవడం కాంగ్రెస్‌లో ఇందిర స్థానాన్ని దృఢపరచిన పరిణామం. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా, కార్మికోద్యమ నాయకుడిగా వి.వి. గిరి ప్రతిష్ఠాత్మక వ్యక్తే అయినప్పటికీ, ప్రత్యేకతను వ్యక్తంచేసే సంఘటనలేవీ ఆయన హయాంలో జరగలేదు. కేంద్ర కేబినెట్ తీర్మానం లేకుండానే, ఇందిర పంపిన ఎమర్జెన్సీ విధింపు ఆదేశం మీద సంతకం చేసిన రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చరిత్రలో నిలిచిపోతారు. కాంగ్రెస్ అనుకూలతను ఎక్కడా దాచుకోకుండా వ్యవహరించారని ఆర్. వెంకట్రామన్‌కు పేరు వచ్చింది. మచ్చలేకుండా విజ్ఞతతో వ్యవహరించిన రాష్ట్రపతిగా కె.ఆర్. నారాయణన్‌ను చెబుతారు. చివరకు అబ్దుల్ కలామ్ కూడా 2004 ఎన్నికలకు ముందు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని తాను నడుపుతాని, ప్రత్యేక అధికారాలిమ్మని వాజపేయిని వేధించాడంటారు. అధికార మార్పిడి సందర్భాలలో, మిశ్రమప్రభుత్వాల కప్పల తక్కెడ సన్నివేశాలలో రాష్ట్రపతులు క్రియాశీలంగా ఉండడానికి, తమ విచక్షణలను ఉపయోగించే అవకాశం వస్తుంటుంది. కానీ, బలమైన ప్రభుత్వాలు ఉన్న సందర్భాలలో వారు చేయగలిగేది ఏమీ ఉండదు. విదేశాలకు వెళ్లాలంటే కూడా ప్రధానమంత్రి అనుమతి ఇవ్వాలి. రామనాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు గత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులతో పోలిస్తే తక్కువ విదేశీపర్యటనలు చేశారు. అవి కూడా ముప్పాతిక వంతు చిన్నాచితకా దేశాలకే. ప్రపంచానికి భారత ముఖంగా ప్రధాని ఒక్కరే తెలియాలనుకుంటే, ఇట్లాగే ఉంటుంది.


గతంలో జైల్ సింగ్, వెంకట్రామన్ తాము ప్రాతినిధ్యం వహించే అస్తిత్వ శ్రేణులకు తమ ప్రభుత్వాల నుంచే సమస్యలు వచ్చినప్పుడు, ఆ సంక్లిష్ట సందర్భాలను ఎట్లా అధిగమించారో తెలియదు. స్వర్ణదేవాలయం ప్రాంగణం ముందు భక్తుల పాదరక్షలు శుద్ధి చేసే శిక్షను రాష్ట్రపతిగానే అనుభవించారు జైల్ సింగ్. మరి దేశంలోని అణగారిన వర్గాలకు ఎదురవుతున్న అత్యాచారాలను, అణచివేతను, వివక్షను ఆయా శ్రేణులకు చెందిన ప్రథమపౌరులు నిరసించడమో, కనీసం బాధపడడమో చేయాలి కదా? గత అయిదేళ్ల కాలంలో రామ్‌నాథ్ కోవింద్ దళితులతో సహా వివిధ బాధిత వర్గాల విషయంలో సహానుభూతి వ్యక్తం చేశారా? రేపు ద్రౌపది ముర్ము చేస్తారా? ఆదివాసీలు తమ మనుగడకే ముప్పు వచ్చిన సమయంలో కూడా ఈ దేశ వనరులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. గొంతెత్తినందుకు నిర్బంధంలో పడుతున్నారు. వారి తరఫున మాట్లాడినవారు కూడా అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్నారు. ఏదో దేవాలయంలో చీపురు పట్టి ఊడుస్తున్న ద్రౌపది ఫోటో ఒకటి బుధవారం నాడు సామాజిక మాధ్యమాలలో కనిపించింది. శ్రమగౌరవాన్ని సూచించే ఆమె నిరాడంబరత వాంఛనీయమే! కానీ రాజ్యాంగ విలువలపై ఎంత దుమ్ము పేరుకుపోయిందో కూడా రేపు చూడగలగాలి!


ముందే చెప్పినట్టు, ద్రౌపది ఏమీ చేయలేకపోయినా, చేయకపోయినా కూడా, ఆదివాసీ మహిళ ఈ దేశ రాష్ట్రపతి కావడం దానంతట అదే కొంత గొప్ప!


కె. శ్రీనివాస్

Updated Date - 2022-06-23T07:00:59+05:30 IST