Aug 29 2019 @ 06:10AM

తెలుగు.. భవితకు వెలుగు!

  • కమ్మనైనది అమ్మభాష
  • మాతృభాషను పరిరక్షిద్దాం
  • పూర్వ వైభవానికి కృషి చేయాలంటున్న భాషాభిమానులు
  • నేడు తెలుగు భాషా దినోత్సవం
  • గిడుగు రామమూర్తి జయంతి
(హిరమండలం/శ్రీకాకుళం కల్చరల్‌/సోంపేట/
ఇచ్ఛాపురం రూరల్‌/పాతశ్రీకాకుళం/పొందూరు/రాజాం/రూరల్‌/కవిటి/హరిపురం/పలాస):
అమ్మభాష.. కమ్మనైన భాష. అమృతతుల్యమైన మాతృభాష పరిరక్షణకు, పూర్వవైభవానికి ప్రతిఒక్కరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. అ, ఆ, ఇ, ఈ మొదలైన అక్షర కుసుమాలతో తెలుగుతల్లికి పుష్పాభిషేకం చేయాల్సి ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో... ఆంగ్లం అంతర్జాతీయ భాషగా మారగా.. తెలుగుభాషకు అదే ముప్పుగా ఏర్పడింది. ఉపాధికోసం నేర్చుకున్న పరభాష మనిషి జీవితాన్ని, స్థానికతను, చివరకు మాతృభాషను మింగేసేస్థాయికి చేరింది. తెలుగు భాష మనుగడ, ఉనికి కోసం చేస్తున్న ప్రయత్నాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఆధునిక తెలుగుభాషా వికాసానికి, వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యుడైన గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా నేడు తెలుగు భాష దినోత్సవం నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
 
సృష్టిలో ప్రతి ప్రాణీ తన భావాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో మనుషులకైతే ప్రత్యేక భాష ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి వారికి యాసలు ఉంటాయి. ఎవరికి వారే తమ భాష గొప్పదని ఘనంగా చాటుకుంటారు. ఏ జాతి ప్రగతికైనా భాషే మూలం... సాక్ష్యం.. నిదర్శనం. తెలుగుభాష ఎంతో ప్రాచీనమైనది. ఈమాట ఏళ్లుగా వింటున్నాం. వాస్తవానికి ఆంగ్లభాషపై ఉన్న మక్కువ తెలుగుపై కనిపించడం లేదు. తెలుగు మాధ్యమంలో చదివేవారి సంఖ్య కూడా ఏటా తగ్గుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నేటి తరం పిల్లలు ఆంగ్లమాధ్యమ పాఠశాలల వైపు పరుగుతీయడం.. ప్రస్తుత విద్యారంగంలో ఉన్న పోటీని స్పష్టం చేస్తోంది. ఇంటర్‌, డిగ్రీ విద్యార్థుల్లో చాలామంది తెలుగులో రాయడం కష్టంగా ఉందంటే నమ్మశక్యం కాదు. ఇంజినీరింగ్‌, ఇతరత్రా ఉన్నత చదువుల్లో ఉన్న వారిలో చాలామందికి తెలుగులో రాయడం కూడా రాదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో తెలగుభాష ఔన్నత్యాన్ని, పదసొంపులు వివరించే పెద్దబాలశిక్ష ఉండేవి. ఇప్పుడా పుస్తకాలు ముద్రణకు నోచుకుంటున్నాయా అంటే లేదనే జవాబివ్వక తప్పని పరిస్థితి. సైకోలింగ్విస్టిక్‌ ప్రకారం తల్లిదండ్రులు ఏ భాషలో మాట్లాడితే పిల్లలు అందులో ప్రావీణ్యం పొందుతారు. ఆంగ్లం మీద మోజుతో ఆంగ్ల మాధ్యమాల బడుల్లో చేర్పిస్తున్నారు. చివరికి తెలుగులో మాట్లాడితే జరిమానాలు, కర్రదెబ్బలు, టీసీ ఇచ్చి ఇంటికి పంపే పాఠశాలలు ఉన్నాయి. అంతర్జాతీయ సమాజాన్ని చూసి మారటంలో తప్పుకాదు కాని తమ అస్థిత్వాన్ని, ఉనికిని, సంప్రదాయ భాషా వ్యవహారాలను మరిచిపోవడం దురదృష్టకరం. మమ్మీ, డాడీల సంస్కృతి నుంచి అమ్మానాన్నల సంస్కృతి వైపు దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.
 
