Oct 29 2019 @ 03:49AM

కక్ష సాధింపుతో కష్టాలు!

  •  మా వాళ్ల కోసమే రాజీనామా
  •  పార్టీకి, శాసనసభ్యత్వానికి కూడా..
  •  క్రియాశీల రాజకీయాలకూ గుడ్‌బై
  •  తొలి నుంచీ పలు పోరాటాలు చేశా
  •  వెనక్కి వెళ్లే మనస్తత్వం నాకు లేదు
  •  కానీ నమ్మక ద్రోహులతోనే ఇబ్బంది
  •  చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్యే వంశీ లేఖ
అమరావతి/విజయవాడ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడమే గాకుండా.. క్రియాశీల రాజకీయాలకు కూడా దూరంగా ఉండదలిచినట్లు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జి కక్షసాధింపు ధోరణి వల్ల తనను నమ్ముకున్నవారంతా పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని.. తాను క్రియాశీలంగా ఉండడం వల్ల వారి కష్టాలు రెట్టింపవుతున్నాయని తెలిపారు. అందుకే వారి కోసం తాను రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తున్నానని పేర్కొంటూ పార్టీ అధినేత చంద్రబాబుకు దీపావళి రోజున లేఖ రాశారు. దీనికి చంద్రబాబు స్పందించి.. అండగా ఉంటాం.. పోరాడదామని ప్రతిలేఖ రాశారు. దానిపై వంశీ మరో లేఖను వాట్సాప్‌ ద్వారా పంపించారు. దానికీ స్పందించిన టీడీపీ అధినేత.. అన్ని విషయాల్లోనూ అండగా ఉంటానని, సమస్యలపై మద్దతిచ్చేందుకు పార్టీ ఎంపీ కేశినాని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను నియమిస్తున్నానని తెలిపారు. వారిద్దరూ మంగళవారం వంశీతో చర్చలు జరిపే అవకాశాలున్నాయి. వివరాలివీ..
 
అందుకే రాజీనామా..
‘పార్టీలో ఇప్పటివరకు మీ నాయకత్వంలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు సాధ్యమైనంత మేరకు.. రెండో ఎజెండా లేకుండా మనస్సాక్షిగా పార్టీ కోసం పనిచేశా. పనులన్నీ కనురెప్ప కూడా వేయకుండా విజయవంతంగా పూర్తిచేశా. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక... వైసీపీ ఇన్‌చార్జి, కొందరు ఉద్యోగుల పక్షపాత వైఖరి వల్ల నా అనుచరులు, మద్దతుదారులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. నేను క్రియాశీలంగా ఉండడం వల్ల వారి కష్టాలు అనేక రెట్లు పెరిగిపోతున్నాయని భావిస్తున్నా. ఈ దృష్ట్యా రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని, రాజకీయాలను వదిలేయాలని నిర్ణయించుకున్నా. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా..’ అని వంశీ చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత దీనిపై స్పందిస్తూ.. ‘వాట్సాప్‌ ద్వారా పంపిన మీ లేఖను చదివాను.
 
ఈ విషయాలన్నీ వ్యక్తిగతంగా కూడా గతంలో నా దృష్టికి తెచ్చారు. టీడీపీలోనూ, ఎమ్మెల్యేగానూ మీరు సమర్థంగా పనిచేశారు. గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి, కొందరు అధికారులు మీపైన, పార్టీ యంత్రాంగంపైనా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మీపై పెట్టిన కేసు కూడా దురుద్దేశపూర్వకంగా పెట్టింది. పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చే కార్యక్రమం అది. ఆ ప్రకారమే మన ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీనవర్గాల కోసం పనిచేసింది. ఇలాంటి కేసులను పార్టీ లాజికల్‌గా ఎదుర్కొంటుంది. మీరు రాజకీయాలను వదిలేయడం వల్ల పార్టీ మద్దతుదారులపై దాడులు ఆగవు. రాజకీయాల నుంచి వైదొలగడం, రాజీనామాలు సరైన పరిష్కారం కావు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలపై వేధింపులు కొనసాగుతున్నాయి. మనం ఐక్యంగా వీటిపై పోరాడాలి. మీకు, పార్టీ యంత్రాంగానికి జరిగిన అన్యాయంపైనా పోరాడాలి’ అని సూచించారు.
 
