Nov 1 2019 @ 17:10PM

‘ఆవిరి’ మూవీ రివ్యూ

`అల్ల‌రి`, `న‌చ్చావులే` వంటి కామెడి సినిమాలే కాదు.. `అన‌సూయ‌`, `అమ‌రావ‌తి`, `అవును` వంటి థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన ర‌విబాబుకి గ‌త చిత్రం `అదుగో` షాకిచ్చింది. దీంతో ఈ ద‌ర్శ‌క నిర్మాత మ‌రోసారి త‌న‌కు అచ్చొచ్చిన థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో `ఆవిరి` సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాణంలో స‌పోర్ట్ చేయ‌డంతో సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. ర‌విబాబు చిత్రాల్లో దెయ్యాల‌ను చూపించ‌రు. ఇప్పుడు ఆవిరి సినిమా విష‌యంలో కూడా అలాంటి ప్రయ‌త్న‌మే చేశాడు ర‌విబాబు. మ‌రి ఆవిరి సినిమా ఎలాంటి స‌క్సెస్‌ను సొంతం చేసుకుందో తెలుసుకోవాలంటే ముందు క‌థేంటో చూద్దాం...
 
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
న‌టీన‌టులు: ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్, ప్రియ వ‌డ్ల‌మాని త‌దిత‌రులు
ఆర్ట్‌: నారాయ‌ణ రెడ్డి
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
యాక్ష‌న్‌: స‌తీశ్‌
కెమెరా: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి
మ్యూజిక్: వైధి
స్క్రీన్‌ప్లే: స‌త్యానంద్‌
ర‌చ‌న‌, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: ర‌విబాబు
 
కథ
రాజ్(రవిబాబు), లీనా(నేహా చౌహాన్) భార్యాభర్తలు. వాళ్లకు శ్రేయ, మున్ని అనే ఇద్దరు ఆడపిల్లలు. అయితే ఇద్దరు పిల్లలకీ ఆస్తమా ఉంటుంది. ఓ రోజు పిల్లలిద్దరూ స్విమ్మింగ్ చేస్తుంటారు. పెద్దమ్మాయి శ్రేయా ఉన్నట్టుండి ఊపిరాడక స్మిమ్మింగ్ పూల్‌లోనే చనిపోతుంది. రాజ్ నిర్లక్ష్యమే ఆ పాప చావుకు కారణమవుతుంది. రాజ్ పెద్ద బిజినెస్‌మేన్. జపాన్ కంపెనీతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటాడు. శ్రేయా చనిపోవడంతో లీనా ఆ ఇంట్లో ఉండలేకపోవడంతో వేరే ఇంటికి మారుతారు. కొత్త ఇంటికి వెళ్లాక చిన్న కూతురు మున్ని వింతగా ప్రవర్తిస్తుంది. ఒక ఆత్మతో మున్ని మాట్లాడుతూ ఉంటుంది. రెండుమూడు సార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఆస్తమా ఉన్న కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసం లీనా తన ఇంటికి సెక్యురిటీ లాకర్స్ ఏర్పాటు చేస్తుంది. ఏ డోర్ తీసినా అలారం మోగేలా పోలీసుల సాయంతో సెట్ చేస్తుంది. అయితే ఒక రోజు మున్ని ఇంట్లో నుంచి మాయమైపోతోంది. అదే టైమ్‌లో రాజ్‌ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న జాన్వీ(ప్రియా వడ్లమాని) కూడా కనిపించకుండా పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందుతుంది.
 
జాన్వీ మిస్సింగ్ కేసు రాజ్ స్నేహితుడైన పోలీసు అధికారి వినోద్(ముక్తా ఖాన్) విచారిస్తుంటాడు. ఆ కేసు విషయం గురించి రాజ్‌ను విచారిద్దామని అతని ఇంటికి వస్తే.. మున్ని కనిపించడం లేదన్న విషయం తెలిసి ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తారు. అందులో వినోద్‌కు సంచలన విషయాలు తెలుస్తాయి. మున్నితో ఒక ఆత్మ ఉందనే విషయం తెలుస్తుంది. ఆత్మల గురించి తెలిసిన తన మిత్రుడు డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్)ను పిలిపిస్తాడు. అప్పటి వరకు మామూలుగా ఉంటే రాజ్ భార్య లీనాలోకి ఒక్కసారిగా ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? మున్నిని ఎవరు తీసుకెళ్లారు? జాన్వీని ఎవరు చంపారు? అనే ఆసక్తికర అంశాలు సినిమాలో చూడాల్సిందే.
 
