
- ఠాక్రే కుటుంబం నుంచి తొలి సీఎం..
- జంటిల్మన్ పొలిటీషియన్‌గా పేరు
ముంబై, నవంబరు 26: శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అవుతున్న తొలి వ్యక్తిగా ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చరిత్రకెక్కనున్నారు. నిజానికి బాల్ ఠాక్రే గానీ, ఆయన తమ్ముడి కొడుకు రాజ్ ఠాక్రే (ఉద్ధవ్‌కు ముందు పార్టీ యువజన నేత) గానీ ఏ ఎన్నికల్లోనూ పోటీచేయలేదు. శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు శివసేన నేతలైన మనోహర్ జోషీ, నారాయణ్ రాణే సీఎంలయ్యారు. ఇప్పటివరకూ ఉద్ధవ్ కూడా ఎన్నికల్లో పోటీచేయలేదు. ఆయన కుమారుడు, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నుంచి పోటీచేసి గెలిచి.. ఠాక్రే కుటుంబం నుంచి చట్టసభలో అడుగుపెట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు సీఎం కాబోతున్న ఉద్ధవ్ ఆరు నెలల్లో అసెంబ్లీకి గానీ, శాసనమండలికి గానీ ఎన్నిక కావలసి ఉంది. తండ్రి కోసం వర్లి స్థానాన్ని వదులుకునేందుకు ఆదిత్య సిద్ధంగా ఉన్నారు. మహారాష్ట్ర అధికార పీఠం ఉద్ధవ్ ఠాక్రే (59)కు రాత్రికి రాత్రి సంక్రమించినది కాదు. దాదాపు మూడున్నర దశాబ్దాల తెరవెనుక కృషి ఫలితమిది. తండ్రి బాల్ ఠాక్రే మాదిరిగా ఆయన దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి కాదు. తండ్రికున్న కరి ష్మా లేదు. నెత్తురు మండించే ధారాళమైన వక్త కూడా కాదు. మృదు స్వభావి. మితభాషి. మౌనంగానే పనులు చక్కపెట్టే నేర్పరి. హింసాత్మక అతివాద హిందూత్వ పార్టీగా ఉన్న శివసేనను వ్యవస్థాగత రాజకీయ పార్టీగా, కొంత మితవాదంగా మార్చిన ఘనత ఉద్ధవ్‌దే! అసలు బాల్ ఠాక్రేకు ఈయన రాజకీయ వారసుడు కాదని అంతా చాలా ఏళ్ల పా టు భావించారు. ముమ్మూర్తులా పోలి ఉన్న రాజ్ ఠాక్రేయే తదుపరి నేత అని అనుకున్నారు. కానీ ఉద్ధవ్ చాపకింద నీరులా విస్తరించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా రాజ్ ఠాక్రేకు ఉన్న దూకుడు, జగడాల మారితనం, వివిధ వర్గాల వారితో విరోఽధం... మొదలైన వాటిని తన ఎదుగుదలలో వాడుకున్నారు ఉద్ధవ్! 1985 బృహన్ముంబై ఎన్నికల్లో శివసేన విజయంలో కీలక పాత్ర పోషించారు. 1990-2005 మధ్య రాజకీయంగా తన ఎదుగుదలకు అడ్డంకిగా నిలిచిన రాజ్ ఠాక్రే, నారాయణ్ రాణేలను వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. 2002లో బీఎంసీ ఎన్నికల్లో ఒంటి చేత్తో శివసేన విజయఢంకా మోగించేట్లు చేయగలిగారు. దాంతో 2003లో బాల్ ఠాక్రే ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. 2004లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టారు. 2014 ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ నేతృత్వంలో స్వతంత్రంగా పోటీచేసింది. 63 స్థానాల్లో నెగ్గి- బీజేపీ అనివార్యంగా తన మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించింది.
ప్రత్యేకతలు
ముద్దుపేరు: డింగా
చదువు: జేజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ ఆర్డ్లో గ్రాడ్యుయేషన్
- తండ్రి మాదిరిగానే కార్టూనిస్టు
- వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా పేరు- ప్రతీ ఏటా ముంబైలో ప్రదర్శన
- 1986లో స్నేహితులతో కలిసి యాడ్ ఏజెన్సీ ఏర్పాటు
- 1989లో రాజకీయ పత్రిక సామ్నా ప్రారంభంలో కీలక భూమిక
- రాజకీయ మెళకువలు
తెలిసిన రశ్మితో వివాహం..
కుమారులు: ఆదిత్య (ప్రస్తుతం ఎమ్మెల్యే), తేజాస్