desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2019 @ 01:40AM

సంగీత సాహిత్యాల సంగమం

రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన బాలసాహితీవేత్త కోడూరి లీలావతి సంగీత, సాహిత్యాల సమ్మేళనం. బాలసాహితీ శిఖరం. వీణా విద్వాంసురాలు. స్వాతంత్య్ర సమరయోధురాలు. మహిళా ఉపయోగార్థ రచనల రచయిత్రి, అనువాదకురాలు, గొప్పవక్త, బహుముఖ ప్రజ్ఞావంతురాలు.
 
రాజమండ్రిలో 1919 సెప్టెంబరు 19న జన్మించారు. తండ్రి దేవత శ్రీరామమూర్తి, తల్లి లక్ష్మీదేవమ్మ. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అయిన తండ్రి నుంచి జాతీయోద్యమ పోరాటం, కళాభిరుచి ఆమెకు వారసత్వంగా సంక్రమించాయి. గృహిణిగా కుటుంబాన్ని ఉన్నతంగా దిద్దుకుంటూనే సంగీత, సాహిత్యాలకు అంకితమయ్యారు.
 
1958లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన బాలసాహిత్య పోటీలలో ఆమె రచించిన ‘బాలవినోదిని’ మకుటం కలిగిన నాటికల సంపుటి బహుమతికి ఎంపికైంది. అప్పటికే ఆమె బాలసాహిత్యంలో రచయిత్రిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 1961లో రవీంద్రుని శతజయంతి సందర్బంగా ఏ.పి. ప్రభుత్వమే నిర్వహించిన బాలసాహిత్యం పోటీలలో, కుమారుడు శ్రీరామమూర్తితో సంయుక్తంగా రచించిన రచన ‘రవికవి’ కూడా బహుమతి పొందింది. ఈ రచన రవీంద్రుని జీవితచరిత్ర ఆధారంగా అల్లుకుంది. 1968, 1969, 1970లలో వరుసగా మూడేళ్ళు ఏ.పి. ప్రభుత్వపక్షాన ఏర్పాటైన బాలసాహిత్య విభాగపోటీలలో ఆమె రచనలు ‘బాలచంద్రిక’ బాలలనాటికల సంపుటి, ‘ఆశాకిరణం’ బాలలనవల, ‘కుంకుమరేఖ’ కస్తూరిబా గాంధీ జీవిత విశేషాల ఆధారంగా రూపొందిన రచన బహుమతులను సాధించుకున్నాయి. 1981లో పదేళ్ళ విరామానంతరం ‘సరోజినీనాయుడు’ జీవితగాథ భూమికగా రచించిన ‘ఇంద్రధనుస్సు’ అనే గ్రంథానికి బహుమతి లభించింది. వీటిలో ‘కుంకుమరేఖ’, ‘ఇంద్రధనుస్సు’ రచనలు రెండూ సాహిత్య అకాడమీ అవార్డులు సాధించిపెట్టాయి. ‘కుంకుమరేఖ’ ఇప్పటికి మూడు ముద్రణలుగా వచ్చింది. 1970లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ‘కుంకుమరేఖ’ను ధారావాహికంగా ప్రచురించింది.
 
స్త్రీల ప్రయోజనార్ధమై రచించిన ‘గృహ నిర్వాహణ శాస్త్రానికి’ తెలుగుభాషా సమితివారు, ‘గృహవిజ్ఞానం’ గ్రంథానికి కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖవారు బహుమతులతో ఆమెను గౌరవించారు. స్త్రీల సమస్యలను సున్నితంగా అర్ధం చేసుకోగలిగిన లీలావతి - విలక్షణ పార్శ్వాలను ఆవిష్కరించారు. ‘జయవిపంచి’ మకుటంతో, రాజమహేంద్రవరం చరిత్ర నెలవుగా, చారిత్రక నవలను సృజించారు. ఆకాశవాణిలో ఆమె రచనలు ప్రసారం అయ్యాయి. వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. లీలావతి రచనలు కొన్ని ఇతర భారతీయ భాషలలోకి అనువాదం అయ్యాయి. అమెరికా సమాచారశాఖ కోరిక మేరకు కొన్ని ఆంగ్ల రచనలను తెలుగులోకి తర్జుమా చేశారు. కొన్నేళ్ళపాటు ‘ఉదయరేఖ’ అనే వారపత్రికకు సంపాదకురాలిగా వ్యవహరించారు. ఈ వారపత్రిక రాజమండ్రి నుండి వెలువడేది.
 
