Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 11 Apr 2015 00:50:05 IST

ప్రజా కళాకారుడు - దివికుమార్‌

ప్రజా కళాకారుడు - దివికుమార్‌

ప్రజా కళారంగంలో 70 ఏళ్ళకు పైగా నిర్విరామంగా కృషిసల్పి తన 99వ ఏట 2015, ఏప్రిల్‌ 10న కాలం చేసిన నిబద్ధ విప్లవ కళాకారుడు కానూరి వెంకటేశ్వరరావు. 1916లో కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కోడూరు గ్రామంలో జన్మించిన కానూరి, చిన్ననాటి నుంచి పాట, పద్యం నటనల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. 1933లో అంగలూరు గ్రామంలో అక్కినేని నాగేశ్వరరావు బాలకృష్ణుని పాత్రలో నటించిన ‘యశోదకృష్ణ’ పద్యనాటకంలో యశోద పాత్రధారిణి రాకుండా ఎగ్గొడితే ఆపద్ధర్మంగా కానూరి ఆ పాత్రను సవాలుగా స్వీకరించి పోషించారు. అందరి ప్రశంసలనూ పొందారు. 1940వ దశకంలో కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో ప్రజా నాట్యమండలి ప్రదర్శనలకు ఆకర్షితుడై, 1944 నుంచి తన జీవితకాలపు చివరి శ్వాసదాకా ప్రజా కళారంగంలోనే కొనసాగిన అనితరసాధ్యమైన అంకితభావం కానూరిది. 1974లో ఆవిర్భవించిన ‘అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య’లో మొదటి నుంచి చివరిదాకా నిర్మాణ బాధ్యతలలో వుంటూ వచ్చారు.
కొద్ది నెలల క్రితం, ఆయనతో పూర్తిగా ఒకరోజంతా గడపాలనే ఉద్దేశ్యంతో ఖమ్మంలో ఆయన వుండే ‘న్యూ డెమోక్రసీ’ వారి కార్యాలయానికి వెళ్ళి, పూర్తి రోజంతా ఆయనతో మాట్లాడుతూ, మాట్లాడిస్తూ గడిపినపుడు కూడా, తనకు ముగ్గురు పిల్లలను అప్పజెపితే వారికి బుర్రకథ రగడలను నేర్పి కన్నుమూస్తానని కానూరి కోరిన విషయం మరువలేనిది.
ప్రజానాట్యమండలి బుర్రకథ దళంలో లక్ష్మీపెరుమాళ్ళుతో (తర్వాత సినిమా నటుడు) కలిసి కానూరి ఎన్నో ప్రదర్శనలిచ్చారు. సుంకర రచనలు ‘కష్టజీవి’, ‘వీరేశలింగం’, ‘రుద్రమదేవి’లను ప్రదర్శిస్తూ కృష్ణాజిల్లా బుర్రకథ దళంగా ఎదిగారు. బుర్రకథలో హాస్యం చెప్పటంలో ఆయన సమయస్ఫూర్తి చెప్పుకోదగినది. పాలకవర్గ దోపిడీ శక్తులను, వారి రాజకీయాలను హాస్య స్ఫోరకంగా ఎండగట్టడంలో ఆయనది అందెవేసిన చేయి. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఉధృత దశనూ, నిర్బంధకాలపు క్రూర అణచివేతలను కానూరి అనుభవించారు. కళారంగ కార్యకలాపాలకు బహిరంగఅవకాశాలు లేని కాలంలో రహస్య సమాచారాలందజేసే కొరియర్‌గా ఉన్నారు.
