మటన్‌ కీమా సమోసా రోల్స్‌

ABN , First Publish Date - 2015-09-01T18:08:06+05:30 IST

కావలసిన పదార్థాలు : మటన్‌కీమా / చికెన్‌కీమా / కూరగాయల ముక్కలు - 250 గ్రా., పసుపు - అర టీ స్పూను

మటన్‌ కీమా సమోసా రోల్స్‌

కావలసిన పదార్థాలు : మటన్‌కీమా / చికెన్‌కీమా / కూరగాయల ముక్కలు - 250 గ్రా., పసుపు - అర టీ స్పూను, కారం - పావు టీ స్పూను, పచ్చిమిర్చి (గిం జలు తీసి, సన్నగా తరిగినవి) - 3, జీరాపొడి - అర టీ స్పూను, అల్లం (దంచినది) - అంగుళం ముక్క, కొత్తిమీర (తరిగినది) - అరకప్పు, అల్లం పేస్ట్‌ - 1 టీ స్పూను, వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూను, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తడిపిండి (ముద్ద) కోసం : మైదాపిండి - 125 గ్రా., నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, పెరుగు - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు రుచికి తగినంత. రోల్‌ చేసేముందు ముద్దని అరగంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
తయారుచేసే విధానం : మటన్‌ కీమాలో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టులు కలిపి తగినంత నీరు చేర్చి మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. కడాయిలో కొత్తిమీర, పచ్చిమిర్చి, జీరాపొడి, దంచిన అల్లం వేసి వేగనిచ్చి కైమా వేసి నీరంతా ఆవిరైపోయాక దించి చల్లారనిచ్చి నిమ్మరసం పిండాలి. పిండిముద్దని సమాన భాగాలుగా చేసుకుని చపాతీల్లా వత్తుకొని మధ్యలో కొంత కీమా మిశ్రమాన్ని పెట్టి రోల్‌ చేసి అంచుల్ని ఒత్తుకోవాలి. (అంచుల్ని కత్తితో డిజైన్స్‌లా కూడా చేసుకోవచ్చు) తర్వాత ఒక్కొక్కటి నూనెలో దోరగా వేగించి టమేటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-01T18:08:06+05:30 IST