లేట్‌ ఫిట్‌నెస్‌ జరిమానాలు రద్దు?

ABN , First Publish Date - 2022-07-06T09:31:30+05:30 IST

మోటారు వాహనాలకు ‘లేట్‌ ఫిట్‌నెస్‌’ జరిమానాలను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

లేట్‌ ఫిట్‌నెస్‌ జరిమానాలు రద్దు?

రెండు మూడురోజుల్లో ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): మోటారు వాహనాలకు ‘లేట్‌ ఫిట్‌నెస్‌’ జరిమానాలను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై రెండుమూడు రోజుల్లో జీవో వెలువడే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.  సవరించిన మోటారు వాహనాల చట్టం మేరకు.. వాహనాలకు గడువులోగా ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించని పక్షంలో రోజుకు రూ.50 చొప్పున జరిమానా వసూలు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్దేశించింది. ఏప్రిల్‌ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తోంది. అయితే, కరోనా కల్లోలం కారణంగా రెండున్నరేళ్లుగా వాణిజ్య వాహనాలు.. ప్రధానంగా ఆటోలు, క్యాబ్‌లు, ట్రాలీలు రోడ్ల మీదకు రాలేదు. ఫిట్‌నెస్‌ పరీక్షలపై వాహన యజమానులు కూడా నిర్లక్ష్యంగా వ్యహరించారు. తెలంగాణ ప్రభుత్వం అకస్మాత్తుగా ఫిట్‌నెస్‌ ఆలస్యానికి జరిమానాలు విధించాలని నిర్ణయించడంతో కొందరు వాహనదారులు రూ.30 వేల నుంచి రూ.లక్ష దాకా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు, డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చడానికి కూడా ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించాలి. రవాణా శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. దీనికి కూడా వేలల్లో జరిమానాలు చెల్లించాల్సి రావడంతో డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ల ఆందోళనతో రవాణా శాఖ ప్రత్యామ్నాయాలను ఆలోచించింది. పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టుగా జరిమానాను రోజుకు రూ.10కు తగ్గించాలని ప్రభుత్వానికి నివేదించింది. అయితే, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఎలాంటి జరిమానాలు లేకుండానే ఫిట్‌నెస్‌ చేయించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ప్రభుత్వం అఽధికారులకు సూచించినట్టు తెలిసింది. లేట్‌ ఫిట్‌నెస్‌ జరిమానా రద్దైతే సుమారు నాలుగు లక్షల మంది డ్రైవర్ల్లకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. 

Updated Date - 2022-07-06T09:31:30+05:30 IST