1955 ఉప ఎన్నికలలో ఆంధ్రాలో కమ్యూనిస్టు పార్టీ ఘోరంగా పరాజయంపాలైన పిదప కార్యకర్తలు బతుకు తెరువును వెతుక్కోవాల్సిన పరిస్థితులలో 1956లో వరంగల్‌ జిల్లా ఘనపూర్‌ ప్రాంతానికి గుడివాడ ప్రాంతం నుంచి చాలామందితో పాటు కానూరి కూడా వలస వచ్చారు. కష్టపడి వ్యవసాయం చేశారు. మాగాణీ ప్రాంతపు వరిసాగు మెలుకువలతో మంచి పంటలు తీశారు. తిరిగి కమ్యూనిస్టు ఉద్యమ కార్యకలాపాలతో సంబంధాలేర్పరుచుకుని, నక్సల్‌బరీ - శ్రీకాకుళ ఉద్యమాల అనంతరం నుంచి నేటిదాకా కమ్యూనిస్టు విప్లవకారుల బృందాలతో కలసి పనిచేశారు.
కానూరి భాగవతాలు, బుర్రకథలు (అమరులు చాగంటి భాస్కరరావు, జంపాల చంద్రశేఖర ప్రసాద్‌, మహాకవి గురజాడ మొదలైనవి), నృత్యరూపకాలు, పాటలు అనేకం రచించారు. ఆయన రచించిన ‘వీరగాధలు పాడరా... విప్లవ ధీర చరితల పాడరా...’ అనే పాట నక్సల్‌బరీ నాటి నవయుగ శివలీలల్ని రాష్ట్రమంతా ప్రతిధ్వనించింది. వీరు ఎందరో ప్రజా కళాకారులకు శిక్షణ ఇచ్చారు. కళారంగపు మెలకువలు నేర్పారు. రాష్ట్రంలో ప్రఖ్యాత గాయకులుగా గుర్తింపు పొందిన అరుణోదయ రామారావు, విమలక్కలు ఆయన శిక్షణలో ఉత్తమ కళాకారులుగా రూపుదిద్దుకున్నవారే.
నేను 1972లో గుంటూరు విరసం సభల నాటి నుంచీ ఆయన పేరు వినివున్నప్పటికీ, 1990లో గుంటూరు జిల్లా కాజ గ్రామంలో ఒక వీధి భాగవత నృత్యరూపకాన్ని ప్రదర్శింపజేయటానికి మేము కలిసి పనిచేశాము. ఆయన ‘జంతర్‌ మంతర్‌ మామూళ్ళు’ అనే ‘భాగోతాన్ని’ రచిస్తే, దానికి నేను నృత్య దర్శకునిగా, అరుణోదయ రామారావు సంగీత దర్శకత్వంలో పది రోజులపాటు కలిసి శిక్షణా శిబిరాన్ని నిర్వహించాము. మేము వేరు వేరు సంస్థలలో బాధ్యులమే అయినా నాటి నుంచి నేటిదాకా అనుబంధమూ, ఆత్మీయతలకు కొరవ లేకుండా కానూరి అంటే ఎనలేని గౌరవంతో నేను, నేనంటే అభిమానంతో ఆయన వుంటూ వచ్చాము.
2012 జూలైలో ‘ప్రజాసాహితి’ స్వంత కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఖమ్మం నుంచి కానూరి బెజవాడ వచ్చి తన ఆత్మీయ సందేశాన్ని అందించి వెళ్ళటం మరువలేనిది. ఆయన రచనలలో షహీద్‌ భగత్‌సింగ్‌, ఝాన్సీ లక్ష్మీబాయి బుర్రకథలు ఇంకా అముద్రితంగా వున్నాయి. ప్రజా కళలపట్ల ఆయనకు గల అంకితభావాన్నీ విప్లవోద్యమ నిబద్ధతనూ క్రమశిక్షణనూ నేటి తరాలు అందిపుచ్చుకోవాల్సిన ఉత్తమ విలువలు. వారి ఆశయాన్ని సాధించే దిశగా కృషి సాగించటమే ఆయనకు నిజమైన నివాళి...
దివికుమార్‌
జనసాహితి ప్రధాన కార్యదర్శి

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.