Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Thu, 01 Oct 2015 06:32:11 IST

టీడీపీ నగర అధ్యక్షుడిగా మాగంటి

టీడీపీ నగర అధ్యక్షుడిగా మాగంటి

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: టీడీపీ నగరాధ్యక్షునిగా జూబ్లీహిల్స్‌ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్‌ నియమితులయ్యారు. ఈమేరకు ఆయన నియామకాన్ని బుధవారం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతున్న మాగంటి 1986నుంచి పదేళ్లపాటు తెలుగు యువత నగరాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసి శాసనసభ్యునిగా విజయం సాధించారు. త్వరలో గ్రేటర్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను కలుపుకుని పోవాలనే ఉద్దేశంతో మాగంటికి బాధ్యతలు అప్పగించినట్టు తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు. చంద్రబాబు కమిటీలు ప్రకటిస్తున్న సమయంలో అసెంబ్లీలో ఉన్న మాగంటి తరువాత జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి బ్యాండుమేళాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. సెక్రటరీ జనరల్‌ ఎమ్మెన్‌ శ్రీనివాసరావు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు మేకల సారంగపాణి, భజ్‌రంగ్‌శర్మ, నాయకులు వనం రమేష్‌, బీఎన్‌.రెడ్డి, నైషధం సత్యనారాయణమూర్తి, నోముల ప్రకాష్‌, నల్లెల కిషోర్‌ పూలబోకెలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సరం నుంచి నగరానికి చెందిన ప్రథమ శ్రేణి నాయకుల మధ్య అంతరం పెరగడంతో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. పార్టీ అధిష్టానం కొత్త అధ్యక్షుడి నియామకం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలని చూస్తోంది. నిన్నటివరకు నగరాధ్యక్షుడిగా ఉన్న సీ.కృష్ణాయాదవ్‌ను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించారు. అధ్యక్షునిగా నియమించిన ఏడాదిలోనే పదవి నుంచి తొలగించడంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. టీడీపీలో కొనసాగాలా..? వద్దా..? అన్నది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కృష్ణాయాదవ్‌ ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.

గురుతర బాధ్యత నాపై ఉంది: మాగంటి

‘రాష్ట్ర విభజన అనంతరం కొన్ని కారణాల వల్ల నగరంలో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఇక ఆ పరిస్థితి ఉండదు. పార్టీ పట్ల విధేయతతో ఉండే ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్తా. అందర్ని సమన్వయం చేసి టీడీపీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తా. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో పదవి అప్పగించి పార్టీ పెద్దలు తనపై గురుతర బాధ్యత పెట్టారు. దానిని సక్రమంగా నిర్వర్తిస్తాను’ అని టీడీపీ నగర నూతన అధ్యక్షుడు మాగంటి గోపినాథ్‌ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలే టీడీపీ బలమని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠం తమదేనని ధీమా వ్యక్తంచేశారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.