Oct 31 2019 @ 03:27AM

ఇంటర్‌ వరకూ అమ్మఒడి

 • జనవరి నుంచి తల్లుల ఖాతాల్లో డబ్బు
 • దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికే
 • తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ తప్పనిసరి
 • రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయం
 • గర్భిణులు, బాలింతలకు రెట్టింపు పౌష్టికాహారం
 • తీవ్ర వ్యాధిగ్రస్తులకు నెలవారీ పింఛను
 • పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 16 వేలకు పెంపు
 • కృష్ణా, గోదావరి కాలువల శుద్ధికి ప్రత్యేక మిషన్‌
 • మాల, మాదిగ, రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్లు
 • హజ్‌, జెరూసలెం యాత్రికులకు సాయం పెంపు
 • 147 నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌ అగ్రిల్యాబ్‌లు
 • 7 నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు
 • పేదలకు 100 గజాల వరకు రూపాయికే రిజిస్ట్రేషన్‌
 • వీబీసీ, లులూ గ్రూపులకు భూకేటాయింపులు రద్దు
 • ప్రతిభావంతులకు వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అవార్డులు
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న పేద విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకే దీనిని వర్తింపజేయాలని స్పష్టం చేసింది. పథకం కింద లబ్ధి పొందేవారికి తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలని తేల్చిచెప్పింది. తెల్ల కార్డు లేనివారు.. ఇప్పటికే దానికోసం దరఖాస్తు చేసి ఉంటే ప్రభుత్వం ఇచ్చే రశీదు ఉన్నా సరిపోతుందని తెలిపింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న కీలక నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాలు, రవాణా శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సచివాలయంలో విలేకరులకు వెల్లడించారు. ‘ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో ఒకటి నుంచి ఇంటర్‌ దాకా చదివే పేద విద్యార్థుల తల్లులకు అమ్మఒడి కింద కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని, జనవరి నుంచి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతుందని చెప్పారు. తల్లులు లేని చోట పిల్లల సంరక్షకులకు పథకం వర్తిస్తుందన్నారు. వీధి బాలలు, అనాఽథలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే వారికి ఈ పథకం వర్తింపుపై సంబంధిత శాఖను సంప్రదించాలని.. పథకం అమలుకోసం రూ.6,455 కోట్లు ఖర్చుచేయనున్నామని చెప్పారు.
 
