Mar 8 2015 @ 03:17AM

నిలువునా ముంచేసి.. దీర్ఘాలా?

సమైక్య ఉద్యమం జోరు మీద ఉన్నప్పుడు కూడా ‘విభజన తథ్యం- ఇప్పుడు సమైక్యం కోసం కాదు. హక్కుల కోసం పోరాడండి’ అని ‘ఆంధ్రజ్యోతి’ మాత్రమే బహిరంగంగా పిలుపు ఇచ్చింది. ఫలితంగా ‘ఆంధ్రజ్యోతి’ని సమైక్య ద్రోహి అని నిందించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. ప్రజల భావోద్వేగాలతో నిమిత్తం లేకుండా వాస్తవాలు వెల్లడించవలసిన బాధ్యత మీడియాపై ఉంటుందని నమ్మడం వల్లనే మేము ఆ రోజు ఆ పిలుపు ఇచ్చాం! ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఏర్పాటు చేయాలని బహిరంగంగా ప్రకటించింది కూడా మేమే! మీరు తప్పు చేస్తున్నారు. నష్టపోతారని సీమాంధ్రులకు చెప్పింది కూడా మేమే! బాధ్యతగల మీడియా సంస్థగా వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆలోచించకుండా మా ధర్మాన్ని మేము నిర్వర్తించాం. ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నవారు చరిత్రను దాచిపెట్టలేరు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ విభజనకు నేను వ్యతిరేకం. అయినా మేడం సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు కనుక పార్లమెంటులో బిల్లు పెట్టవలసి వచ్చింది’’ ..దిగాలుగా కనిపించిన తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్‌ మాజీ ఎంపీని ఉద్దేశించి మాజీ హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఇటీవల ఇలా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు చేసినా కాంగ్రెస్‌ పార్టీకి ఉపయోగం లేకుండా పోయిందని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు ఈ సందర్భంగా అన్నారు. ‘‘తెలంగాణ వస్తే చాలని మేం అనుకున్నాం. విభజనను ఎలాగోలా అడ్డుకుందాం అని భావించిన సీమాంధ్ర నాయకులు తమ హక్కుల కోసం పోరాడటం మరిచారు. చివరకు అటూ ఇటూ అందరం మునిగిపోయాం’’ అని ఈ సంభాషణలో పాలుపంచుకున్న మరో నాయకుడు వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును ఎంత హడావుడిగా రూపొందించారో స్పష్టమవుతుంది. అందుకే ఏపీకి కాకుండా తెలంగాణకు కూడా నష్టం చేసే అంశాలు బిల్లులో ఉన్నాయి. అయినా ఆనాడు ఏమి జరగబోతోందో తెలిసి కూడా సీమాంధ్రకు న్యాయం జరిపించడానికి ప్రయత్నించని ఆనాటి కాంగ్రెస్‌ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏపీకి అన్యాయం చేశారు. ‘‘తెలంగాణ ఏర్పాటు తథ్యం. మీకు ఏమి కావాలో కోరుకోండి అని అధిష్ఠానం పదే పదే చెప్పినా మేం పట్టించుకోలేదు. అది మా వైఫల్యమే’’ అని సీమాంధ్రకు చెందిన ఒక మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరేం? పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్లే కేటాయిస్తారా? రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వరా? అంటూ ఇప్పుడు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు అందరూ కలిసి ఏపీ ప్రజలను నిలువునా ముంచేశారు. విభజనకు ముందు సమ న్యాయం చేయాలని అడిగిన చంద్రబాబు నాయుడిని గేలి చేశారు. సీమాంధ్రకు ఫలానాది చేయండి అని కోరిన నాటి కేంద్ర మంత్రులు జె.డి.శీలం, పురందేశ్వరి వంటి వారిని వేధించారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరిన చిరంజీవిని కాల్చుకుతిన్నారు. వాస్తవానికి చిరంజీవి కోరిక మేరకు హైదరాబాద్‌ను యూటీ చేయడానికి సోనియాగాంధీ కూడా ఆనాడు అంగీకరించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ ఏర్పాటుకు కూడా సోనియాగాంధీ ఒప్పుకొన్నారు. అయితే, ‘విభజనకే అంగీకరించేది లేదు’ అని పట్టుపట్టిన ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి వారు, వారి వాదనకు దన్నుగా నిలిచిన ఒకటి రెండు చానళ్ల వల్ల చివరికి ఏపీ ప్రజలు నష్టపోయారు. సమైక్య ఉద్యమం జోరు మీద ఉన్నప్పుడు కూడా ‘విభజన తథ్యం- ఇప్పుడు సమైక్యం కోసం కాదు. హక్కుల కోసం పోరాడండి’ అని ‘ఆంధ్రజ్యోతి’ మాత్రమే బహిరంగంగా పిలుపు ఇచ్చింది. ఫలితంగా ‘ఆంధ్రజ్యోతి’ని సమైక్య ద్రోహి అని నిందించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. ప్రజల భావోద్వేగాలతో నిమిత్తంలేకుండా వాస్తవాలు వెల్లడించవలసిన బాధ్యత మీడియాపై ఉంటుందని నమ్మడం వల్లనే మేము ఆ రోజు ఆ పిలుపు ఇచ్చాం! ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఏర్పాటు చేయాలని బహిరంగంగా ప్రకటించింది కూడా మేమే! మీరు తప్పు చేస్తున్నారు. నష్టపోతారని సీమాంధ్రులకు చెప్పింది కూడా మేమే! బాధ్యతగల మీడియా సంస్థగా వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆలోచించకుండా మా ధర్మాన్ని మేము నిర్వర్తించాం. ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నవారు చరిత్రను దాచిపెట్టలేరు.

