Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 10 Nov 2019 01:36:02 IST

తెలంగాణ యాసే నా విజిటింగ్‌ కార్డ్‌

తెలంగాణ యాసే నా విజిటింగ్‌ కార్డ్‌

‘అల... వైకుంఠపురములో’ చిత్రంలో ‘రాములో రాములా...’ లేటెస్ట్‌ చార్ట్‌బస్టర్‌! ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ‘దిమాక్‌ ఖరాబ్‌’, ‘రాయే రాయే’ పాటలూ మారుమోగాయి! ఇవీ, అంతకు ముందు ఎన్నో హిట్‌ పాటలు రాసింది కాసర్ల శ్యామ్‌! తెలంగాణ మాండలికంలో జానపద గీతాలతో సినీప్రియులను ఆకట్టుకుంటున్న ఈ యువ గేయ రచయిత, ‘నవ్య’తో తన ప్రయాణాన్ని పంచుకున్నారిలా!!
 
మాది కాకతీయుల ఖిల్లా వరంగల్‌లోని హన్మకొండ. నాన్నగారు మధుసూదన్‌రావు రంగస్థల నటులు. అప్పట్లో ‘మంచికి స్థానం లేదు’, ‘చలి చీమలు’, ‘రోజులు మారాయి’, ‘నిప్పులాంటి మనిషి’, హిందీలో ‘రుస్తుం’, ‘వస్తాద్‌’ చిత్రాల్లో నటించారు. గాంధీగారు వరంగల్‌కు వచ్చినప్పుడు వేదికపై మా తాతయ్య జానపద గేయాన్ని పాడారని మా నానమ్మ చెబుతుంటుంది. కళలు, సినిమాపై మక్కువ ఉన్న కుటుంబంలో జన్మించడం వల్ల చిన్నతనం నుంచి సాహిత్యాభిలాష ఎక్కువే. స్కూల్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాణ్ణి. నన్ను చూసి, వరంగల్‌లో జానపదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ‘వరంగల్‌ శంకర్‌’, సారంగపాణి తమ బృందంలో నన్ను చేర్చుకున్నారు. తొలుత జానపద నృత్యకళాకారుడిగా మొదలైన నా ప్రయాణం, జానపద గేయ రచయితగా, గాయకుడిగా మలుపులు తీసుకుంది. నేను రాసిన, పాడిన పాటల్లో చాలా వరకు ఆడియో క్యాసెట్ల రూపంలో వచ్చాయి. డిస్కో రికార్డింగ్‌ కంపెనీకి 2000 నుంచి ప్రతి ఏడాది ఒక క్యాసెట్‌ రాస్తున్నాను. బోనాల పండుగకు దాన్ని విడుదల చేస్తారు.
 
పాట రాయించుకొని పేరు వేయలేదు!
నేను హన్మకొండలో పొలిటికల్‌ సైన్స్‌లో ఎంఏ చేశా. చదువు పూర్తికాక ముందే... ‘సిందూరం’ టైమ్‌లో కృష్ణవంశీగారి దగ్గర అసిస్టెంట్‌గా పెట్టమని రచయిత చంద్రబోస్‌ అన్నను కలిశా. ‘నువ్వు ముందు చదువుకో. తర్వాత రా! నేను ఒక్కడినే కాదు... నేనూ ఒకడిని అనుకుని రా’ అన్నాడు. ఎంఏ పూర్తి చేశాక.... రవితేజ ‘మనసిచ్చాను’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రయత్నించా. అవకాశం రాలేదు. పాటలు బాగా రాస్తానని తెలిసి, నాతో ఓ పాట రాయించుకొని నా పేరు వేయలేదు. ‘ఫైనాన్షియర్‌కు పాటలంటే ఇంట్రెస్ట్‌’ అని ఆయన పేరు వేశారు. ‘హైదరాబాద్‌ నాకు పనికి రాదు’ అని వరంగల్‌ వెళ్లిపోయా. నన్ను నేను కూడదీసుకుని మళ్లీ వద్దామనుకున్న సమయంలో యాక్సిడెంట్‌ అయింది. ఆర్నెల్లు ఇంట్లో ఉన్నాను. అదృష్టం కొద్దీ తెలుగు యూనివర్సిటీ ఎంఏ ఎంట్రెన్స్‌లో ఫస్ట్‌ వచ్చా. మళ్లీ హైదరాబాద్‌ వచ్చి ఫోక్‌ ఆర్ట్స్‌లో ఎంఏ, ఎంఫిల్‌ చేశా. చదువుతున్న సమయంలోనే పాటలు రాశా. ఎఫ్‌ఎమ్‌లో అనౌన్సర్‌గానూ చేశా.
 