13 ఏళ్లుగా మీ సలహా తీసుకుంటున్నా..
చంద్రబాబు పంపిన లేఖపై వంశీ మరోసారి వాట్సా్‌పలో లేఖ రాశారు. ‘నేను రాసిన లేఖ మొత్తం చదివి స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీస్సులతో గన్నవరం ఎమ్మెల్యేగా, పార్టీ నేతగా చేసిన సేవలను గుర్తించినందుకు ధన్యవాదాలు. గత 13 ఏళ్ల నుంచీ ప్రతి విషయం మీకు చెబుతూ.. మీ సలహా తీసుకుంటున్నా. గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉన్నా పార్టీ శ్రేయస్సు కోసం మీ మాట విని విజయవాడ ఎంపీగా లగడపాటి రాజగోపాల్‌పై పోటీచేశా. ఓడిపోయి ఐదేళ్ల విలువైన కాలం వృథా అయినా పశ్చాత్తాపపడలేదు. ఆ తర్వాత విజయవాడ నగర అధ్యక్షుడిగా నిజంగా జీవన్మరణ సమస్యను ఎదుర్కొన్నా.
 
దేవుడి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తిచేశా. ఆ తర్వాత ఒక నిర్దాక్షిణ్య ఐపీఎస్‌ అధికారి పార్టీ యంత్రాంగాన్ని వేధించడానికి వ్యతిరేకంగా పోరాడా. ఇలా అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు, శక్తులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తూ పోరాడుతూ వచ్చా. నాపై ఒక క్రిమినల్‌ కేసు కూడా నమోదైంది. మన ప్రభుత్వ హయాంలోనే.. కాలువలపై నివసిస్తున్న వారి నివాసాలు తొలగిస్తుండడాన్ని ఆపినందుకు కొందరు అధికారులు దురుసుగా వ్యవహరించి ఈ కేసు పెట్టారు. అలా కేసు పెట్టినవారందరికీ గతంలో మీరే న్యాయం చేసి, ఆశీర్వదించారు. అన్యాయానికి వ్యతిరేకంగా నేను చేసిన పోరాటంలో నాకు మనస్ఫూర్తిగా మద్దతిచ్చినందుకు ఏం చెప్పాలో మాటలు రావడం లేదు. గత ఎన్నికల ముందు కూడా నాపై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. కానీ పోరాడాను. పోరాటం నుంచి వెనక్కి వెళ్లే మనస్తత్వం లేనివాడిని. అయితే ఎదురుగా వచ్చే శత్రువును ఎదుర్కోవడం తేలిక. మనతోనే ఉండే నమ్మకద్రోహుల(బ్లాక్‌షీప్‌)తో పోరాడడమే కష్టం. మీడియా, ఇతరులు రకరకాల ఊహాగానాలు చేసే అవకాశం ఉన్నందున.. ఇంతకంటే ఎక్కువ ఈ వాక్యాన్ని పొడిగించదలుచుకోలేదు. నాపై ఇంత శ్రద్ధ చూపి మద్దతిస్తానన్నందుకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
 
వంశీకి కేశినేని, కొనకళ్ల ఆహ్వానం
చంద్రబాబు సూచనతో వంశీతో మాట్లాడేందుకు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ రంగంలోకి దిగారు. కానీ వంశీ హైదరాబాద్‌లో ఉండటంతో సోమవారం ఆయనతో చర్చలు జరపలేకపోయారు. అయితే ఫోన్‌లో నారాయణకు వంశీ టచ్‌లోకి వచ్చారు. చర్చలకు తాను సిద్ధమేనని ఈ సందర్భంగా ఆయన చెప్పినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం వారిద్దరితో భేటీ అయ్యే అవకాశముంది.
పార్టీతో మీకు చారిత్రక బంధం..
చంద్రబాబు వంశీకి వాట్సా్‌పలోనే తిరుగు లేఖ రాశారు. ‘మీ రెండో లేఖ చదివాను. అన్ని విషయాలను నోట్‌ చేసుకున్నా. పార్టీతో మీకున్న చారిత్రక బంధం వాస్తవం. గతంలో అన్యాయానికి వ్యతిరేకంగా నా మద్దతుతో పోరాడారు. ఇప్పటి పోరాటంలో కూడా మీకు అండగా ఉంటా. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ వేధింపులపై పోరాటంలో అండగా ఉంటాం. దీనికోసం ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలకు మీతో సమన్వయం చేసుకునే బాధ్యతల్ని అప్పగిస్తున్నా. అన్ని సమస్యలూ పరిష్కరిస్తానని మీకు మాటిస్తున్నా’ అని పేర్కొన్నారు.