 
 ముఖాముఖితో తేలిపోతుంది!
కర్ణుడి చావుకి వేయి కారణాలు అన్నట్టుగా సీమాంధ్రకు అన్యాయం జరగడానికి ఎంతో మంది మహానుభావులు కారణం. ‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బొగ్గులేరుకోవడానికి మరొకడు ప్రయత్నించాడు’ అన్నట్టుగా ఇంత జరిగిన తర్వాత కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీకి చెందిన వివిధ పార్టీల నాయకులు ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నదానికి పరులను బాధ్యులుగా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ‘తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీకేమి కావాలో అడగండి’ అని సోనియాగాంధీ కోరినా పట్టించుకోని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని దోషిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నాయకులు ఆత్మ స్తుతి- పర నిందకు పాల్పడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి ఈ వ్యవహారమే పట్టడం లేదు. ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ దాదాపుగా పూర్తి అయ్యే స్థితిలో పిడికెడు మంది తన వాళ్ల కోసం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి కొన్ని గ్రామాలలో పర్యటించారే గానీ, అయిదు కోట్ల ఏపీ ప్రజల తలరాతను నిర్ణయించబోయే అంశాలను మాత్రం పట్టించుకోవడం లేదు. కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని సామాన్యులు కూడా భావిస్తున్నప్పటికీ జగన్మోహన్‌ రెడ్డి మాత్రం ఆ విషయమై నోరు విప్పడం లేదు. రాజధాని కోసం సమీకరిస్తున్న భూమి వల్ల కొన్ని వందల మంది ఇబ్బందిపడుతూ ఉండవచ్చు. కోట్ల మంది ప్రయోజనాల సంగతి ఏమిటి? అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయవలసిందే! రోడ్లు విస్తరించాలనుకుంటే దానికి ఇరువైపులా ఉండేవారు సహకరించడం లేదా? ఇదీ అంతే! రాజధానికి 35 వేల ఎకరాలు ఎందుకు అని దీర్ఘాలు తీసేవారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారంనాడు సమాధానం ఇచ్చారు. సదుపాయాల కల్పనకు అవసరమైన భూమి పోగా మిగిలే దాంట్లో ఏడు వేల ఎకరాలు మాత్రమే ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన స్పష్టంచేశారు. ఈ వివరణ తర్వాతనైనా రాజధానిపై రాజకీయ రగడకు విపక్ష పార్టీలు స్వస్తి చెప్పి హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాయని ఆశిద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయానికి వద్దాం. ఆనాడు ఈ డిమాండ్‌ చేసింది ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ప్రత్యేక హోదా ఇస్తాం అని హామీ ఇచ్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌. ఇప్పుడు కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. వీధుల్లో మాట్లాడే మాటలకు, పార్లమెంట్‌లో మాట్లాడే మాటలకు తేడా ఉండాలి కదా? పార్లమెంట్‌లో ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇచ్చిన హామీకి విలువ ఉంటుందా? లేదా? అన్నది ఇప్పుడు తేలవలసి ఉంది! ఈ ఉద్దేశంతోనే తాను ఇచ్చిన హామీల సంగతి ఏమైంది అని మన్మోహన్‌సింగ్‌తో నేరుగా అడిగించవచ్చు కదా? అని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘ఓపెన్‌ డిబేట్‌’లో నేను కాంగ్రెస్‌ నాయకులకు సూచించాను. దానికి జె.డి.