Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 02 Sep 2019 06:00:33 IST

ఉద్దానం.. ఏదీ పచ్చధనం?

ఉద్దానం.. ఏదీ పచ్చధనం?

  • దెబ్బకొడుతున్న వరుస తుపాన్లు
  • తెగుళ్ల బెడదతో తగ్గిన దిగుబడులు
  • కుదేలైన కొబ్బరి రైతులు
  • నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం
(లావేరు):
జిల్లాలో ఉద్దానం పేరు వింటే చాలు పచ్చని కొబ్బరి చెట్లు గుర్తుకొస్తాయి. రెండో కోనసీమగా పేరొందిన ఈ ప్రాంతంలో వేలాది కుటుంబాలకు కొబ్బరి సాగే ప్రధాన జీవనాధారం. అయితే వరుస తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో రైతులు సతమతమవుతున్నారు. దిగుబడులు తగ్గడం, గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల చేతివాటానికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడడంతో ఉద్దాన ప్రాంతవాసులు వలసబాట పడుతున్నారు. ప్రస్తుతం కొబ్బరిని నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
 
జిల్లా ముఖద్వారమైన రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకు కొబ్బరి సాగవుతోంది. ప్రధానంగా పలాస, కవిటి, వజ్రపుకొత్తూరు, కంచిలి, మందస, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో వేలాది ఎకరాల్లో కొబ్బరితోటలు ఉన్నాయి. రణస్థలం, లావేరు మండలాల్లో కూడా అధికంగా కొబ్బరిని సాగు చేస్తున్నారు. ఉత్పత్తుల్లో శ్రీకాకుళం రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. సిక్కోలులో మొత్తంగా 35 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతోంది. ఇదిలా ఉండగా వరుసగా ప్రకృతి వైపరీత్యాలు రైతులను తీవ్ర నష్టపరుస్తున్నాయి. ఏటా తుఫాన్లు, భారీ వర్షాలు నట్టేట ముంచుతున్నాయి. ముఖ్యంగా తితలీ తుఫాన్‌ ఉద్దానాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు కొబ్బరి చెట్లన్నీ నేలకూలగా రైతులందరూ నిరాశ్రయులయ్యారు. దీనికి తోడు ఎర్రనల్లి నల్లమట్టి, ఆకుతేలు, చీడపీడలు కొబ్బరి తోటలను దెబ్బతీస్తున్నాయి. దీంతో ఎకరా తోటలో ఏడాదికి 8 వేల కాయలను చూసిన రైతు సైతం 2 వేల కాయలను మించి దిగుబడి చేయలేక పోతున్నాడు. నాణ్యత, పరిమాణం తగ్గడంతో గ్రేడులుగా చేసి, కాయలను అమ్మకాలు చేయాల్సి వస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలపై ఈ ప్రభావం అధికంగా ఉంది. చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొంతమంది వ్యాపారులు, దళారుల ధోరణితో రైతులు నిలువునా దోపిడీకి గురువుతున్నారు. మొత్తంగా కొబ్బరి పంట కుదేలవడంతో చాలామంది వలసబాట పడుతున్నారు.
 
ఆదుకోని పథకాలు
ప్రభుత్వం కొబ్బరి రైతుల కోసం వివిధ పథకాలు ప్రవేశ పెడుతున్నా.. వారికి ఏవీ ఆదుకోవడం లేదు. ఏటా తీవ్రంగా నష్టపోతున్న కొబ్బరి రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారం చేయూతనందించడంలేదు. ఇస్తున్న అర, ఒక శాతం పరిహారం కూడా నాలుగైదు ఏళ్ల అనంతరం అందుతోంది. దీంతో రైతన్నకు ఉపశమనం లభించడంలేదు. పంటకు నష్టపరిహారం అందకపోగా ఎండిపోయిన చెట్లు తొలగించేందుకు మరికొంత చేతి చమురు వదిలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
మైదాన ప్రాంతాల్లో మరోలా..
రణస్థలం, లావేరు వంటి ప్రాంతాల్లో కొబ్బరి రైతులకు ఉపాధి హామీ పథకం కాస్త ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా అనేక గ్రామాల్లో చెరువు గట్లుపై, సాగుభూముల్లో కూడా కొబ్బరి మొక్కలు పెంపకం చేపట్టారు. ఆయా తోటల్లో అంతర పంటలను వేసుకుని అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుం టున్నారు. ఇక కొబ్బరి పీచుతో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. పచ్చి డొక్కలతో తాళ్లు తయారు చేస్తున్నారు. కొమ్మల నుంచి పుల్లలు తీస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. కొబ్బరి వ్యర్థాలతో ఔత్సాహిక కళాకురులు ఎన్నో అద్భుత కళాఖండాలు తయారు చేస్తున్నారు.
 
దినోత్సవం వచ్చిందిలా..
ప్రపంచ వ్యాప్తంగా కొబ్బరి పరిశ్రమలను విస్తరించడానికి ఇండోనేషియాలోని జకార్తా పట్టణంలో 1992, సెప్టెంబరు 2న ఆసియా, పసిఫిక్‌ దేశాల ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కొబ్బరి అభివృద్ధి కోసం అనేక తీర్మానాలు చేశారు. దీంతో ఈ రోజునే అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవంగా ప్రకటించారు. నాటినుంచి సెప్టెంబరు 2న కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.