బెంగాలీ చేపల పచ్చడి

ABN , First Publish Date - 2017-05-06T16:42:32+05:30 IST

చేపలు - అర కిలో (ఏ రకం చేప అయినా ఫర్వాలేదు. వాటిని చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), కశ్మీరీ కారం పొడి - 1 టీస్పూను, మిరియాల పొడి - అర టీస్పూను, పసుపు - అర టీస్పూను, ఉప్పు - అర టీస్పూను, కరివేపాకు - 2 రెబ్బలు, నువ్వుల నూనె - వేపుడుకు సరిపడా.

బెంగాలీ చేపల పచ్చడి

కావాల్సిన పదార్థాలు: చేపలు - అర కిలో (ఏ రకం చేప అయినా ఫర్వాలేదు. వాటిని చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), కశ్మీరీ కారం పొడి - 1 టీస్పూను, మిరియాల పొడి - అర టీస్పూను, పసుపు - అర టీస్పూను, ఉప్పు - అర టీస్పూను, కరివేపాకు - 2 రెబ్బలు, నువ్వుల నూనె - వేపుడుకు సరిపడా.
 
మసాలా పొడి కోసం: ఆవాలు - అర టీస్పూను, జీలకర్ర - పావు టీస్పూను, మెంతులు - పావు టీస్పూను(వీటన్నిటినీ నూనె లేకుండా వేగించి పొడి చేసుకోవాలి).
 
గ్రేవీ కోసం: నువ్వుల నూనె - పావు కప్పు, ఆవాలు - అర టీస్పూను, మెంతులు - అర టీస్పూను, అల్లం - అంగుళం ముక్క (సన్నగా తరగాలి), వెల్లుల్లి - 4 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి - 4 (మధ్యకి కోయాలి), పంచదార - 1 టీస్పూను, కశ్మీరీ కారం పొడి - 4 టీస్పూన్లు, పసుపు - పావు టీస్పూను, మిరియాల పొడి - అర టీస్పూను, వెనిగర్‌ - పావు కప్పు.
 
తయారీ: చేప ముక్కలకు 1 టీస్పూను కారం, అర టీస్పూను మిరియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. బాండీలో నూనె వేడిచేసి చేపలను కరకరలాడే వరకూ వేగించి తీయాలి. ఇంకో బాండీలో పావు కప్పు నువ్వుల నూనె పోసి ఆవాలు, మెంతులు వేసి చిటపటమన్నాక కరివేపాకు వేయాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి చిన్న మంట మీద రంగు మారే వరకూ వేయించాలి. తర్వాత 4 టీస్పూన్ల కారం, అర టీస్పూను మిరియాల పొడి, పావు టీస్పూను పసుపు, ఉప్పు వేసి పచ్చి వాసన పోయేవరకూ చిన్న మంట మీద వేగించాలి.
 
తర్వాత పావు కప్పు వెనిగర్‌, 1 టీస్పూను ఉప్పు, పంచదార వేసి కలపాలి. ఈ మిశ్రమంలో వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలపాలి. ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల మిశ్రమాన్ని చల్లి బాగా కలపాలి. పొయ్యి మీద నుంచి దింపి చల్లార్చి జాడీలో భద్రపరచాలి.

Updated Date - 2017-05-06T16:42:32+05:30 IST