శీలం వెంటనే స్పందించి, తాను మన్మోహన్‌సింగ్‌తో మాట్లాడాననీ, రాజ్యసభలో మాట్లాడటానికి ఆయన అంగీకరించారని చెప్పారు. ఇది జరిగితే సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. మాజీ ప్రధాని అయిన మన్మోహన్‌సింగ్‌ తన హామీ సంగతి ఏమిటి? అని అడిగినప్పుడు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వక తప్పదు. మాజీ ప్రధాని, ప్రస్తుత ప్రధాని మధ్య ముఖాముఖి చర్చ జరిగితే ప్రత్యేక హోదా విషయం తేలిపోతుంది. ప్రత్యేక హోదా చట్టపరంగా అమలు సాధ్యంకాదని నరేంద్ర మోదీ చెప్పే పక్షంలో పార్లమెంట్‌లో ఇచ్చే హామీలకు, వీధుల్లో మాట్లాడుకునే మాటలకు తేడా లేదని జనానికి తెలియనైనా తెలుస్తుంది. అలాగే మిగతా హామీల విషయంలో కూడా స్పష్టత వస్తుంది. దాన్నిబట్టి మున్ముందు ఏమి చేయాలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది.
 
కలిసి కొట్లాడేనా?
‘తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడవద్దు- మీకు ఏమి కావాలో కోరుకోండి. మేం కూడా సహకరిస్తాం’ అని ఆనాడు తెలంగాణవాదులు ఇచ్చిన ఆఫర్‌ను కూడా సీమాంధ్ర నాయకులు వదులుకున్నారు. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ నాయకులు ఒక్కతాటిపై నడిచి సమైక్యతను ప్రదర్శించినప్పుడు, సీమాంధ్ర నాయకత్వం ఆ స్ఫూర్తిని ఎందుకు ప్రదర్శించలేకపోతున్నదన్నది ప్రశ్నార్థకం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని టార్గెట్‌ చేయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల న్యాయం జరిగితే పర్వాలేదు గానీ, కేంద్రంలో కనీసం ఏపీ తరఫున మాట్లాడే వారు కూడా లేకుండా పోతారన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఆ రోజు రాజ్యసభలో వెంకయ్యనాయుడు పట్టుబట్టడం వల్లనే కనీసం కొన్ని హామీలైనా లభించాయి. ఆయన కూడా పట్టించుకోకపోతే పరిస్థితి ఏమిటి? తమ సూచన మేరకే వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టారని కాంగ్రెస్‌ ఎంపీలు చెబుతున్నది కూడా నిజం కావచ్చు. పిల్లి మెడలో గంట కట్టడానికి ఎవరో ఒకరు కావాలి కదా? రాష్ట్రం తరఫున కేంద్రం వద్ద గొంతు వినిపించడానికి వెంకయ్యనాయుడుకి అండగా నిలబడితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది గానీ, ఆయనతో అస్త్ర సన్యాసం చేయించడం వల్ల ప్రయోజనం ఏమిటి? తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కేంద్ర కేబినెట్‌ నుంచి తప్పుకోవాలని కొంతమంది కోరుతున్నారు. ఇలా చేయడం అంటే చెరువు మీద అలిగినట్టే ఉంటుంది. కేంద్రంలో ప్రభుత్వం సజావుగా నడవటానికి నరేంద్ర మోదీకి ఏ మిత్రపక్షం మద్దతూ అవసరం లేదు. బీజేపీతో తెలుగుదేశం పార్టీ సంబంధాలను తెగతెంపులు చేసుకుంటే నష్టపోయేది ఏపీ ప్రజలే! ఈ విషయాన్ని గుర్తించడం వల్ల కాబోలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఇతర పార్టీ నాయకులను ఉద్దేశించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేయవద్దని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుందన్న మీమాంసలోకి పోకుండా, ఇచ్చేవాడి చేయి పైన ఉంటుంది.. తీసుకునే వాడి చేయి కింద ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తించాలి. ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రచారం జరుగుతోంది. రాజధాని నిర్మాణంతో పాటు ఇతర అంశాలలో మోదీకి క్రెడిట్‌ రాకుండా అంతా తన ఖాతాలోనే వేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, దీంతో ప్రధానమంత్రి గుర్రుగా ఉంటున్నారనీ, ఫలితంగా ఆశించిన సహాయం లభించడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతున్నదో తెలియదు గానీ అందులో వాస్తవం ఉండటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రధానమంత్రిని చంద్రబాబు పొగుడుతూనే ఉన్నారు. మోదీ సహకారంతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తాననే