శాఫ్రాన్‌ చికెన్‌

ABN , First Publish Date - 2018-09-12T23:10:07+05:30 IST

చికెన్‌: అరకిలో, చిక్కటి పెరుగు: రెండు కప్పులు, గోరువెచ్చని పాలు: అరకప్పు, క్రీం: మూడు స్పూన్లు

శాఫ్రాన్‌ చికెన్‌

కావలసిన పదార్థాలు
 
చికెన్‌: అరకిలో, చిక్కటి పెరుగు: రెండు కప్పులు, గోరువెచ్చని పాలు: అరకప్పు, క్రీం: మూడు స్పూన్లు, శాఫ్రాన్‌(కుంకుమపువ్వు): చిటికెడు, అల్లంపొడి: టేబుల్‌ స్పూను, కారం: స్పూను, ధనియాల పొడి: రెండుస్పూన్లు, సోంపు పొడి: అరటీ స్పూను, జీలకర్ర: టేబుల్‌ స్పూను, పసుపు: చిటికెడు, నూనె: తగినంత, ఉప్పు: రుచికి సరిపడ, కొత్తిమీర కొద్దిగా.
 
తయారీ విధానం
 
చికెన్‌ని శుభ్రం చేసుకుని దానికి పెరుగు, అల్లం పొడి, ధనియాల పొడి, కారం, సోంపు పొడి, పసుపు, ఉప్పు, అన్నీ కలిపి పట్టించి గంట పాటు బాగా నాననివ్వాలి. అనంతరం టిష్యూ పేపర్‌తో చికెన్ ముక్కలకు ఉన్న మసాలాను సున్నితంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె పోసి కాగిన తరువాత చికెన్‌ ముక్కలను వేసి కొద్దిసేపు వేయించి నూనెలోంచి తీసి పక్కన పెట్టాలి. మరో బాండీలో కొద్దిగా నూనె వేసి కాగిన తరువాత చికెన్‌ ముక్కలు తీసివేయగా మిగిలిన మసాలాలను వేసి కొద్దిసేపు వేయించాలి. నూనె పైకి తేలుతున్న సమయంలో సగం వేయించిపెట్టుకున్న ముక్కలను వేయాలి. అవసరం అనుకుంటే అరకప్పు నీటిని పోసుకోవచ్చు. గ్రేవీ చిక్కపడిన తరువాత పాలల్లో కుంకుమపువ్వు కలిపి ఉడుకుతున్న చికెన్‌కి జతచేయాలి. చివరగా క్రీం, కొత్తిమీర జతచేసుకోవాలి.

Updated Date - 2018-09-12T23:10:07+05:30 IST