Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 24 Feb 2015 23:53:26 IST

వృక్ష ప్రపంచ విశారదుడు - కొప్పుల హేమాద్రి

వృక్ష ప్రపంచ విశారదుడు -  కొప్పుల హేమాద్రి

డాక్టర్‌ రోళ్ళ శేషగిరిరావు గారిని నేను మొదటిసారిగా కలిసినది పూణె నగరంలో, 1963లో. ఆయన బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, వెస్టర్న్‌ సర్కిల్‌కి రీజినల్‌ బొటనిస్ట్‌. నేను ఆ సంస్థలో అట్టడుగున ఉన్న ఓ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. ఆయన తెలుగువాడిననే అభిమానం చేత ఆ ఉద్యోగాన్ని నాకిచ్చారు. బొంబాయిలో బోటనీ బీఎస్సీ (విత్‌ ఆనర్స్‌) చేసిన నేను ఆ విధంగా ఆయన పంచన చేరుకున్నాను.
రోళ్ళ గారు విశ్వ విఖ్యాత వృక్ష శాస్త్రవేత్తే కాక, మంచి పరిపాలనా దక్షత కలిగిన అధికారి. చిన్న, పెద్ద అనే బేధం లేకుండా ఆయన ప్రతి ఒక్కరికీ విడివిడిగా రీసెర్చ్‌ ప్రాజెక్టులను ఇచ్చి ప్రోత్సహించేవారు. ఇందువలన లబ్ధి పొందిన వారిలో నేను ప్రథముడిని. చిన్న పోస్ట్‌లో ఉన్నా, బొంబాయి యూనివర్సిటీలో ఎం.ఎస్సీ (బై రీసెర్చ్‌) చేసుకోవడానికి సహకరించారు. మరో విశేషం ఏమిటంటే, నా పరిశోధనా ఫలితాలు అద్భుతంగా ఉండడంతో, యూనివర్సిటీ వారి రూల్స్‌ ప్రకారం డైరెక్ట్‌గా పీహెచ్‌డీకి నా ధీసిస్‌ని సబ్‌మిట్‌ చేసుకోవడానికి అంగీకరించారు. రోళ్ళగారి గైడెన్స్‌లో డాక్టరేట్‌ పొందిన 30 మందిలో నేనే మొదటివాడిని!
రోళ్ళ గారు మొదట కాకినాడ పి.ఆర్‌. కాలేజీలో టి.యు. చాకో గారు బోటనీ హెడ్‌గా ఉన్నప్పుడు అధ్యాపకులుగా పనిచేశారు. తరువాత బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో చేరి, దాదాపు అన్ని సర్కిళ్ళలోనూ పనిచేసి, వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని, అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ఎం.ఆర్‌. అప్పారావు కోరికపై బోటనీ ప్రొఫెసర్‌గా చేరి చక్కని బొటనిస్టులను తయారు చేసారు. ఫ్లోరా ఆఫ్‌ గోవా, దీవ్‌, దమన్‌ అండ్‌నాగర్‌ హవేలి (అప్పటి యూనియన్‌ టెరిటరీ), ఫ్లోరా ఆఫ్‌ ఈస్ట్‌ గోదావరి డిస్ర్టిక్ట్‌, ఫ్లోరా ఆఫ్‌ వెస్ట్‌ గోదావరి డిస్ర్టిక్ట్‌, ఫ్లోరా ఆఫ్‌ శ్రీకాకుళం డిస్ర్టిక్ట్‌- తదితర పరిశోధనా గ్రంథాలను తన శిష్యులతో ప్రచురించారు. రోళ్ళగారు డీఎస్‌టీ, సీఎస్‌ఐఆర్‌, బీఎస్‌ ఐ, యూజీసీ రీసెర్చ్‌ ప్రాజెక్టులకు గౌరవ డైరెక్టర్‌గా ఉండేవారు.
హిమాలయాల్లో సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల పైబడి ఎత్తు ఉన్న ‘మౌంట్‌ చొ ఒయు’ అనే పర్వతారోహణ జట్టులో బొటనిస్ట్‌ సభ్యుడిగా ఉండి, మొక్కల నమూనాలను సేకరించారు రోళ్ళగారు. ఆ సందర్భంగా ప్రథమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూతో సన్మానం పొందారు. షిల్లాంగ్‌, డెహ్రడూన్‌, కోల్‌కతా- ఇత్యాది ఏ సర్కిల్‌లో రోళ్ళగారు పనిచేసినా అక్కడొక తెలుగు అసోసియేషన్‌ మొదలైపోయేది. పూణెలో అయితే ఆయన మహారాష్ట్ర స్టేట్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ను