Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 16 Nov 2019 17:59:15 IST

తెలుగు వికీపీడియా అభివృద్ధికి సంఘటిత కృషి జరగాలి

తెలుగు వికీపీడియా అభివృద్ధికి సంఘటిత కృషి జరగాలి

హైదరాబాద్‌: వికీపీడియాలో తెలుగు సమాచారాన్ని పెంచేలా కృషి చేసేందుకు సముదాయాల ఏర్పాటు ద్వారా సంఘటిత కృషి జరగాలని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడ్డారు. నగరంలోని ఐఐఐటిలో జరిగిన ‘ వికీపీడియాసమాచార లభ్యత, సముదాయ అభివృద్ధి’ అన్న అంశంపై వివిధ రంగాల ప్రముఖులతో చర్చాగోష్టి జరిగింది. ఈ చర్చలో సముదాయ అభివృద్ధి, సమాచార లభ్యత, శిక్షణ, అవగాహన, సాంకేతికత, పరిశోధన అనే ఐదు విభాగాల కింద ఈ ప్రయత్నం జరగాలని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. నాణ్యమైన, విశ్వసనీయమైన సమాచారం కోసం ప్రజలు వికీపీడియాపై ఆధారపడతారని, అందుకే ప్రతి సెకనుకు సుమారు 8వేల మంది వికీపీడియాను సందర్శిస్తారని చర్చాగోష్టిని ప్రారంభించిన ఐఐఐటి ప్రొఫెసర్‌ వాసుదేవ వర్మఅన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 25 భాషల్లో ఎనిమిది భారతీయ భాషలున్నప్పటికీ, వికీపీడియాలో ఇంగ్లీష్‌ భాషతో పోలీస్తే కేవలం 0.5 నుంచి 2శాతంలోపే సమాచారం ఆయా భాషల్లో ఉందని ఆయన తెలిపారు. వికీపీడియాలో తెలుగు సమాచార పెంపుకోసం స్వీడన్‌ వికీపీడియా తరహా సమిష్టికృషి జరగాలని ఆయన సూచించారు.
 
తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి అనేక రంగాలకు చెందిన సమాచారం అందుబాటులో ఉందని, రాష్ట్ర అవతరణ తర్వాత భాషా, సాంస్కృతిక శాఖ అనేక పుస్తకాలను ప్రచురించింది. వాటిని వికీపీడియాలో పొందుపర్చేందుకు అనుమతిచ్చామని సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ వెల్లడించారు. వికీపీడియాలో తెలుగు సమాచారాన్ని పొందుపరిచే ప్రయత్నంలో భాష, సాంస్కృతికశాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని అన్నారు.
 
డిజిటల్‌మీడియా వేదికలలో తెలుగు వాడుకను పెంచేందుకు తెలంగాణ ఐటీశాఖ కృషి చేస్తుందని, అందులో భాగంగానే ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా డిజిటల్‌ తెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని డిజిటల్‌ మీడియా విభాగం సంచాలకులు దిలీప్‌ కొణతం పేర్కొన్నారు. చాలా మంది వ్యక్తులు, సముదాయాలు ఇప్పటి వరకూ చేసిన కృషిని వివరిస్తూ ఇకపై రెట్టించిన ఉత్సాహంతో తెలుగు వికీపీడియా అభివృద్ధికి సంఘటితంగా పనిచేయాలని ఆయన అన్నారు.
 
భవిష్యత్‌ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా తెలుగు వికీపీడియా, ఇతరసహ ప్రాజెక్టులు అభివృద్ధి చేసుకోవల్సిన అవసరం ఉందని వికీపీడియా ఔత్సాహికులు వీవెన్‌ అభిప్రాయపడ్డారు. రాశిపైనే కాకుండా వాసిపై కూడా దృష్టిసారించాలని,వికీపీడియా నియమాలను అనుసరిస్తూ సమాచారాన్ని పొందుపర్చాలని దీనిపై అవగాహన పెంపొందించేందుకు శిక్షణా సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వికీపీడియా నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో ఐటీశాఖ సహాయ సంచాలకులు మాధవ్‌ ముడుంబై, రాధికామామిడి, కృపాల్‌కశ్యప్‌ తదిరతులు పాల్గొన్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.