Dec 19 2019 @ 23:37PM

మహేశ్‌కు 54... ప్రభాస్‌కు 44

ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో టాప్‌-100 సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసింది. ఆదాయ అర్జన మాత్రమే కాకుండా ప్రింట్‌, సోషల్‌మీడియాలో సెలబ్రిటీలకు వచ్చిన ఆదరణను బట్టి ఈ స్థానాలను కేటాయించినట్లు ఫోర్బ్స్‌ ఇండియా పేర్కొంది. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకొన్న ప్రభాస్‌ తొలిసారి ఫోర్భ్స్‌ జాబితాలో స్థానం సాధించారు.ఈ జాబితాలో ప్రభాస్‌(రూ.35కోట్లు) 44వ స్థానంలో నిలిచారు. గత ఏడాది 33వ స్థానంలో ఉన్న మహేశ్‌బాబు(రూ.35కోట్లు) ఈ ఏడాది 54వ స్థానంలో ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌(రూ.21.5కోట్లు) 77వ స్థానంలో నిలిచారు.
 
ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (రూ.252.72కోట్లు) మొదటి స్థానంలో నిలవగా, 293.25 కోట్లతో అక్షయ్‌కుమార్‌ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. గడచిన ఏడాది మొదటి స్థానంలో ఉన్న సల్మాన్‌ ఖాన్‌(రూ.229.5కోట్లు) ఈ సారి మూడో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో అమితాబ్‌(రూ.239.2కోట్లు) ఉండగా, మహేంద్ర సింగ్‌ ధోని (రూ.135.93కోట్లు), షారుఖ్‌ఖాన్‌ (రూ.124.38కోట్లు), రణవీర్‌ సింగ్‌(రూ.118.2కోట్లు), అలియా భట్‌ (రూ.59.21కోట్లు), సచిన్‌ (రూ.76.96కోట్లు), దీపిక పడుకోన్‌ (రూ.48కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అజయ్‌దేవగణ్‌(12), రజనీకాంత్‌(13), ప్రియాంక చోప్రా(14), ఆమీర్‌ఖాన్‌ (15), ఏఆర్‌ రెహమాన్‌(16), హృతిక్‌ రోషన్‌ (18), అమిత్‌ త్రివేది (19), విశాల్‌ శేఖర్‌ (20) టాప్‌ ట్వంటీలో ఉన్నారు.