స్థాపించి జాతీయ పోటీలలో అమ్మాయిలు, అబ్బాయిల జట్లను పాల్గొనేలా చేసేవారు. ప్రముఖ పాత్రికేయుడూ, రాజకీయ విశ్లేషకుడూ అయిన వాసుదేవ దీక్షితులు కూడా మహారాష్ట్ర తరఫున ఆడిన వారిలో ఉన్నారు. అప్పుడు దీక్షితులు రీజినల్‌ రీసెర్చ్‌ లేబరేటరీ(పూనా)లో పనిచేసేవారు. రోళ్ళగారికి నాటకాల ‘పిచ్చి’ కూడా ఉంది. ‘కీర్తి శేషులు’ మొదలైన నాటకాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, అందులోని ముఖ్యపాత్రలను పోషించేవారు. తన అమ్మాయిలను కూడా నాటకాలలో అనువైన పాత్రలు ఇచ్చి నటింపజేసేవారు. ఆయన పదేళ్ళ క్రితం అనుకుంటాను- ‘అంబేద్కర్‌’ చలన చిత్రంలో మహాత్మా గాంధీ పాత్రను పోషించి ఆ పాత్రకు న్యాయం చేకూర్చారు.
రోళ్ళగారు దేశవ్యాప్తంగా అనేక వృక్షజాతులను కనుగొన్నారు. పశ్చిమ కనుమల్లో నాచేత 20 కొత్త మొక్కలను ‘డిస్కవర్‌’ చేసేటందుకు దోహదపడ్డారు. సిరపీజియా రోళ్ళ, పింపినెలా రోళ్ళ, మొఘానియా రోళ్ళ- ఈ జాతుల పేర్లు రోళ్ళగారి గౌరవార్ధం పెట్టినవే! మరో గొప్ప డిస్కవరీ అయిన ఒక కొత్త ప్రజాతి(జీనస్‌)కి ‘శేషగిరియా’ అని నేనూ నా ‘చిట్టి గురువు’ ఎం.వై. అన్సారీ కలిసి పేరు పెట్టాం! అందమైన పూలగుత్తులతో, కొబ్బరిముక్కలా కరకరలాడుతూ కమ్మని రుచిగల జంట కాయలను కాస్తూ, సహ్యాద్రి అడవుల్లో పెరిగే ఈ తీగను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘శేషగిరియా సహ్యాద్రికా అన్సారీ అండ్‌ హేమాద్రి’ అని పిలుస్తున్నారు. రోళ్ళగారితో కలిసి నేను రాసిన ‘ఆంధ్రప్రదేశ్‌లో మందుమొక్కలు’ తెలుగు అకాడమీ 1979లో ప్రచురించి అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికీ దాన్ని వైద్యులూ, విద్యార్థులూ, వనౌషధీ వ్యాపారులూ అభిమానిస్తూనే ఉన్నారు.
‘ఆంధ్రప్రదేశ్‌’లో బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా రీజినల్‌ సర్కిల్‌ స్థాపించేటందుకు రోళ్ళగారు గత ముప్పై ఏళ్ళుగా పోరాడి- అయిదేళ్ళ క్రితం అది హైదరాబాద్‌లో ప్రారంభమయ్యేలా చేశారు. హైదరాబాద్‌లో తన గృహంలో పదిలపరచిన అమూల్యమైన పరిశోధనా గ్రంథాలనూ, పత్రాలనూ బొటానికల్‌ సర్వే లైబ్రరీకి కానుకగా ఇచ్చేశారు.
యానాం టెరిటరీని అంటిపెట్టుకున్నట్లుగా ఉండే తాళ్ళరేవులో 1921, ఆగస్టు 19న జన్మించిన రోళ్ళ శేషగిరిరావు గారు ఫిబ్రవరి 23న ఢిల్లీలో కన్నుమూశారన్న వార్త నాకు శరాఘాతంలా తగిలింది. ఆయన గైడెన్స్‌లో మొదటి డాక్టరేట్‌ గ్రహీతనైన నేనంటే ఆయనకూ, ఆయన భార్య గారికీ వల్లమాలిన అభిమానం. రోళ్ళగారి నిష్క్రమణతో మనదేశం ఒక నిజమైన ‘ప్లేంట్‌ టాక్జనా మిస్ట్‌’ను, ‘ఫీల్ట్‌ బొటనిస్ట్‌’ను కోల్పోయింది. నేనైతే- నిన్న మొన్నటి వరకూ ‘ఏమోయ్‌! ఎలా ఉన్నావ్‌?’ అని ఫోన్‌లో పలకరించిన, నా బ్రతుకుతెరువుకు జీవితాంతం ఉపయోగపడే విద్యాదానం చేసిన గురువును కోల్పోయాను. గుండెల్లో బరువు. మనసులో స్తబ్ధత.
 కొప్పుల హేమాద్రి

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.