Dec 24 2019 @ 00:22AM

తెలుగుకు టెక్‌ వెలుగులు

  • తెలుగే కోరుకుంటున్న92% మంది నెటిజన్లు
  • భారతీయ భాషలపై నెట్‌ దిగ్గజాల ప్రత్యేక దృష్టి
  • బెంగళూరులో ‘గూగుల్‌ ఏఐ’ కేంద్రం ఏర్పాటు
  • తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లకూ సహకారం

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘తెలుగు చదివితే భవిష్యత్తు లేదు..’ అనే అభిప్రాయం సర్వత్రా వ్యాపిస్తుండగా.. ఆన్‌లైన్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇంటర్‌నెట్‌ వినియోగించే తెలుగువారంతా.. తమకు తెలుగులోనే సమాచారం కావాలని కోరుకుంటున్నారు. మాతృభాషలో టైపింగ్‌ కోసం తెలుగు కీబోర్డులను వినియోగిస్తున్నారు. గూగుల్‌ సేవలను అమ్మ భాషలోనే పొందుతున్నారు.. వికీపీడియా సమాచారం మాతృభాషలోనే చదవడానికి ఇష్టపడుతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్న తెలుగువారిలో 92 శాతం మందిది ఇదే ఆకాంక్ష అని గూగుల్‌ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీంతో ఇంటర్‌నెట్‌ దిగ్గజ సంస్థలు తెలుగుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్‌ ఇప్పటికే ముందుండగా.. వికీపీడియా, ఇతర సంస్థలూ ఇదే బాటలో పయనిస్తున్నాయి. తెలుగువారికి దగ్గరవ్వాలంటే తెలుగుకు దగ్గరవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఈ పరిణామాలు ఇంటర్‌నెట్‌లో తెలుగుకు మరింత వెలుగు ఇస్తున్నాయి.
 
గూగుల్‌ అధ్యయన ఫలితాలు..
2016 చివరి నాటికి 4 కోట్ల మంది తెలుగువారు ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నట్టు గూగుల్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2019 నాటికి ఈ సంఖ్య 7 కోట్లకు చేరింది. మాతృభాషల వినియోగంపై తాజాగా గూగుల్‌ మరో సర్వే చేయగా సగటున ప్రతి 10 మంది భారతీయ వినియోగదారుల్లో 9 మంది గూగుల్‌లో తమ తమ భాషల్లోని సమాచారం కోసమే వెతుకుతున్నారని వెల్లడైంది. భారతీయ భాషలు వాడేవారిలో 88 శాతం మంది తమ భాషల పట్ల ఆసక్తి చూపిస్తుండగా.. తెలుగులో ఈ సంఖ్య మరింత అధికంగా ఉందని తేలింది. ఇతర భాషల్లో ఇది 88శాతం ఉండగా, తెలుగులో 92 శాతం మంది ఉండటం గమనార్హం. ఈ ఫలితాల నేపథ్యంలో గూగుల్‌ తెలుగు వారికి మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
 
గూగుల్‌-నవలేఖ..
మనదేశంలో చాలా ప్రాంతీయ పత్రికలు ఇప్పటికీ చిత్రాలు (ఇమేజెస్‌), పీడీఎ్‌ఫల రూపంలోనే కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ప్రచురిస్తున్నాయి. ఆ సమాచారం యూనీకోడ్‌ అక్షరాల్లో లేకపోవడంవల్ల గూగుల్‌ సెర్చ్‌లో కనిపించవు. కొత్తగా ఆ పనిచేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటివారి కోసమే గూగుల్‌ సంస్థ ‘ప్రాజెక్ట్‌ నవ్‌లేఖ’ను అందుబాటులోకి తెచ్చింది. ప్రాజెక్టులో నమోదు చేసుకుంటే చాలు... ఏ భాషలో ఉన్న పీడీఎ్‌ఫ/ఇమేజె్‌సలోని విశేషాలనైనా కొన్ని నిమిషాల వ్యవధిలో యూనీకోడ్‌లోకి మార్చేస్తుంది.
 
వికీపీడియా కొత్త నిర్ణయాలు
తెలుగు వికీపీడియా ప్రారంభించి డిసెంబరు 22 నాటికి 16 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తెలుగు వికీపీడియన్లు ఆదివారం గచ్చిబౌలిలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో తెలుగు వికీపీడియాలో అభివృద్ధి చేయాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 20 వేలకు పైగా గ్రామాల సమాచారం ప్రస్తుతం తెలుగులోనే అందుబాటులో ఉంది. వాటికి సంబంధించి మరింత సమాచారం జతచేయాలని నిర్ణయించారు.
 
వెబ్‌ సైట్లు తెలుగులోనే..
తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో నెట్‌ వినియోగాన్ని పెంచేందుకు గూగుల్‌ ఇటీవలే బెంగళూరులో కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందులో కృత్రిమ మేధస్సును తెలుగు సహా భారతీయ భాషల్లో మెరుగుపరచనుంది. గూగుల్‌ అసిస్టెంట్‌ సేవలు ప్రాంతీయ భాషల్లో మరింత స్పష్టంగా ఉండేలా ఈ కేంద్రం పరిశోధనలు చేస్తోంది. అలాగే ప్రభుత్వపరంగా తెలుగు వినియోగంపై సహకారం అందిస్తోంది.