Apr 3 2015 @ 18:51PM

కడపకురావాలంటేపారిశ్రామికవేత్తలుభయపడుతున్నారు
2020 నాటికి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
శాంతిభద్రతవిషయంలో రాజీపడేది లేదు :చంద్రబాబు

చిత్తూరు, ఏప్రిల్‌ 3 : 2020 నాటికి రాష్ట్రంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వర్గంలో ఉండే సుఖ సంతోషాలు రాజధాని అమరావతిలో ఉండాలనేదే తన కోరిక అని ఆయన అన్నారు. భూమి విషయంలో అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ల్యాండ్‌ లేకపోతే ఇండసీ్ట్ర రాదని అందుకే పరిశ్రమల కోసం రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలతో ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీసిటీలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమని అన్నారు. శాంతిభద్రతలు అదుపులో లేకపోతే పరిశ్రమలు రావని, అందుకు కడప జిల్లాయే ఉదాహరణ అని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైందని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా భారత్‌ ఎదుగుతోందని,. మానవవనరులూ అందుబాటులో ఉన్నాయని, ఏపీలో పరిశ్రమలు పెట్టేవారికి 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తామని బాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కొరతలేదన్నారు. ఏపీని లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. జూన్‌ నాటికి అన్ని ప్రాంతాలకు 4జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

అంతకుముందు చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ సెజ్‌లో 11 పారిశ్రామిక యూనిట్లకు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. పెప్సికో కంపెనీని ఆయన ప్రారంభించారు. నెథర్లాండ్‌ కంపెనీ హంటర్‌ రూ. 250 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. రెండు చైనా కంపెనీలు రూ. 140 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే అమెరికా ఫార్మా కంపెనీ రూ. 150 కోట్లతో యూనిటట్‌ ఏర్పాటు చేస్తోంది. జపాన్‌ నెం.1 ఎలక్ర్టానిక్‌ కంపెనీ రూ. 100 కోట్లతో సీసీటీవీల యూనిట్‌ పెడుతోంది. భారత దేశానికి చెందిన రెండు కంపెనీలు రూ. 150 కోట్లతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పెప్సి కో ఛైర్‌ పర్సన్‌ ఇంద్రనూయి పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.