మరిన్ని కేబినెట్‌ నిర్ణయాలివీ..
 •  హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలోని 130 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు.
 •  తలసేమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా, హిమోఫిలియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేల చొప్పున పింఛను.
 •  తీవ్రపక్షపాతం, తీవ్రమైన కండరాల క్షీణత, కదల్లేని స్థితిలో మంచానపడ్డవారు, బోధకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్‌ 3,4,5) నెలకు రూ.5 వేల పింఛను.
 •  ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స అనంతరం పేద రోగులు కోలుకునే వరకు రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల పింఛను.
 •  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధ నాస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.16 వేలకు పెంపు.
 •  గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు రెట్టింపు పౌష్టికాహారం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకింద పెట్టే ఖర్చు భారీగా పెంపు. రాష్ట్రంలో ఏడు ఐటీడీఏలు సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కేఆర్‌పురం, శ్రీశైలంతోపాటు 8 జిల్లాలు, గిరిజన సబ్‌ప్లాన్‌ ప్లాన్‌ ఏరియాల్లో దీని అమలు.
 •  అగ్రిగోల్డ్‌ బాధితులకు నవంబరు 7 నుంచి డబ్బుల చెల్లింపు. రూ.10 వేల చొప్పున డిపాజిట్‌ చేసిన 3,69,655 మందికి రూ.264 కోట్ల చెల్లింపు.
 •  కృష్ణా, గోదావరి నదులపై పంటకాలువల శుద్ధికి ప్రత్యేక మిషన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం. ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జలవనరులు, అడవులు, పురపాలన, పంచాయతీరాజ్‌ తదితర విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు.
 •  షెడ్యూల్డ్‌ కులాల ఆర్థిక సహకార సంస్థ విభజన. మాల, మాదిగ, రెల్లి-ఇతర కులస్తుల కోసం 3 ప్రత్యేక కార్పొరేషన్లు.
 •  వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున చెల్లింపు. డీజిల్‌ సబ్సిడీ రూ.6.03 నుంచి రూ.9కి పెంపు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ప్రాంతంలో చమురు, సహజవాయువు తవ్వకాల వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఓఎన్‌జీసీ చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్రప్రభుత్వమే చె ల్లించాలన్న నిర్ణయానికి ఆమోదం.
 •  వివిధ రంగాల్లో ప్రజాసేవ అందించిన ప్రతిభావంతులకు వైఎ్‌సఆర్‌ లైఫ్‌టైమ్‌ అవార్డులు. విద్య, సామాజిక, సేవ, వైద్యం, సైన్స్‌, ఇంజనీరింగ్‌, సివిల్‌ సర్వీసు, వాణిజ్యం, పరిశ్రమలు, సాహిత్యం, కళలు, క్రీడా రంగాల్లో వంద మంది ప్రతిభావంతులకు ఏటా రెండు విడతలుగా అవార్డుల ప్రదానం. జనవరి 26న 50 మందికి, ఆగస్టు 15న మరో 50 మందికి రూ.10 లక్షల చొప్పున నగదు అందిస్తారు. కేంద్రం ఇచ్చే పద్మవిభూషణ్‌ తరహాలో వైఎ్‌సఆర్‌ లైఫ్‌టైమ్‌ అవార్డులను అందించాలని నిర్ణయించినట్లు మంత్రి నాని చెప్పారు.
 •  హజ్‌, జెరూసలెం వెళ్లే యాత్రికులకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం పెంపు. వార్షికాదాయం రూ. 3లక్షలలోపు ఉన్న వారికి ఇచ్చే సహాయం రూ.40 వేల నుంచి రూ.60 వేలకు, వార్షికాదాయం రూ.3 లక్షలపైన ఉన్నవారికి ఇచ్చే సహాయం రూ. 20 వేల నుంచి రూ.30 వేలకు పెంపు.
 •  రోబో శాండ్‌ తయారు చేసే స్టోన్‌ క్రషింగ్‌ యూనిట్లకు ప్రోత్సాహకాలకు ఆమోదముద్ర. రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల మేర పావలా వడ్డీకి రుణాలు. రోబోశాండ్‌, ఎం-శాండ్‌ను ప్రభుత్వ పథకాలకు 20 శాతం మేర వినియోగించుకునేందుకు ఓకే. ఏటా రూ.37.3 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 186.5 కోట్ల కేటాయింపు. ప్రస్తుత స్టోన్‌ క్రషర్‌ యూనిట్లు అప్‌గ్రేడ్‌ కావడానికి ఆరు నెలలు గడువు.
 •  రైతుల మేలు కోసం రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో వ్యవసాయ ల్యాబ్స్‌ ఏర్పాటుకు ఆమోదం. వీటితోపాటు జిల్లా స్థాయిలో 13, ప్రాతీయ స్థాయిలో 4 రీజనల్‌ కోడ్‌ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం. విత్తనాలు, ఎరువులు మార్కెట్‌కు వచ్చేముందు, మార్కెట్‌ నుంచి వెళ్లే ముందు వీటిల్లో పరీక్షిస్తారు. 9 కోస్తా జిల్లాల్లో 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు.
 •  బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు, బాండ్లు జారీ చేసేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు అనుమతి.
భూముల క్రమబద్ధీకరణ
అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలని కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కేసుల్లో అభ్యంతరం లేని భూములను పేదల పేరిటే రెగ్యులరైజ్‌ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 100 గజాల వరకు రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు 100 నుంచి 300 గజాల వరకు ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకుంటే జిల్లా కలెక్టర్‌ నిర్ణయించే ధరల ఆధారంగా క్రమబద్ధీకరిస్తారు. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న వారికి 300 గజాల వరకు మార్కెట్‌ విలువ ఆధారంగా కలెక్టర్‌ ఇచ్చే సిఫారసు మేరకు రెగ్యులరైజ్‌ చేస్తారు. క్రమబద్ధీకరణ అనంతరం భూమిపై పూర్తి హక్కులు ఇస్తారు. కానీ ఐదేళ్లపాటు లాకింగ్‌ ఉంటుంది. గతంలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పేదలు వాటిని మరో పేదకు విక్రయిస్తే దాన్ని కూడా నిబంధనల మేరకు రెగ్యులరైజ్‌ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.