Mar 10 2015 @ 23:32PM

సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి

వైద్య రంగంలో న్యూరాలజీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ న్యూరాలజీ విభాగంలో ఏడు దశాబ్దాల అనుభవజ్ఞుడు డాక్టర్ సుంకర బాలపరమేశ్వర్‌ రావు. నిమ్స్‌ తొలి డైరెక్టర్‌గా, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా అనేక బాధ్యతలు నిర్వహించిన బాలపరమేశ్వరరావు 1983లో పదవీ విరమణ చేశారు. దాదాపు 15 వేలదాకా సర్జరీలు చేసిన ఆయన 87 ఏళ్ల వయస్సులో కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. తన సుదీర్ఘ జీవన యానంలో శారీరక, మానసిక ఆరోగ్యాల కోసం ఆయన అనుసరించిన మార్గాలేమిటో ‘నవ్య’తో పంచుకున్నారు..
ప్రపంచం మొత్తంలో సమయపాలనలో, క్రమశిక్షణలో పూర్తి అస్తవ్యస్తంగా ఉండేది ఒక్క మనిషే అంటుంటారు. ఆ ధోరణి వెనుక ఇతరులకు ఏ కారణాలున్నా, నాకైతే వృత్తిపరమైన కారణాలే ఉన్నాయి. ఉదయం వేళ అల్పాహారం తీసుకోవడం ఒక్కటే మనిషనుకున్న నిర్ణీత సమయంలో ఉంటుంది. మధ్యాహ్న, రాత్రి భోజనాల విషయంలో ఒక వేళాపాళా ఉండదు. ఒక శస్త్రచికిత్స మొదలుపెడితే రెండు, మూడు గంటల నుంచి ఎన్ని గంటలైనా కొనసాగవచ్చు. అందువల్ల భోజనం ఎప్పుడు తింటామో ఏమో తెలియదు. ఇక ఆహార పానీయాల సంగతికొస్తే.. ఫలానా దాన్నే తీసుకోవాలనేమీ పెట్టుకోను. ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకుంటాను. నిబంధనలేమీ లేవు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను అనుసరించిన ప్రత్యేక మార్గాలంటూ కూడా ఏమీ లేవు. నాకు ఇష్టమైనవన్నీ తినేవాణ్ణి. క్రికెట్‌ తప్ప అన్ని ఆటలూ ఆడాను. క్రికెట్‌ ఆడకపోవడానికి నేను పూర్తిగా పల్లెటూరి నేపథ్యం నుంచి రావడమే కారణం. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం మా స్వగ్రామం.
శాఖాహారిని..
శాఖాహార, మాంసాహారాల్లో ఏదీ ఉత్తమం అనే భావనే నాలో లేదు. కానీ 57 ఏళ్లుగా నేను శాఖాహారినే. దానికి కారణం జాగ్రఫీ, డిస్కవరీ ఛానళ్లలో జింకలను చంపేసి తింటున్న పులులను చూసి విపరీతంగా బాధపడిపోయి మాంసాహారమే మానేశాను. జింకను చంపేస్తున్నప్పుడు అంతగా బాధపడే నేను స్వయంగా కోడిని కోసుకొని తినేయడం ఎలా సాధ్యం..? స్పందనలకు కూడా ఎక్కడికక్కడ అడ్డుగోడలు ఉన్నాయా ఉంటే సమగ్రంగా మనిషి, మనిషి కాదని నేనంటాను. అందుకే మానేశాను. ఆహార విధానాలు మారిన మాటే నిజమే కానీ నా ఆరోగ్యంలో వచ్చిన పెద్ద తేడా ఏమీ లేదు. తిండి విషయంలో.. ప్రసార మాధ్యమాలు పనికట్టుకుని పలు రకాల అనుమానాల్ని ప్రచారం చేస్తుంటాయి. 40 ఏళ్లు దాటిన ప్రతి స్ర్తీ కాల్షియం మాత్రలు వేసుకోవాలని చెబుతుంటాయి. నిజానికి అలాంటివేమీ అవసరం లేదు. ఏమైనా ఈ వ్యాపార ప్రకటనలు, ప్రచారాల ప్రభావాల వల్ల ప్రజలు చిన్నచిన్న జబ్బులకి పెద్ద పెద్ద డాక్టర్లను సంప్రదిస్తున్నారు. ఇదంతా అనవసరమైన భారం.