పేరు పడిన తొలి సినిమా ‘చంటిగాడు’
దర్శకురాలు బి. జయ ‘చంటిగాడు’లో శంకర్‌ మహదేవన్‌ పాడిన ‘కోకోకోకొక్కోరొక్కో’ పాట నేనే రాశా. గీత రచయితగా నా పేరు పడిన తొలి చిత్రమది. తర్వాత ఏడేళ్లలో ఏడు చిత్రాలకు మాత్రమే పని చేశా. ఓ పక్క ఎంఫిల్‌... మరోపక్క పాటలు... బ్యాలెన్స్‌ చేసుకోవడం కష్టమైంది. అయితే... తిండి కోసం ఎప్పుడూ కష్టపడలేదు. జానపద గాయకుణ్ణి కాబట్టి స్టేజి షోలు చేసేవాణ్ణి. పెళ్లిళ్లకు, ఆఖరికి చావులకు ప్రోగ్రామ్స్‌ చేసిన రోజులున్నాయి. కృష్ణవంశీ ‘మహాత్మ’లో ‘నీలపురి గాజులు...’ పాటతో తొలి బ్రేక్‌ వచ్చింది. కానీ, పెద్దగా అవకాశాలు రాలేదు. మారుతి ‘ఈ రోజుల్లో’ని ‘రింగ్‌ ట్రింగ్‌’ పాటతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ ఒక్క పాట నాకు 40 పాటలు తీసుకొచ్చింది. గ్యాప్‌ లేకుండా పాటలు రాశాను. ఇప్పటికి 150కు పైగా చిత్రాల్లో 300కు పైగా పాటలు రాశా.
 
తెలంగాణ మాండలికాన్ని అడ్డం పెట్టుకుని బతకడం లేదు!
తెలంగాణ జానపద గీతాలకు కాసర్ల శ్యామ్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అంటుంటే సంతోషంగా ఉంటుంది. అదే సమయంలో చిన్నపాటి బాధ కూడా ఉంటుంది. నేను అన్ని పాటలూ రాయగలుగుతాను. ‘బస్‌ స్టాప్‌’లో ‘కలలకే కనులొచ్చిన క్షణమిది’, ‘ప్రేమకథా చిత్రమ్‌’లో ‘కొత్తగున్న హాయి నువ్వా’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రె్‌స’లో ‘మెలమెల్లగా’, ‘రౌడీ’లో ‘నీ మీద ఒట్టు’ వంటి మంచి మెలొడీలు రాశా. కొందరు ‘ఏముంది? తెలంగాణ మాండలికాన్ని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడు’ అని చేసిన విమర్శలు నా వరకూ వచ్చాయి. పాటకు భాష, యాస కాదు... భావం ముఖ్యం! ఎంత యాస ఉపయోగించినా... అందులో ఒక ఎక్స్‌ప్రెషన్‌, ప్రేక్షకులకు నచ్చే విషయం, కవితాత్మకంగా లేకపోతే నాకంటూ ఇంత పేరు, ప్రత్యేక శైలి అనే గుర్తింపు వచ్చేవి కావు. మాతృభాషలో మన భావాన్ని వ్యక్తపరచడానికి ఉన్న వెసులుబాటు ఇంకెక్కడా దొరకదు. నాకది పట్టు చిక్కింది. తెలంగాణ మాండలికం నా ఆయుధమైంది.
 
శ్రీహరి అన్న ఉండుంటే...
నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే... హీరో శ్రీహరి. నేను రాసిన ప్రతి పాట మెచ్చుకునేవారు. ‘నువ్వు రాసిన అక్షరం మీద ప్రేమ పెంచుకోకు. అసహ్యించుకో! అప్పుడే కొత్త ఆలోచనలు వస్తాయి’ అని చెప్పారు. ఈ రోజు అన్న ఉండుంటే... నేనున్న స్థాయి చూసి సంతోషించేవారు. నాకన్నా నన్ను ఎక్కువగా నమ్మిన వ్యక్తి, నాకు దారి చూపిన మనిషి ఆయనే. పెద్ద దర్శకులు, నిర్మాతలకు పరిచయం చేశారు. మూడేళ్లు ఆయనతో కలిసి ప్రయాణించా. ఎక్కడుంటే అక్కడికి వెళ్లేవాణ్ణి. నా పాటలు అందరికీ వినిపించేవారు.
 
రాబోయే పాటలు
‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’, ‘భీష్మ’, ‘ఒరేయ్‌ బుజ్జిగా’, ‘అశ్వత్థామ’ చిత్రాలకు రాశా. ఇప్పుడు తెలంగాణ యాసే నా విజిటింగ్‌ కార్డ్‌. అయితే, నేను రాసే విధానం చూసి ‘మీరు మెలొడీలు కూడా రాస్తారా? ట్రై చేద్దాం’ అని అడుగుతున్నారు. ‘ఒరేయ్‌ బుజ్జిగా’లో తెలంగాణ యాసలో ఒక పాట రాశా. తర్వాత రెండు మెలొడీలు ఇచ్చారు. మరో సినిమాలోనూ అంతే!
 