విశ్లేషణ
భార్య, భర్త.. ఇద్దరు పిల్లలు. తండ్రి నిర్లక్ష్యం వల్ల ఒక కూతురు చనిపోతుంది. మిగిలి బిడ్డనైనా జాగ్రత్తగా కాపాడుకోవాలని తల్లి ప్రయత్నిస్తుంటుంది. అందులో తల్లి ప్రేమను చక్కగా చూపించాడు డైరెక్టర్. డబ్బు సంపాదన కోసం 24 గంటలు వ్యాపారాల్లో బిజీగా ఉంటూ పిల్లలను పట్టించుకోకపోతే వాళ్లు ఎలా ఫీలవుతారనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అది ప్రేక్షకులకు అర్థమయి కానట్టు ఉంటుంది. అవును సినిమాలోలా ఇందులోనూ కనపడని ఆత్మ మధ్య మధ్యలో వస్తుంటుంది. ఆత్మతో మాట్లాడుతూ ఇంట్లో నుంచి వెళ్లేందకు మున్ని పదే పదే ప్రయత్నించే సన్నివేశాలతో ఫస్ట్ ఆఫ్‌ నెమ్మదిగా సాగుతుంది.
 
అసలు కథ సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. మున్నీ మిస్ అవడంతో రాజ్ స్నేహితుడు పోలీసాఫీసర్ వినోద్ (ముక్తా ఖాన్), అతని ఫ్రెండ్ డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్) ఎంటర్ అవ్వడంతో కథనం కాస్త ముందుకు వెళ్తుంది. రాజ్ నిర్లక్ష్యం వల్లే అతని పెద్ద కూతురు చనిపోయిందని తెలుసుకున్న పవన్ శర్మ.. మున్నీ మిస్సింగ్ కేసును హ్యాండిల్ చేసే విధానం.. లీనానే మున్నీని దాచేసిందని కనిపెట్టడం, రాజ్‌పై లీనా దాడి చేయడం, లీనాలో ఉన్న ఆత్మ జాన్వీది అని తెలుసుకోవడంతో కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్‌తో క్లయిమాక్స్ ప్రేక్షకుల ఊహకు సులువుగా అందుతుంది.
 
నటీనటుల పనితనం
తక్కువ పాత్రధారులతో తెరకెక్కించిన ఆవిరిలో అందరూ బాగానే నటించారు. ముఖ్యంగా మూడు పాత్రలు సినిమా మొత్తం కనిపిస్తాయి. రాజ్, లీనా, మున్నీల చుట్టే కథ తిరిగినా.. సందర్భానుసారంగా వచ్చే పోలీస్ పాత్ర, డాక్టర్, జాన్వీ పాత్రలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. తనకు అలవాటైనా ఎక్స్‌ప్రెషన్స్‌తో రవిబాబు ఆకట్టుకున్నాడు. ఒకటి రెండు చోట్ల కామెడీ కూడా పండించాడు. అయితే సినిమా మొత్తం సీరియస్ లుక్‌లోనే కనబడ్డాడు. ఇక నేహా చౌహాన్ ఫస్టాఫ్‌లో పర్వాలేదనిపించినా.. దెయ్యం పట్టిన పాత్రలో మాత్రం ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో విసుగుపుట్టించింది. బిగ్‌బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న హిమజ కమల పాత్రలో ఒక్క సీన్‌లోనే కనిపిస్తుంది. ఆమె పాత్రను దర్శకుడు సరిగ్గా డిజైన్ చేసినట్టు కనిపించలేదు. ఆమెతో కామెడీ చేయించి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది.
 
సాంకేతిక విశ్లేషణ
రవిబాబు ఇటు దర్శకుడిగా.. అటు నటుడిగా మరో వైపు నిర్మాతగా త్రిపాత్రాభినయం పోషించాడు. ‘ఆవిరి’ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో ఆత్మ ఉన్నట్టు చూపించిన రవిబాబు.. సినిమాలో దాన్ని ఎక్కడా చూపించలేదు. ఆత్మలను ఆవిరితో పోల్చడం.. దెయ్యాలకు వేడి అంటే భయమని చెప్పడం.. రవిబాబుకే చెల్లింది. పేరెంటింగ్ అనే మెసేజ్‌కు ఆత్మను జోడించి హారర్ థ్రిల్లర్ జోనర్‌లో రవిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
 
ఇలాంటి హారర్, థ్రిల్లర్ సినిమాలంటే సంగీతం, నేపథ్యసంగీతం ప్రధానంగా అవసరం. వైద్య అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను సందర్భానుసారంగా భయపెట్టింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు చక్కగా కుదిరింది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది. సినిమాకు అవసరమైన రీతిలో నిర్మాణ విలువలు ఉన్నాయి.
 
చివరిగా.. ‘ఆవిరి’... మెప్పించ‌లేని థ్రిల్ల‌ర్‌
రేటింగ్‌: 2/5