క్యాన్సర్లు ఎందుకొస్తున్నాయ్‌..
ఇటీవల క్యాన్సర్‌ జబ్బులు బాగా పెరిగిపోయాయి. దీనికి ఇవే కారణాలని చెప్పలేం కానీ బొటాబొటిగా కనిపించే కారణాల్లో ఒకటి - మనిషి జీవిత కాలం పెరగడం. ఆ వయస్సులో జీవక్రియలు కుంటుపడిపోయి శరీర వ్యవస్థ అసహజ స్థితికి చేరుకుంటుంది. అది క్యాన్సర్‌ బారిన పడడానికి ఒక కారణం అవుతుంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి అందరి విషయంలో అలా కాదు కానీ కొందరి విషయంలో అలా జరగవచ్చు.
దీనికి తోడు వాతావరణ కాలుష్యమూ మరొక కారణమని నేనంటాను. అలానే మనం తీసుకున్న దాదాపు ఆహార పానీయాలన్నీ ఏదో ఒక రకంగా కల్తీ చేస్తున్నారు. చాలా కాలంగా అసలు పెరుగు తీసుకోవటం మానేశాను. పెరుగును చేతిలోకి తీసుకుంటే అంతా ఏదో జిడ్డులా, తీగలా తోస్తుంది. ఏ కంపెనీ పాలు తీసుకున్నా అదే పరిస్థితి. ఆఖరికి నీళ్లు కొనుక్కుందామనుకుంటే .. మినరల్‌ వాటర్‌ కూడా కల్తీనే! గాలి కాలుష్యం. ఇవే కాదు.. మందులు కల్తీవే వస్తున్నాయి. అవి తక్కువ ప్రమాణంగానో, హనికరంగానో ఉంటున్నాయి. వీటి నుంచి బయట పడడం చాలా కష్టం. అంతా కల్తీ వ్యవస్థే. సర్వవ్యాప్తమై పోయింది. ఇందుకు ఎవరిని పట్టుకుంటాం. ఎవరిని నిందిస్తాం. ఆహార పానీయాల్లో మనం అనుకున్నవి ఒకటి మన చేతికి అందేవి మరొకటి. వీటికి తోడు నానాటికీ పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్లు కూడా కారణమే.
అసంతృప్తే అనారోగ్యం..
మానసిక ఒత్తిళ్లు పెరగడానికి మనుషుల్లో మానసిక సంతృప్తి కరువవడమే కారణం. అసంతృప్తి పెరిగే కొద్దీ అదనంగా శ్రమించడం మొదలుపెడతారు. అలాగే మానసిక ఒత్తి ళ్లు పెరగడానికి మన లక్ష్యాల స్థాయి పెరగడం, మన ఆకాంక్షలు పెరగడమే కారణం. తృప్తి తరిగే కొద్ది ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మానసిక ఒత్తిళ్లు మనిషిని తీవ్ర నిద్రలేమికి గురిచేస్తున్నాయి. నిద్రలేమి ఒక్కటే శరీరంలోని సర్వవ్యవస్థల్ని దెబ్బతీస్తుంది. నా వద్దకు వచ్చే పేషెంట్లలో ఎక్కువ మంది నిద్రలేమి సమస్యలతోనే వస్తుంటారు. రోడ్డు మీద పడుకున్న వాడు కూడా హాయిగా నిద్రిస్తుంటాడు. కానీ పరుపు, మంచం, ఫ్యాన్‌, ఏసీ అన్ని సౌలభ్యాలు ఉండి కూడా నిద్రపట్టడం లేదనడానికి అసంతృప్తే కారణం. మనిషి ఎప్పుడైతే నిద్రకోసం మంచం మీదకు వెళతాడో, అప్పుడే మొత్తం ప్రపంచాన్నే మరిచిపోగలగాలి కానీ మనిషికిప్పుడు అది సాధ్యం కావడం లేదు. అన్నీ ఉండి కూడా మనకు తృప్తి లేదు. ఇవన్నీ ఆనారోగ్యానికి దారితీస్తాయి. మాలాంటి వృత్తుల్లో మానసిక ఒత్తిళ్లు తప్పవు. ఒత్తిళ్లు మెదడులో నెగిటివ్‌ మార్పులకు కారణమవుతాయి. అవి పలు రుగ్మతలకు దారి తీస్తాయి. నాకు అధిక రక్తపోటు, మధుమేహం లేవు. పొగతాగడం, మద్యపానం అలవాట్లు కూడా లేవు. కానీ నా శరీరం చాలా రకాల వ్యాధుల పాలయ్యింది. పలు రకాల సర్జరీలు జరిగాయి. 96 లో గుండెపోటు వచ్చి బైపాస్‌ సర్జరీ కూడా అయింది.