సరోజినీనాయుడు జీవితాన్ని ఆవిష్కరించిన ‘ఇంద్రధనుస్సు’ రచనను ఎ.పి. ప్రభుత్వం కొన్నేళ్ళపాటు 7వ తరగతి విద్యార్థులకు ఉపవాచకంగా ఏర్పర్చింది. ప్రభుత్వ ఆకాంక్షమేరకు ఆమె మరో ఉపవాచకాన్ని కూడా సృజించారు. లీలావతి రచనలపై పరిశోధనా విద్యార్థులు పత్ర సమర్పణ చేసి, ఎం.ఫిల్‌. పట్టా పొందారు. సంగీత విద్వాంసురాలైన పూర్వరంగంలో, ఆమె ఆకాశవాణిలో అనేక సంగీత కార్యక్రమాలనిచ్చారు.
లీలావతి సంగీత కృషిని గుర్తిస్తూ నాటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ‘వీణా విశారద’ బిరుదుతో ఘనంగా సన్మానించారు. అప్పటి ఆస్థానకవి శ్రీపాదకృష్ణమూర్తి ‘కవయిత్రీమణి’ బిరుదతో అపూర్వసత్కారం చేశారు. మద్రాసు కేసరికుటీరంవారు ‘గృహలక్ష్మి’ బిరుదుతో స్వర్ణకంకణాన్ని బహూకరించారు.
 
వివిధరంగాల కృషి నేపథ్యంలో ఆమెను అనేక పదవులు వరించాయి. సంగీత నాటక అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగాను, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యులుగాను, రచయిత్రుల సలహామండలి సభ్యులుగాను, బాలల అకాడమీ సభ్యులుగాను, ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనెట్‌ సభ్యులుగాను, ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర కార్యక్రమ సలహామండలి సభ్యులుగానూ వ్యవహరించి, ఆ పదవులకే వన్నె తెచ్చారు లీలావతి. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలకు సంబంధించిన ఏ విషయం పైనైనా శ్రోతలను ఆకట్టుకొనే విధంగా అనర్గళంగా ప్రసంగించగల వక్త.
 
‘మహత్కార్యాలను సాధించిన మహనీయుల జీవితగాథలు తెలిసినంతగా, వారి అర్ధాంగుల గురించి ప్రపంచానికి తెలియదు. తమ భర్తల ఆశయాల ఆచరణకోసం, తమ ఆశలనూ, కోరికలనూ అదుపు చేసుకుని, అహర్నిశలు వారికి తోడై నిలిచిన మహిళా మూర్తుల గాథల గూర్చి పట్టించుకున్న వారు చాలా తక్కువమంది’ - అంటూ లీలావతి ‘కుంకుమరేఖ’ శీర్షికతో కస్తూరిబా గాంధీ జీవితచరిత్ర మలిచిన రచన ముందుమాటలో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని - ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసిన అవసరం వుంది.
 
1991 ఏప్రిల్‌ 16న ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. సంగీత సాహిత్యాల సంగమం, కథానాటికల రచయిత, కవయిత్రి - కోడూరి లీలావతి జీవన గమనం మహిళాలోకానికే గర్వకారణం.
 
వై.హెచ్‌.కె. మోహన్‌రావు
అధ్యక్షులు
నవ్యాంధ్ర రచయితల సంఘం,
 
­(సెప్టెంబరు 19 కోడూరి లీలావతి శతజయంతి)