Aug 12 2019 @ 06:48AM

పుస్తకాన్ని ప్రేమించు.. విజ్ఞానాన్ని సంపాదించు!

  • గ్రంథాలయమే విద్యార్థులకు ఒక వరం
  • నేడు మహనీయుడు రంగనాథన్‌ జయంతి
  • జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
(పాతశ్రీకాకుళం):
ప్రజల ఉపయోగార్థం అన్ని రకాల పుస్తకాలను ఒక చోట చేర్చి పరిరక్షించే ప్రదేశాన్ని గ్రంథాలయాలు అంటారు. విజ్ఞాన భాండాగారాలుగా పేరొందిన గ్రంథాయాలతో భవితకు బంగారు బాటలు వేసుకోవచ్చు. ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు. లక్ష్యాలను సాఽధించొచ్చు. అయితే దేశంలో గ్రంథాలయ శాస్ర్తానికి ఒక గుర్తింపు, రూపురేఖలు తెచ్చిన మహనీయుడు డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.రంగనాథన్‌. ‘పుస్తకాలను చదువు...వాటిని ప్రేమించు... విజ్ఞానాన్ని సంపాదించుకో...నాకు మరో జన్మ ఉంటే లైబ్రేరియన్‌గా పుడతా‘ అని తెలిపిన ఘనుడు. గ్రంథాలయ అధికారులకు మార్గదర్శకంగా నిలిచిన మహోన్నతుడు. నేడు ఆయన జయంతి, జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
 
గ్రంథాలయోధ్యమంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.రంగనాథన్‌ 1892 ఆగస్టు 12న చెన్నైలోని తంజావూరు జిల్లాలో జన్మించారు. గ్రంథాలయాల పరిపుష్టి కోసం అహర్నిశలు శ్రమించి, లైబ్రేరియన్లకు ఒక గుర్తింపును, గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆయన షియాలీవో ఉన్నత పాఠశాలలో విద్య పూర్తి చేశారు. మద్రాసు ప్రిస్టియన్స్‌ కాలేజీలో బీఏ పట్టా సాధించారు. 1916లో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాసు ప్రెసిడెన్షియల్‌ కాలేజీలో మేథమెటిక్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. గ్రంఽథాలయ శాస్త్రాన్ని అభ్యసించేందుకు లండన్‌ వెళ్లారు. అక్కడే ఓ వినూత్న విధానాన్ని రూపొందించారు. 1924లో మద్రాసు యూనివర్సిటీలో క్యాలిఫైడ్‌ లైబ్రేరియన్‌గా చేరారు. 20 ఏళ్లు అక్కడ పనిచేసి 1945లో బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1947 నుంచి 1954 వరకు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేశారు. మద్రాసు గ్రంఽథాలయ సంఘానికి కార్యదర్శిగా, జాతీయ గ్రంథాలయ సంఘ అధ్యక్షుడిగా, యూజేసీ లైబ్రరి కమిటీ అధ్యక్షుడిగా తన సేవలను అందించారు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రంథాలయ శాస్త్రంలో మాస్టర్‌ డిగ్రీని ప్రారంభించిన ఘనత ఆయనకు దక్కింది. 1930లో నమూనా గ్రంథాలయ చట్టాన్ని తయారు చేసి, దేశవ్యాప్తంగా ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఆయనెంతో కృషి చేశారు. 1924లో క్లాసిఫికేషన్‌, 1934లో కేవలాగింగ్‌ కోడ్‌లను ఆయన రూపొందించారు. భారతీయ అవసరాలకు అనుగుణంగా పంచసూత్రాలను ఆచరణలో పెట్టారు. గ్రంథాలయ నిరంతరం పెరుగుతున్న సజీవ సంస్థ అని ఆయన పేర్కొన్నారు. రంగనాథన్‌ 60 గ్రంథాలు రచించారు. 200కు పైగా కథలు రాశారు. జాతీయ అంతర్జాతయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1935లో రావు సాహేబ్‌ అవార్డు లభించింది. సుమారు 80 ఏళ్లపాటు జీవించిన రంగనాథన్‌ 1972 సెప్టెంబర్‌ 27న మరణించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఏటా ఆయన జయంతి నాడు జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోనూ పలు గ్రంథాలయాల్లో సోమవారం రంగనాథన్‌ జయంతిని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.