Oct 25 2019 @ 03:22AM

4 నెలల్లో రెండేళ్లు వెనక్కి!

  • టీడీపీపై కక్షతో కార్మికుల పొట్టగొట్టారు
  • ఇసుక లేక లక్షల మంది ఉపాధి కోల్పోయారు
  • వారికి అండగానే 3వ తేదీన చలో విశాఖ
  • పోలీసులతో అడ్డుకునే యత్నం: పవన్‌
మంగళగిరి, అక్టోబరు 24: రాష్ట్రంలో గత నాలుగు నెలల్లో రెండేళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో ఉపాధి లేక కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, గత నాలుగు నెలలుగా వారు పడుతున్న కష్టాలు తనకు ఎంతో బాధ కలిగించాయని పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారినుద్దేశించి పవన్‌ మాట్లాడారు.‘ఇసుక కొరతతో లక్షలాది మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్య ప్రజలు లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను తీసివేసి కొత్త పథకాలను అమలు చేస్తోంది. 5 లక్షల మందికి వలంటీర్ల ఉద్యోగాలిచ్చి.. ఐదింతల మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది. ఇసుక గందరగోళానికి వీలైనంత త్వరగా తెరదించాలి.
 
ఇసుక విధానంపై జనసేన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీతో ఇటీవల హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేశాం. అందులో భాగంగానే నవంబరు 3న విశాఖపట్నంలో నిరసన ర్యాలీ చేపట్టబోతున్నాం. ర్యాలీ అనగానే ప్రభుత్వం ఇసుకపై సమీక్ష సమావేశం పెట్టింది. దీనిని బట్టి చూస్తుంటే ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకునేందుకు యత్నిస్తుందని అర్థమవుతోంది. తెలంగాణలో 42 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె తలపెడితే జనసేన సహా అన్ని పార్టీలు కలసి వచ్చాయి. ఆంధ్రలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కరువై రోడ్డున పడితే జనసేన తప్ప ఇతర ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడం బాధాకరం’ అనివ్యాఖ్యానించారు.

అసభ్య పోస్టులపై పోలీసులు స్పందించరా?
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులపై సోషల్‌ మీడియాలో చిన్న పోస్టు పెడితే వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించారంటూ కేసులు పెడుతున్నారని, అదే జనసేనకు చెందిన ఓ ఆడబిడ్డపై కులం పేరుతో పోస్టులు పెట్టి దూషిస్తే పోలీసులు స్పందించడం లేదని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా దూషిస్తూ వేధిస్తున్నారని ప్రకాశం జిల్లాకు చెందిన అనంత స్వాతి అనే జనసేన మహిళా కార్యకర్త గురువారం మంగళగిరిలో పవన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మనకోసం పనిచేసిన ఆడపిల్లను రక్షించుకోకపోతే సిగ్గుచేటని, స్వాతికి ప్రకాశం జిల్లా నాయకులు, జనసైనికులు అండగా నిలవాలని కోరారు.