మాగాయ

ABN , First Publish Date - 2018-04-29T20:46:35+05:30 IST

పచ్చిమామిడికాయలు - ఐదు, కారం-అరకప్పు, ఉప్పు-అరకప్పు, మెంతులు-రెండు టీస్పూన్లు...

మాగాయ

కావలసిన పదార్థాలు
 
పచ్చిమామిడికాయలు - ఐదు, కారం-అరకప్పు, ఉప్పు-అరకప్పు, మెంతులు-రెండు టీస్పూన్లు, పసుపు-రెండు టీస్పూన్లు, ఆవాలు-రెండు టేబుల్‌స్పూన్లు, నువ్వుల నూనె-200 మిల్లీ లీటర్లు, ఇంగువ-కొద్దిగా.
 
తయారీవిధానం
 
మామిడికాయలను కడిగి పొడి బట్టతో తుడవాలి. తొక్క తీసేసి పొడవు ముక్కలుగా తరగాలి. ముక్కలతోపాటు టెంకెలను కూడా ఈ పచ్చడిలో వేయొచ్చు. ఒక ప్లాస్టిక్‌ పాత్రలో పసుపు, ఉప్పు కలిపి అందులో మామిడి ముక్కలను వేసి బాగా కలపాలి.
మూడు రోజులు వరకూ దాన్ని అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల మామిడి ముక్కల్లోని నీరు బాగా ఊరుతుంది. నాలుగో రోజు మామిడిముక్కల నుంచి రసం పిండి ప్లాస్టిక్‌ షీటు మీద ముక్కలు పరిచి ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టడం వల్ల ముక్కల్లోని తడి పోతుంది. ఐదవ రోజు నువ్వుల నూనెను వేడిచేసి అందులో ఆవాలు వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు ఇంగువ వేయాలి. తరువాత ఈ తాలింపును స్టవ్‌ మీదనుంచి దించి చల్లారనివ్వాలి. వేగించిన మెంతులను మిక్సీలో వేసి పొడి చేయాలి. కారం, మెంతిపొడులు కలిపి ఊరబెట్టిన మామిడి రసంలో వేసి కలపాలి. రసం ఒకటిన్నర కప్పు ఉంటే, అరకప్పు రసం తీసి భద్రపరచాలి. గాలిచొరబడని టప్పర్‌వేర్‌ బాటిల్‌ లేదా జాడీలో మాగాయని ఉంచాలి. మూడు రోజుల తర్వాత పచ్చడిపై నూనె తేలుతుంటే సరిగ్గా వచ్చిందని అర్థం. నూనె తక్కువైనట్టు అనిపిస్తే పావు కప్పు నువ్వుల నూనెను వేడి చేసి చల్లారాక పచ్చడిపై పోయాలి. ఈ పచ్చడి ఒక వారం రోజులు ఊరాక తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-04-29T20:46:35+05:30 IST