వృత్తి పన్ను రద్దు చేయండి

ABN , First Publish Date - 2022-06-28T05:16:45+05:30 IST

న్యాయవాదులకు విధించిన వృత్తి పన్నును రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు.

వృత్తి పన్ను రద్దు చేయండి
కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

కలెక్టరేట్‌ ఎదుట న్యాయవాదుల నిరసన

రాయచోటి (కలెక్టరేట్‌), జూన్‌ 27: న్యాయవాదులకు విధించిన వృత్తి పన్నును రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. జిల్లా న్యాయవాదుల సంక్షేమ సమితి, అఖిల భారత న్యాయవాదుల సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవాదుల సంక్షేమ సమితి అధ్యక్షుడు రాజుకుమార్‌రాజు, ప్రధాన కార్యదర్శి ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ న్యాయవాది వృత్తిలోకి చాలామంది యువత వస్తున్నారని, ఈ వృత్తిలో న్యాయవాదులు స్థిరపడాలంటే కనీసం ఐదు నుంచి పది సంవత్సరాల సమయం పడుతుందని, ఈ సమయంలో వీరికి ఎవరి నుంచి కూడా సహాయ సహకారాలు ఉండవన్నారు. ఇదే సమయంలో వృత్తి పన్ను కట్టాలని ప్రభుత్వం ఇబ్బంది పెడితే వారిపై ఆర్థిక భారం పడి కోలుకోలేని పరిస్థితి ఉంటుందన్నారు. అఖిల భారత న్యాయవాదుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్‌ మాట్లాడుతూ జూనియర్లు, సీనియర్లు అని తేడా లేకుండా సుమారు 80 శాతం మంది న్యాయవాదులు సాధారణ జీవితం గడపడానికి కూడా సంపాదన లేని పరిస్థితిలో ఉన్నారని, ఇలాంటి వారందరూ ఎలా కడతారని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2018 నుంచి 2022 వరకు సంవత్సరానికి 2500 ప్రకారం 12,500 రూపాయలు వృత్తి పన్ను చెల్లించాలంటూ వాణిజ్య పన్నుల శాఖ నుంచి ప్రతి న్యాయవాదికి నోటీసులు వస్తున్నాయని, దీనిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి పన్నుల వసూలును మానేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో అఖిల భారత న్యాయవాదుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఖాదర్‌బాషా, ఉపాధ్యక్షులు చిన్నయ్య, హుమయున్‌బాషా, న్యాయవాదులు నాగేశ్వరరావు ఖైరున్‌, వరలక్ష్మి, రవిశంకర్‌, నాగార్జున, వెంకటేష్‌, టీవీ రమణ, ఖిజర్‌బాషా, కల్యాణ్‌, కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు. 

Updated Date - 2022-06-28T05:16:45+05:30 IST