Aug 9 2019 @ 06:55AM

హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి

  • మహోన్నత నటులతో హాస్యం పండించిన మన నటుడు
  • నేడు జయంతి..
ఇప్పటి తరానికి ఆయన పేరు కాస్త కొత్తగానే ఉంటుంది.. కానీ పాత సినిమాలు చూసేవారికి మాత్రం సుపరిచితులే. పాతతరానికి ఆయన నటన అంటే ప్రాణం.. ఆయనే రేలంగి వెంకట్రామయ్య.. వెండితెరపై ఆయనను రేలంగిగా పిలుచుకునేవారు. భారతదేశం మొత్తం మీద హస్యనటుల్లో తొలిసారిగా పద్మశ్రీ అందుకున్న ఘనత ఆయనకే దక్కింది. గోదావరి జిల్లాకు చెందిన రేలంగి తాడేపల్లిగూడెంలో స్ధిరపడ్డారు.
నేడు రేలంగి 109వ జయంతి సందర్భంగా నాటి వెండితెర హాస్యానికి చిరునామాగా మిగిలిన రేలంగి గురించి తెలుసుకుందాం..
 
భీమవరం, ఆగస్టు 8: నలుపు, తెలుపు రోజులలో హాస్యానికి చిరునామాగా వెలుగొందారు రేలంగి. ఒకే షాట్‌లో ముఖంలోని భావాలు మార్చి ప్రదర్శించడం, అందుకు అనుగుణంగా డైలాగ్‌లను టైమింగ్‌లో పలికి హాస్యం పండించడంలో ఆయనకు ఆయనే సాటిగా పేరుతెచ్చుకున్నారు. 1910 ఆగస్టు 9న తూర్పుగోదావరి జిల్లా రావులపాడులో జన్మించిన వెంకట్రామయ్య కుటుంబం తరువాత జిల్లాకు వచ్చి తాడేపల్లిగూడెంలో స్ధిరపడింది. తండ్రి సంగీతం మాస్టారు కావడంతో ఆ వారసత్వం వల్ల కాబోలు రేలంగికి చదువు మీద కంటే నటన మీదనే మోజు పెరిగింది. తండ్రి హరికథలు చెప్పేవారు. అలా రేలంగి నాటకాలు పట్ల ఆసక్తి పెంచుకున్నారు. పాటలు కూడా పాడేవారు. కాకినాడలోని యంగ్‌మెన్‌ హ్యాపీ క్లబ్‌లో చేరి నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. అలా సినిమా రంగంలోకి వెళ్ళే అవకాశం లభించింది.
 
1935లో వెండితెరపై...
 
రేలంగి వెంకట్రామయ్య 1935లో సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన శ్రీకృష్ణతులాభారం అనే సినిమాలో విధూషకుని పాత్రతో తెరపై కనిపించారు. అలా ఆ నటనతో అవకాశాలు 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలుశాఖల్లో పనిచేశారు. సి.పుల్లయ్య 1947లో గొల్లబామకు, 1948లో వచ్చిన వింధ్యారాణి సినిమాతో ఆయన సహాయ దర్శక కెరీర్‌ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన మీర్జాపురం రాజా నిర్మాణంలో 1949లో కీలుగుర్రంలో సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత సినిమాలలో నటించే అవకాశం లభించింది. కెవి రెడ్డి నిర్మించిన గుణసుందరికథ, పాతాళభైరవి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. పాతాళభైరవి సినిమాతో రాణి తమ్ముడిగా పలికిన నటన, సంభాషణలు, పాటలు మరింత గుర్తింపును తెచ్చాయి. వాహినీ నిర్మించిన పెద్ద మనుషులు సినిమాలో తిక్కశంకరయ్య పాత్రలో సమర్ధవంతంగా నటించాడు. ఆ ఊళ్ళో పెద్దమనుషుల బాగోతాలను బయట పెట్టే పాత్రలో పేరు తెచ్చుకున్నారు. విజయవారి మిస్సమ్మ సినిమాలో దేవయ్యగా నటించారు. ఇక సూపర్‌హిట్‌ సినిమా మాయాబజార్‌లో లక్ష్మణ కుమారుడి పాత్రతో అందరినీ మెప్పించారు. అప్పుచేసి పప్పుకూడులో అప్పు చేయడంలో మజా ఎలాంటిదో భజగోవిందం పాత్రతో మెప్పించారు. సత్యహరిచంద్ర, నర్తనశాల, జగదేకవీరుని కథ, ప్రేమించి చూడు, జయభేరి వంటి అనేక చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. లవకుశ సినిమాలో రజకుని పాత్రతో మెప్పించారు. చెంచులక్ష్మీ సినిమాతో నారదుడి పాత్రతో కూడా ఆయన ఆకట్టుకున్నారు. కరుణాలవాల ఇది నీకు లీల అంటూ పాట పాడారు. ఇక భీష్మలో కూడా తెలియగలేరే నీ లీలు అంటూ నారాయణ గానం భక్తిభావంతో కూడిన నటనతో మెప్పించారు. ఇలా ఎన్నో పాత సినిమాలలో ఆయన ప్రముఖ హాస్య పాత్రలతో మొప్పించారు.
 
నాలుగు దశాబ్దాలు.. 500పైగా చిత్రాలు
 
ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 500పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగా అత్యున్నత స్థానాన్ని అందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు అందుకున్నారు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. రేలంగి చిట్టచివరి చిత్రం 1975లో వచ్చిన పూజ. ఆయన తాడేపల్లిగూడెం సమీపంలోని పెంటపాడుకు చెందిన బుచ్చెమ్మను వివాహం చేసుకున్న తరువాత తాడేపల్లిగూడెం వచ్చేశారు. చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డ రేలంగి 1975 నవంబరు 27న తాడేపల్లిగూడెంలో మరణించారు. ఆయన పేరుతో తాడేపల్లిగూడెంలో రేలంగి చిత్రమందిర్‌ పేరుతో ఒక థియేటర్‌ నిర్మించారు.