అంటూ వచ్చారు. నిజం చెప్పాలంటే అభిమానాన్ని చంపుకొని మరీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ ముఖ్యమంత్రి కీర్తిస్తున్నారు. ఈ ప్రచారాల సంగతి ఎలా ఉన్నా, దీనావస్థలో ఉన్న ఏపీని ఆర్థికంగా బలోపేతం చేయవలసిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంటుంది. ఆయనపై నమ్మకంతోనే ప్రజలు అధికారం అప్పగించారు కనుక ఆయన పాట్లు ఆయనే పడాలి. కేంద్రం నుంచి రావలసినవి సాధించుకోవడంలో తాము కూడా ముఖ్యమంత్రితో కలిసి నడుస్తామని మిగతా రాజకీయపక్షాలు పైకి చెబుతున్నా ఆచరణలో ఎంతవరకు సాధ్యమో తెలియదు. అందరినీ కలుపుకొని వెళ్లడానికి ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉన్నట్టు లేరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు మూడు అంశాలపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు గానీ, ఏపీ ముఖ్యమంత్రి ఇంతవరకు ఒక్క అంశంపై కూడా అఖిలపక్షాన్ని నిర్వహించలేదు. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ- తెలుగుదేశం పార్టీల మధ్య ఉప్పు- నిప్పు అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది కనుక రాష్ట్రం కోసం అందరూ ఒక్క తాటిపైకి వస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోయినా హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రయాణించడానికి కాంగ్రెస్‌ పార్టీ కొంతవరకు సుముఖంగానే ఉంది. రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజించి తమకు అన్యాయం చేసిందని కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలు ఇంకా కోపంగానే ఉన్నారు. ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించుకుని తిరిగి ప్రజాదరణ పొందడం కోసమైనా అధికార పక్షంతో కాంగ్రెస్‌ కలిసి నడుస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా అమలు వంటి విషయాలలో సోనియాగాంధీని, మన్మోహన్‌సింగ్‌ను ప్రయోగించాలని కూడా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో మాట్లాడటానికి మన్మోహన్‌సింగ్‌ను వారు ఒప్పించారు. రాష్ట్ర విభజన అనివార్యమేనని తెలిసిన తర్వాత ఏపీకి న్యాయం జరిపించడానికి జె.డి.శీలం వంటివారు చిత్తశుద్ధితోనే ప్రయత్నించారు. రాష్ట్రం విడిపోవడాన్ని ఆయన బాహాటంగానే అప్పుడూ ఇప్పుడూ సమర్థిస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ముందుపెట్టి కాంగ్రెస్‌ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నించడం అభిలషణీయం. అలా కాకుండా నా తిప్పలు ఏవో నేనే పడతాను అని ఆయన అనుకుంటే అది ఆయన ఇష్టం. అయితే ఏ రాజకీయ పార్టీ ఏ వైఖరి తీసుకున్నా అంతిమంగా అది ఏపీ ప్రజలకు మేలు జరిగేదిగా ఉండాలి. లేని పక్షంలో పార్టీలే కాదు, రాష్ట్రం కూడా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు పూర్తి అయ్యింది. ఇక మిగిలింది నాలుగు సంవత్సరాలే! ఈ నాలుగేళ్లలో పడే పునాదులే ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది నిర్ణయిస్తాయి. వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాది రాష్ర్టాలలో బీజేపీ బలం ఎంతో కొంత తగ్గుతుంది. కనుక ఆ లోటును భర్తీ చేసుకోవాలంటే దక్షిణాది రాష్ర్టాలపైనే, ముఖ్యంగా ఏపీపైనే బీజేపీ ఆధారపడవలసి ఉంటుంది. ప్రధానమంత్రిగా కనీసం పదేళ్ల పాటు ఉండాలని నరేంద్ర మోదీ భావిస్తున్నారు కనుక ఏపీకి న్యాయం చేయడంతో పాటు- తెలంగాణకు నష్టం జరగకుండా ఉదారంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది.
 రిహార్సల్స్‌ లేకుండానే..
ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా కనిపించకుండా, వినిపించకుండా పోయిన జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హఠాత్తుగా తెరపైకి వచ్చారు. ఎన్నికల తర్వాత సినిమాలకే పరిమితమైన ఆయన కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆయనను ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లారు. వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు గానీ ఒక శుభోదయాన పవన్‌ కల్యాణ్‌ రాజధాని కోసం భూములను సమీకరిస్తున్న గ్రామాలలో ప్రత్యక్షమయ్యారు. మూడు నాలుగు గంటలపాటు సాగిన తన పర్యటనలో ఆయన రెండు మూడు రకాలుగా మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు సృష్టించిన హంగామా చూసిన వారికి ఏపీ ప్రజలపై జాలి పడాలో, కోప్పడాలో తెలియని పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదనీ, ఆర్థిక సహాయం సక్రమంగా అందడం లేదనీ ఆందోళన చెందుతున్న సమయంలో, తమకు అవేమీ పట్టవనీ, తన అభిమాన హీరోను కళ్లారా చూసుకుంటే చాలుననీ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు నిరూపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన నిబద్ధత చూసిన వారికి పవన్‌ కల్యాణ్‌ అభిమానుల తీరు చూస్తే రోత పుడుతుంది. ఈ ఎపిసోడ్‌ను చూసిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ను ఏపీ ప్రజలు రాజకీయ నాయకుడిగా చూస్తున్నారా? సినిమా హీరోగా మాత్రమే చూస్తున్నారా? అన్న సస్పెన్స్‌ వీడిపోయింది. సందేహం లేదు. ఆయనను హీరోగానే చూస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా తనను తాను రాజకీయ నాయకుడిగా నిరూపించుకోవడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఒక మిత్రుడు వ్యాఖ్యానించినట్టుగా పవన్‌ కల్యాణ్‌ పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్‌ మాత్రమే! అంతేకాదు రాజకీయాలలో ఆయన అప్పుడప్పుడు గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తారు కూడా! అంతేకాదు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఉండాల్సిన పరిపక్వత తనకు లేదని పవన్‌ కల్యాణ్‌ నిరూపించుకున్నారు. రాజధాని గ్రామాల పర్యటన సందర్భంగా కాసేపు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం ప్రదర్శించారు. మరికాసేపటికి అంతా బాగుందని కితాబు ఇచ్చారు. భూములు సమీకరిస్తున్న గ్రామాల ప్రజలు పార్టీల వారీగా చీలిపోయారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు స్వచ్ఛందంగా భూములు అప్పగించగా, వైసీపీ అభిమానులు మొరాయించారు. రాష్ట్ర ప్రభుత్వం సామ దాన భేద దండోపాయాలు ప్రదర్శించి 90 శాతానికిపైగా భూ సమీకరణ పూర్తిచేసింది. ఆ దశలో రాజకీయ కారణాలతో భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న కొంత మంది రైతుల కోసం పవన్‌ కల్యాణ్‌ పర్యటన పెట్టుకుని ఉండాల్సింది కాదు. పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేసిన ఆయన మరుసటి రోజు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్వరం మార్చారు. భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ బాగుందని ప్రశంసించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధించవలసిన బాధ్యత ఎంపీలపై ఉందని ముందు రోజు ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌, మరుసటి రోజు మాటమార్చి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండవలసిన బాధ్యత బీజేపీపై ఉందని ప్రకటించారు. మొత్తంమీద ఆయన సరైన ఎక్సర్‌సైజ్‌ చేయకుండా రంగంలోకి దిగారని తేలిపోయింది. రాజకీయాలలో కొనసాగాలంటే ఆయన నిరంతరం అందుబాటులో ఉండాలి. ఆకాశంలో తారల వలె తళుక్కున మెరిసి చిటుక్కున మాయం అయితే కుదరదు. సినిమాలలో ఆయా సన్నివేశాలలో నటించే ముందు ఆయన రిహార్సల్స్‌ చేస్తారో లేదో తెలియదు గానీ రాజకీయ నాయకుడిగా స్థిరపడాలనుకుంటే చాలా రిహార్సల్స్‌ చేయవలసి ఉంటుంది. ప్రజలు తనను నాయకుడిగా చూసే పరిస్థితి కల్పించుకోవాలి. ఇందుకోసం పవన్‌ కల్యాణ్‌కు ట్యూషన్‌ అవసరమేమో తెలియదు!