అలిశెట్టి... ఆంధ్రజ్యోతి!
కవి అలిశెట్టి ప్రభాకర్‌ ప్రభావం నాపై ఎక్కువ. ‘ఆంధ్రజ్యోతి’ సిటీ లైఫ్‌లో చిన్న చిన్న పదాలతో నాలుగు లైన్లలో ఒక విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్పొచ్చో అంత అద్భుతంగా చెప్పేవారు. ఆయన కవితల పుస్తకాలు ‘చురకలు’, ‘మరణం నా చివరి చరణం కాదు’ చదివా. పేజీలకు పేజీల కవిత్వం రాసే నేను, ఆయన రచనలు చూశాక మారాను. నా పాటల్లో లైన్లను ఎవరైనా మెచ్చుకున్నారంటే కారణం అలిశెట్టి ప్రభావమే. తెలంగాణ నుంచి వచ్చిన దాశరఽథి, సినారె, అలిశెట్టి అద్భుతమైన కవిత్వాన్ని రాశారు. వాళ్లందరూ నాకు స్ఫూర్తి.
నా శ్రీమతి పేరు రాధిక. మేమిద్దరం క్లాస్‌మేట్స్‌. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నాం. చదువులో పోటీ పడేవాళ్లం. జీవితంలో ఒకే బంధంలో ఉంటామని అప్పట్లో అనుకోలేదు. మాది ప్రేమ వివాహమే. తను ఆర్కిటెక్ట్‌. జేఎన్‌టీయూలో బీఆర్క్‌ చేసింది. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు సాయి అనిరుధ్‌. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చిన్నోడు లిఖిత్‌ సాయిరామ్‌ ఫస్ట్‌ క్లాస్‌. నేను రాసే పాటలు విని కుటుంబ సభ్యులు ఫీడ్‌బ్యాక్‌ ఇస్తారు. యంగ్‌ జనరేషన్‌ ఆలోచనలను నేను పరిగణలోకి తీసుకుంటాను.
 
త్రివిక్రమ్‌ ‘వస్తువుకు ప్రాణం పోశారు’ అని మెచ్చుకున్నారు!
త్రివిక్రమ్‌కి పాట రాయడం నా బిగ్గెస్ట్‌ ఎఛివ్‌మెంట్‌గా ఫీలవుతా. ఆయన మంచి రచయిత. పాటలూ రాశారు. ఆయన చిత్రాల్లోని పాటల్లో ఆయన లైన్‌ ఒక్కటైనా ఉంటుంది. ఆయనకు రాసే అవకాశం వస్తే కవితాత్మకంగా రాయాలని ఎప్పుడో ఫిక్సయ్యా. ఆయన్ను మెప్పిస్తే చాలనుకున్నా. ‘అల... వైకుంఠపురములో’ చిత్రంలో ‘రాములో రాములా’ పాట రాయడానికి పిలిచారు. ఆ పాటలో ‘పువ్వుల అంగీ వేస్తుంటే... గుండీ నువ్వై పూస్తావే’ లైన్‌ త్రివిక్రమ్‌కి బాగా నచ్చింది. ఆయన ఫోన్‌ చేసి ‘గుండీలు చెక్క, ప్లాస్టిక్‌తో చేస్తారు! మీరు వాటికి ప్రాణం పోశారు’ అని మెచ్చుకున్నారు. ఆ ప్రశంసలు మరువలేను.
 
నీలపురి గాజులు... ‘మహాత్మ’
కొత్తగున్నా హాయి నువ్వా... ‘ప్రేమకథా చిత్రమ్‌’
నీ మీద ఒట్టు నా ప్రేమ మీద ఒట్టు... ‘రౌడీ’
బొమ్మోలే ఉన్నదిర పోరి... ‘లై’
ఎన్నియాలో ఎన్నియాలో... ‘రాజా ది గ్రేట్‌’
రెచ్చిపోదాం బ్రదర్‌... ‘ఎఫ్‌ 2’
దిమాక్‌ ఖరాబ్‌..., రాయే రాయే (బోనాలు సాంగ్‌)... ‘ఇస్మార్ట్‌ శంకర్‌’
రాములో రాములా.. ‘అల.. వైకుంఠపురములో’

శ్రీహరి ‘రియల్‌స్టార్‌’లో ‘సలాం నమస్తే
హైదరబాద్‌... ఇరానీ హోటల్‌ జిందాబాద్‌’ అని ఇరానీ కేఫ్‌ గురించి ఓ పాట, ‘పేపర్‌ బాయ్‌’ సినిమాలో పేపర్‌ బాయ్‌ జీవితాన్ని ఆవిష్కరిస్తూ టైటిల్‌ సాంగ్‌ రాశా. సినిమాలు హిట్టవ్వకపోవడంతో పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ, ఈ రెండిటి కోసం నేను ఎక్కువ కష్టపడ్డా. రెండూ జీవితాలను ఆవిష్కరించే పాటలే. ‘పేపర్‌ బాయ్‌’ టైటిల్‌ సాంగ్‌ పాడిన చంద్రబోస్‌ అన్న ‘ఇంకెవరు పేపర్‌ బాయ్‌ మీద పాట రాసినా నీ పాట రిఫరెన్స్‌గా తీసుకోవాలి’ అని కాంప్లిమెంట్‌ ఇచ్చారు.
సత్య పులగం

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.