Nov 29 2019 @ 14:32PM

‘అర్జున్ సురవరం’ మూవీ రివ్యూ

నిఖిల్ హీరోగా న‌టించిన చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. త‌మిళ చిత్రం `క‌ణిద‌న్‌`కి ఇది రీమేక్‌. ఈ సినిమా మేకింగ్‌లో కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. ముందు ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ.. ఈ టైటిల్ త‌మ‌దంటూ వేరే నిర్మాత చెప్ప‌డంతో చివ‌ర‌కు టైటిల్ కూడా మార్చారు. అలాగే విడుద‌ల స‌మ‌యంలో కూడా కొన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. ఈ ఏడాది మే నెల‌లో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కార‌ణాలతో వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుక వ‌చ్చింది. నిఖిల్‌కి మంచి హిట్ అవ‌స‌రం అయిన త‌రుణంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అర్జున్ సుర‌వరం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం.
 
బ్యాన‌ర్‌: మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి
న‌టీన‌టులు: నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టి.సంతోష్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల‌
సంగీతం: సామ్ సి.ఎస్‌
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య‌
ఎడిట‌ర్: న‌వీన్ నూలి
 
కథ:
అర్జున్ లెనిన్ సురవరం(నిఖిల్).. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అంతగా ప్రాచుర్యంలేని ఒక చిన్న చానెల్‌లో పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా బీబీసీలో జాబ్ సంపాదించాలన్నిది అతడి కల. ఒకరోజు ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కోసం పబ్‌కు వెళతాడు. అక్కడ జరిగిన అనుకోని ఒక సంఘటనతో కావ్య(లావణ్య త్రిపాఠి) అనే జర్నలిస్ట్ పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఒక రోజు బీబీసీ నుంచి అర్జున్‌కు ఫోన్ వస్తుంది. సెలెక్షన్ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక సర్టిఫికెట్లు సబ్మిట్ చేసే సమయానికి అర్జున్‌కు ఊహించని షాక్ తగులుతుంది. జనాలకు నిజం చెప్పడమే పనిగా ఎంచుకున్న అర్జున్ జీవితమే ఒక అబద్ధం అయిపోతుంది. అతడి చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ ఫేక్ అని, ఆ సర్టిఫికెట్లతో బ్యాంకులోను తీసుకుని మోసం చేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. షాక్ నుంచి తేరుకున్న అర్జున్ తాను అబద్ధం కాదు.. నిజం అని నిరూపించుకోవడానికి ఏం చేశాడు? అసలు బ్యాంకులను మోసం చేసింది ఎవరు? ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించింది ఎవరు? ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది.. నిజంగా చదివి పాసైన వారి జీవితాలతో ఆడుకుంది ఎవరు? ఇలా అనేక రకాల ట్విస్టులకు స్పష్టమైన సమాధానాలు కావాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ:
నకిలీ ధ్రువపత్రాల కుంభకోణం కేసు ఆధారంగా సినిమా మొత్తం నడుస్తుంది. కథ ప్రారంభంలోనే హీరో అరెస్ట్ అయ్యే సన్నివేశంతో ఆసక్తి రేకెత్తించాడు దర్శకుడు. హీరోహీరోయిన్ ప్రేమ సన్నివేశాలతో కొంత బోర్ కొట్టించినా.. వెన్నెల కిషోర్, సత్య పాత్రలతో కామెడీ ట్రాక్ నడిపించడంతో ఫర్వాలేదనిపించాడు. బీబీసీ నుంచి ఫోన్ రావడం, అక్కడ ఇచ్చిన ఒక కేసును అర్జున్ పరిష్కరించే సీన్ ఫస్ట్‌హాఫ్‌కు హైలెట్‌గా ఉంటుంది. అర్జున్‌కు బీబీసీ నుంచి ఫోన్ రావడం.. ఆ తర్వాత నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి బ్యాంకులను మోసం చేశాడని అరెస్ట్ అవడం, అతనితో పాటు మరో నలుగురు కుర్రాళ్లను పోలీసులు లాక్కెడంతో కథ మలుపు తిరుగుతుంది. చేయని తప్పుకు నిందపడడంతో అవమానాన్ని తట్టకోలేక కార్తీక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఈ స్కామ్‌కు సంబంధించిన డాట్ కన్సల్టెన్సీని పట్టుకోవడం, అక్కడి నుంచి అర్జున్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం, సూత్రధారులను పట్టుకోవడానికి వెన్నెల కిషోర్‌ను ఎరగా వేయడం, భారీ యాక్షన్ సీన్‌తో సాగే ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది. నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌ వెనకున్న దురా సర్కార్(తరుణ్ అరోరా ) కొడుకును అర్జున్ చంపడంతో అతనితో కోసం వెతకడం మొదలుపెట్టడం, అదే సమయంలో ఈ స్కామ్ వెనకున్న వ్యక్తి కోసం అర్జున్ ప్రయత్నించే సన్నివేశాలతో ద్వితీయార్థం కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
 