ఇంటర్నెట్‌లో తెలుగువాణి..
ఇంటర్నెట్‌ అంటేనే ఇంగ్లిషు అనే మాటలు నేడు పోయాయి.. ఎంచక్కా తేనెలూరే తెలుగు భాషలో ఇంటెర్నెట్‌లో విహారం చేయవచ్చు. ఆంగ్ల భాషలో సుమారు 120 వరకు ఫాంట్లు ఉన్నా, తెలుగుకు మాత్రం ప్రస్తుతం 35వరకు ఫాంట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లోనూ తెలుగు భాష వినియోగం గణనీయంగా పెరుగుతోంది.
 
భాష పరిరక్షణ ఇలా...
ఒకటి నుంచి 5వ తరగతి వరకు విధిగా తెలుగులోనే విద్యను బోధించాలి.
బాషాభ్యుదయానికి కృషి చేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వం పారితోషికాలు అందించాలి.  తెలుగులో సంతకం స్వాభిమానానికి సంకేతమని భావించి అందరూ తెలుగులోనే సంతకాలు చేయాలి. ప్రభుత్వ కార్యకలాపాల వివరాలు, ఉత్తర ప్రత్యుత్తరాలను జీవోలకే పరిమితం చేయకుండా తెలుగులో ఉండేలా చూడాలి. తెలుగు కళలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాప్తి చేయాలి. భాషాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. భాషా పీఠాలు నెలకొల్పి భావ పరిశోధనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. నామ ఫలకాలు తెలుగులో కచ్చితంగా ఉండాల్సిందే. ప్రతి పోటీ పరీక్షల్లో మాతృ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. కవులు, రచయితలు, రంగస్థల కళాకారులను ప్రోత్సహించడం ద్వారా తెలుగును కాపాడుకునే వీలుంది. ఏది నేర్చుకోవాలన్నా దానికి తల్లి భాష మాత్రమే పునాది అనే విషయాన్ని గ్రహించాలి.
ఉత్తర్వులు..వాటి అమలు
1966 తెలుగు అధికారిక భాషా చట్టం: దీని ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలిచ్చే ఆదేశాలు తెలుగులోనే జారీ చేయాలి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు పట్టీలు తెలుగులోనే రాయాలి. అయితే ఇప్పటికీ చాలాచోట్ల వాటిని ఆంగ్లలోనే రాస్తున్నారు. తెలుగును అధికార భాషగా చట్టం చేసినప్పటికీ అమలు విషయంలో ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా, పర్యవేక్షణ కొరవడింది.
 
అకాడమీ ఏర్పాటు: 1968లో దీన్ని ఏర్పాటు చేశారు. అన్ని పాఠ్యపుస్తకాలు తెలుగులోనే ముద్రించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్‌ స్థాయిలో కూడా అకాడమీ పుస్తకాలు ఇప్పటికీ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
 
భాషా సాంస్కృతిక వికాసం(2016): తెలుగు సాహిత్యం, సంగీతం, నృత్య, నాటక, దృశ్య, కావ్య, జానపద కళల అభివృద్ధికి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ 2016 సెస్టెంబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అన్ని వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో కార్యక్రమాలు ఉండాలని ఆదేశించింది. అవి పూర్తిస్థాయిలో అమలు కాలేదు.
 