మానసిక అంశాలు
మానసిక సంతృప్తిని సాధించడానికి వ్యత్యాసాల్నీ, వైరుధ్యాల్ని జీర్ణించుకునే నైపుణ్యం సాధించడం చాలా ముఖ్యం. నా అర్ధాంగికి, నాకూ మధ్య కూడా ఆలోచనపరమైనా వ్యత్యాసాలు, వైరుధ్యాలు ఉండొచ్చు. అది సహజం. ఎందుకంటే ప్రపంచంలోని ఏ ఇద్దరి వ్యక్తిత్వాల, దృక్పథాలు ఒక్కలా ఉండవు కదా. అందుకే ఈ వ్యత్యాసాలతో జీవించడం మనిషి అలవర్చుకోవాలి. చాలాసార్లు మనం ఆశించినట్లు ఏవీ జరగవు. ఒక్కోసారి దిగ్ర్భాంతికరమైన పరిస్ధితులు కూడా ఎదురు కావచ్చు. మీరు ఆశ్చర్యపోతారు. నా కొడుకు, కూతురు ఇద్దరు పాండురోగంతో పుట్టారు. ఎండకు వెళ్లలేరు. ఏదీ మామూలుగా చదవలేరు. మనం 5 నిమిషాల్లో చదివే విషయాన్ని చదవడానికి వారికి 20 నిమిషాలు పడుతుంది. అందరూ కోరుకోని అతి సాధారణ జీవితం కూడా వారికి లభించలేదు. దానికే అల్లకల్లోలమై పోతే ఎలా?
అన్నింటినీ ఇష్టంగా చెయ్యాలి..
యోగా, ప్రాణయామాల గురించి లోతైన అవగాహన లేదు. కొన్నాళ్ల క్రితం దాకా వాకింగ్‌ చేసేవాణ్ని. వయసురిత్యా ఇప్పుడదీ మానేశాను. కాకపోతే వ్యాయామానికి ప్రత్యేకమైన సమయం అంటూ లేకపోయినా పేషెంట్స్‌ని చూస్తూనే మధ్య, మధ్య కాళ్లు చేతుల్ని అటూ ఇటూ కదుపుతుంటాను. ఈ వయసులో ఇది చాలు. ఏదైనా ఇష్టంగా చెయ్యను, చెబుతాను. ఎందుకంటే ఇష్టంగా చేస్తే.. పని కూడా ఆటలానే ఉంటుంది. కష్టంగా చేస్తే ఆట కూడా పని లాగా ఉంటుంది. ఎవరికీ అన్నీ తాము కోరుకుంటున్నట్లు లభించవు. అయినా లభించిన వాటిలోనే సర్దుకుపోవడం నేర్చుకోవాలి. నీ ఆకాంక్షల కోసం నిరంతరం ప్రయత్నించు కానీ నీకు లభించిన వాటితో ఆనందంగా ఉండు. నీకు లభించిన వాటికి కృతజ్ఞతతో ఉండుకాని నీకు లభించని వాటి విషయంలో కృతజ్ఞత రాహిత్యం వలదు ఇది నా ఆలోచన దృక్పథం. ఆ దృక్పథం ఇచ్చింది ఈ నా జీవితం..’’
రోడ్డు మీద పడుకున్న వాడు కూడా హాయిగా నిద్రిస్తుంటాడు. కానీ పరుపు, మంచం, ఫ్యాన్‌, ఏసీ అన్ని సౌలభ్యాలు ఉండి కూడా నిద్రపట్టడం లేదనడానికి అసంతృప్తే కారణం. మనిషి ఎప్పుడైతే నిద్రకోసం మంచం మీదకు వెళతాడో, అప్పుడే మొత్తం ప్రపంచాన్నే మరిచిపోగలగాలి కానీ మనిషికిప్పుడు అది సాధ్యం కావడం లేదు. అన్నీ ఉండి కూడా మనకు తృప్తి లేదు. ఇవన్నీ ఆనారోగ్యానికి దారితీస్తాయి.