నటీనటుల విశ్లేషణ:
యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అయితే ఈ సారి జర్నలిజం నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నాడు. అర్జున్ లెనిన్ సురవరం పాత్రలో చక్కగా నటించాడు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా నిఖిల్ ఫర్వాలేదనిపించాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. టైటిల్ పాత్ర పోషిస్తుండడంతో చిత్రం భారం మొత్తం తనపై వేసుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. కావ్యగా నటించిన లావణ్య త్రిపాఠి లుక్స్ పరంగానే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లోనూ బాగానే నటించింది. గ్యాప్ తరువాత వచ్చిన ఈ హీరో హీరోయిన్లకు ఈ చిత్రం కలిసి వచ్చేలానే ఉంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ నవ్వించడమే కాదు.. ఎమోషనల్ సీన్‌లో ఏడ్పించేశాడు. వెన్నెల కిషోర్, విద్యుల్లేఖరామన్ మధ్య కామెడీ సీన్స్ బాగా పండాయి. కెమెరామెన్ రాంబాబు పాత్రలో సత్య ఎప్పటిలానే నవ్వించేశాడు. నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో సుబ్బారావ్‌గా పోసాని కూడా చక్కని నటన కనబర్చాడు. విలన్ పాత్రల్లో నటించిన తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ఆ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. తండ్రి పాత్రలో నాగినీడు, తల్లి పాత్రలో ప్రగతి తమ పరిధి మేరకు నటించారు.
 
సాంకేతిక విశ్లేషణ:
తమిళంలో హిట్ అయిన సినిమా కథలు తెలుగులో చాలా వరకు రీమేక్ అయ్యాయి. అలా అయిన వాటిలో సగమే మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అర్జున్ సురవరం దర్శకుడు సంతోష్ కూడా తమిళంలో హిట్ అయిన కణిథన్ మూవీ కథను తీసుకుని తెలుగులో అర్జున్ సురవరంగా రీమేక్ చేశాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో చాలానే మార్పుచేర్పులు చేశాడు కానీ తమిళంలో ఉన్న ఫీల్ ఇక్కడ మిస్ అయ్యిందనే చెప్పాలి. క్లయిమాక్స్ మరింత ఆసక్తికరంగా రాసుకుని ఉండుంటే సినిమా రేంజ్ ఇంకోలా ఉండేది. ఇక శ్యామ్ సీ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. పాటలు సందర్భానికి తగ్గట్టు లేవు. ఆసక్తికరంగా సాగుతున్న కథలో ఇరికించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నాయి.
 
ప్లస్ పాయింట్స్
నిఖిల్ నటన
కథ
కొన్ని ఆసక్తికర సన్నివేశాలు
నేపథ్య సంగీతం
 
మైనస్ పాయింట్స్
పాటలు
క్లయిమాక్స్ ఆస్తికరంగా లేకపోవడం
 
చివరిగా...
ఎన్నో వాయిదాల తర్వాత వచ్చిన అర్జున్ సురవరం.. ప్రేక్షకులను డిస్సపాయింట్ అయితే చేయడు. రామ్‌గోపాల్ వర్మ సినిమా వాయిదా పడడం కూడా నిఖిల్‌కు కలిసొచ్చింది.
రేటింగ్: 3/5