మీకు తెలుసా?
ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు 16వ స్థానంలో ఉంది. దేశంలో 4వ స్థానంలో తెలుగు కొనసాగుతోంది. ప్రపంచంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 9.2కోట్లు. కాని కొందరు చదవలేని, రాయలేని దుస్థితిలో ఉన్నారు. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తరువాత ప్రతి మాట ఆంగ్లంలోనే టైప్‌ చేస్తున్నారు. దీంతో తెలుగు లిపి కనుమరుగవుతుంది. 2008లో తెలుగుకు ప్రాచీన హోదాను కల్పించారు. ఈ నేపథ్యంలో తెలుగు భాష ప్రాచీన గ్రంథాలు , కావ్యాలు, శిలాశాసనాలను, అలిఖిత, తాళపత్రం గ్రంథాలను సేకరించడానికి కేంద్రం అప్పట్లో రూ.100 కోట్లు కేటాయించింది. కేరళ, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలు మాతృభాషకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిన తరువాతనే మిగిలిన భాషలవైపు చూస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో దురదృష్టం కొద్ది అలాంటి పరిస్థితి లేదు. మాతృభాషలోనే బోధన చేయాలన్న నిర్ణయం మేరకు 2004-05లో సవరభాష మాధ్యమంగా పార్వతీపురం ప్రాంతంలో రెండు పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఫ2005-06లో ప్రభుత్వం ఎస్‌ఈఆర్‌టీ విద్య గిరిజన సంక్షేమ శాఖ సమీకృత సలహా మండలి ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఐటీడీఏ పరిధిలో 91 గ్రామాల్లో 200 మంది నిపుణులను నియమించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కేవలం 27శాతం మంది మాత్రమే పిల్లలు తెలుగుమాధ్యమంలో చదువుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి విద్యాసాంస్కృతిక సంస్థ 2002, 2012 తీర్మానాల్లో ప్రపంచంలోని 6వేల భాషల్లో మూడువేల భాషలు కాలగర్భంలో కలిసిపోయాయని తెలిపింది. 2025నాటికి భారతదేశంలో కేవలం హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం భాషలే మిగులుతాయని స్పష్టం చేసింది.
వ్యవహారిక భాషా పితామహుడు .. గిడుగు
వ్యవహారిక భాషా పితామహుడైన గిడుగు రామమూర్తి 1863 ఆగస్టు 29న శ్రీముఖలింగం సమీపంలో ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. తండ్రి రెవెన్యూ అధికారిగా పనిచేస్తుండేవారు. 1875 వరకు ప్రాథమిక విద్య ఆ ఊళ్లోనే సాగింది. తండ్రి ఉద్యోగ రీత్యా విజయనగరం జిల్లా చోడవరం బదిలీ అయి అక్కడే స్థిరపడడంతో గిడుగు విజయనగరం జిల్లా వాసిగా గుర్తింపు పొందారు. విద్యాభాసం పూర్తయినే వెంటనే పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఓవైపు ఉన్నత చదువులు అభ్యసిస్తూ చుట్టుపక్కల నివసించే సవర జాతి ప్రజలతో పరిచయాన్ని పెంచుకున్నారు. సవర భాషలో వాచకాలు నిఘంటువులు తయారు చేశారు. నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించి విద్యావంతులను చేయడం కోసం బ్రిటిష్‌ ప్రభుత్వంతో పోరాడారు. ఆయన పోరాట పటిమకు జేజేలు పలుకుతూ ‘రావుసాహేబ్‌’ బిరుదు అందించారు. తెలుగు భాషాభివృద్ధికి సమరశంక పూరించిన ఆయన భాషలోని సరళత్వాన్ని సామాన్యుల చెంతకు తీసుకెళ్లారు. అమ్మభాషకు కమ్మనైన అర్థంతోపాటు అందలాన్ని ఎక్కించిన భాషా భగీరథుడిగా పేరొందారు. భాషకు జీవం పోసిన గిడుగు భాషలో సరళత్వాన్ని, మాధుర్యాన్ని బయట ప్రపంచానికి చూపారు. అప్పటివరకు మహా ఉద్దండులు వద్దనే ఉండిపోయిన అమ్మభాష కమ్మదనం దిశదిశలా వ్యాపించింది. ఆధునిక సాహితీ యజ్ఞంతో వాడుకలో అనేక ప్రయోగాలు చేసి, తెలుగు జాతికి మార్గనిర్దేశం చేసిన ఆయన పుట్టిన రోజును తెలుగుభాషా దినోత్సవంగా సంబరాలు చేసుకోవడం యావత్తు తెలుగు ప్రజలకు గర్వకారణమనే చెప్పాలి. ఇలా తెలుగు భాషకు పునరుజ్జీవం చేసిన గిడు రామమూర్తి 1940 జనవరి 20వ తేదీనకన్నుమూశారు.